గంగూలీ (PC: BCCI)
టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ జేఎస్‌డబ్ల్యూ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా నియమితుడయ్యాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్), వుమెన్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)తో పాటు దక్షిణాఫ్రికా లీగ్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్ ఫ్రాంచైజీకి ‘దాదా’ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా కొనసాగనున్నాడు.
ఐపీఎల్, డబ్ల్యూపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్లకు జేఎస్‌డబ్ల్యూతో పాటు జీఎంఆర్ గ్రూప్ సహ యజమానిగా ఉండగా... దక్షిణాఫ్రికా లీగ్‌లో జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ సొంతంగానే జట్టును కొనుగోలు చేసుకుంది. కాగా జేఎస్‌డబ్ల్యూ, జీఎంఆర్ గ్రూపుల మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం.. వచ్చే రెండేళ్లలో ఐపీఎల్ ఆపరేషన్స్ జీఎంఆర్ పర్యవేక్షించనుండగా.. జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్ డబ్ల్యూపీఎల్ వ్యవహారాలు చూసుకోనుంది.
ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీ నుంచి గురువారమే మరో కీలక ప్రకటన వెలువడిన విషయం తెలిసిందే. ఆంధ్ర మాజీ క్రికెటర్ వేణుగోపాలరావు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా ఎంపిక చేసింది.
గత సీజన్ వరకు సౌరవ్ గంగూలీ ఈ బాధ్యతలు నిర్వర్తించగా... ‘దాదా’ స్థానంలో ఇప్పుడు జట్టు యాజమాన్యం వేణుగోపాల రావును నియమించింది. ఏడేళ్లుగా ఢిల్లీ హెడ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించిన పాంటింగ్‌ను ఇటీవల తొలగించిన క్యాపిటల్స్ ... అతడి స్థానంలో భారత మాజీ ప్లేయర్ హేమంగ్ బదానీని కొత్త కోచ్‌గా ఎంపిక చేసింది. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీ చేజిక్కించుకోలేకపోయిన ఢిల్లీ క్యాపిటల్స్ వచ్చే సీజన్ కోసం ఇప్పటి నుంచి కసరత్తులు చేస్తోంది.
ఆంధ్ర ఆటగాడు వేణుగోపాలరావు జాతీయ జట్టు తరఫున 16 వన్డేలు ఆడాడు. 2009లో ఐపీఎల్ టైటిల్ గెలిచిన డెక్కన్ చార్జర్స్ జట్టులో సభ్యుడైన వేణుగోపాలరావు... గతంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున మూడు సీజన్‌లు ఆడాడు. దుబాయ్ క్యాపిటల్స్ జట్టుకు మెంటార్‌గానూ వ్యవహరించాడు.
‘ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీతో చాన్నాళ్లుగా కొనసాగుతున్నా. నా మీద నమ్మకంతో డైరెక్టర్ ఆప్ క్రికెట్ బాధ్యతలు అప్పగించింనందుకు ధన్యవాదాలు. కొత్త సవాలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నా’ అని వేణు పేర్కొన్నాడు.
మరోవైపు 47 ఏళ్ల బదానీ జాతీయ జట్టు తరఫున 4 టెస్టులు, 40 వన్డేలు ఆడాడు. అతడికి కోచింగ్‌లో అపార అనుభవం ఉంది. గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఫీల్డింగ్ కోచ్‌గా పనిచేసిన బదానీ, లంక ప్రీమియర్ లీగ్ (ఎల్‌పీఎల్)లో జాఫ్నా కింగ్స్ జట్టుకు కోచ్‌గా రెండు టైటిల్స్ అందించాడు. దక్షిణాఫ్రికా లీగ్‌లో సన్‌రైజర్స్ ఈ్రస్టెన్ కేప్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గానూ వ్యవహరించాడు. ఇటీవల ఐఎల్‌టి20లో దుబాయ్ క్యాపిటల్స్‌కు శిక్షకుడిగా పనిచేశాడు.
‘ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్‌కోచ్‌గా ఎంపికవడం ఆనందంగా ఉంది. నాపై నమ్మకముంచిన ఫ్రాంచైజీ యాజమాన్యానికి కృతజు్ఞడిని. మేగా వేలానికి ముందు కోచింగ్ బృందాన్ని సమన్వయ పరుచుకొని అత్యుత్తమ జట్టును ఎంపిక చేసుకునే ప్రయత్నం చేస్తా. క్యాపిటల్స్‌తో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’అని బదానీ అన్నాడు.
‘ఆటపై అపార అనుభవం ఉన్న బదానీ, వేణుగోపాలరావు ఢిల్లీ జట్టుతో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్నారు. కొత్త పాత్రలను వారు సమర్థవంతంగా నిర్వర్తించగలరనే నమ్మకముంది’అని ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని గ్రంధి కిరణ్ కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment