Transgenic
-
జన్యుమార్పిడి పంది కిడ్నీ గ్రహీత ఆకస్మిక మృతి
బోస్టన్: ప్రపంచంలో తొలిసారిగా జన్యుమార్పిడి చేసిన పంది మూత్రపిండాన్ని అమర్చుకున్న వ్యక్తి ఆకస్మికంగా మృతి చెందారు. అమెరికాలోని వేమౌత్ పట్టణంలో నివసించే 62 ఏళ్ల రిచర్డ్ ‘రిక్’ స్లేమాన్‌కు మసాచుసెట్స్ జనరల్ ఆస్పత్రిలో మార్చి నెలలో వైద్యులు విజయవంతంగా కిడ్నీని అమర్చారు. అది కనీసం రెండు సంవత్సరాలపాటు ఎలాంటి సమస్యల్లేకుండా పనిచేస్తుందని వైద్యులు ఆనాడు తెలిపారు. అయితే శనివారం ఆయన హఠాన్మరణం చెందారని వైద్యులు వెల్లడించారు. ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ వల్లే ఆయన మృతిచెందినట్లు ఎలాంటి ఆధారాలు ఇంకా లభ్యంకాలేదని వైద్యులు స్పష్టంచేశారు. సొంత కిడ్నీ పాడవడంతో 2018 డిసెంబర్లోనే స్లేమాన్‌కు మరో మనిషి కిడ్నీ అమర్చారు. అయితే ఐదేళ్ల తర్వాత అది నెమ్మదిగా పాడవుతూ వచి్చంది. దీంతో గత ఏడాది నుంచి మళ్లీ డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. దీంతో వైద్యులు ఈసారి మరో ప్రత్యామ్నాయంలేక జన్యుమారి్పడి పంది కిడ్నీ అమర్చేందుకు ఆయనను ఒప్పించి రెండు నెలల క్రితం అమర్చారు. -
వాడని పూలు వచ్చేస్తున్నాయ్!
గులాబీలను ప్రేమకానుకగా ఇచ్చిపుచ్చుకోవడం చాలాకాలంగా ఉన్న అలవాటే. శుభాకాంక్షలు చెప్పడానికి, అభినందనలు తెలియజేయడానికి గులాబీల గుత్తులను కానుకలుగా ఇస్తూ ఉంటారు. కనువిందు చేసే గులాబీలు ఎక్కువకాలం తాజాగా ఉండవు. ఒకటి రెండు రోజుల్లోనే వాడిపోతాయి. వాటి రేకులు రాలిపోతాయి. ఇక మీదట అంత త్వరగా వాడిపోకుండా ఉండే గులాబీలు అందుబాటులోకి రానున్నాయి. జన్యు మార్పిడి పద్ధతుల్లో త్వరగా వాడిపోని గులాబీలను సృష్టించడానికి చేసిన ప్రయోగాలు ఆశాజనకమైన ఫలితాలను ఇచ్చినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జన్యు మార్పిడి ప్రక్రియతో రూపొందించిన ఈ రకం గులాబీలు ఎక్కువకాలం తాజాగా ఉంటాయని, సాధారణమైన గులాబీల కంటే మరింత ఎక్కువ పరిమళం కలిగి ఉంటాయని వారు చెబుతున్నారు. జన్యుమార్పిడితో రూపొందించిన ఈ రకం గులాబీల మొక్కలు ఫంగల్ వ్యాధులను సమర్థంగా తట్టుకుని మరీ పెరగగలవని వివరిస్తున్నారు. చైనాకు చెందిన ‘ఓల్డ్ బుష్’ రకం గులాబీ మొక్కల్లోని లేత చిగుళ్ల నుంచి సేకరించిన డీఎన్ఏలో మార్పులను చేయడం ద్వారా ఆశాజనకమైన ఫలితాలను సాధించామని, మరిన్ని మార్పులతో పూర్తి స్థాయిలో కొత్త రకం గులాబీలను త్వరలోనే రూపొందించనున్నామని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. త్వరగా వాడిపోని, మరింత పరిమళభరితమైన గులాబీలు కొద్ది సంవత్సరాల్లోనే అందుబాటులోకి తీసుకురాగలమని బ్రిటన్‌కు చెందిన శాస్త్రవేత్త డాక్టర్ మహ్మద్ బెందహ్మానె తెలిపారు. -
జన్యుమార్పిడితో సగం తగ్గిన కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్...
ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్న కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్‌ను జన్యుమార్పిడి పద్ధతులతో తగ్గించవచ్చునని పెన్సిల్వేనియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధన స్పష్టం చేసింది. మన అవసరాలకు తగ్గట్టుగా కచ్చితమైన జన్యుమార్పులు చేయగలిగే క్రిస్పర్ క్యాస్ –9 టెక్నాలజీని వాడటం ద్వారా తాము కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్‌ను సగానికి తగ్గించగలిగామని వీరు తెలిపారు. ఏఎన్జీపీటీఎల్–3 ప్రొటీన్‌ను ఉత్పత్తి చేసే జన్యువులో సహజమైన మార్పు ఉన్నవారిలో, ఎల్డీఎల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లు తక్కువగా ఉంటాయని, ఈ జన్యుమార్పును ప్రవేశపెట్టడం ద్వారా ఇతరుల్లోనూ ఇదే ఫలితాలు సాధించవచ్చునని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త ముసునూరు కిరణ్ అంటున్నారు. ఈ నేపథ్యంలో తాము ఎలుకలపై కొన్ని ప్రయోగాలు చేశామని, ముందుగా వీటికి ఏఎన్జీపీటీఎల్–3 జన్యువులో మార్పులు చేయగల క్రిస్పర్ ఆధారిత చికిత్స ఇచ్చామని.. వారం తరువాత పరిశీలించినప్పుడు మార్పులు 35 శాతం వరకూ పూర్తయినట్లు గుర్తించామని కిరణ్ వివరించారు. దీంతోపాటే ఆ ఎలుకల్లో హానికారక కొవ్వులు సగం వరకూ తగ్గినట్లు స్పష్టమైంది. అన్నీ సవ్యంగా సాగితే ఇంకో ఐదేళ్లలో ఈ చికిత్స అందుబాటులోకి వస్తుందని.. తద్వారా గుండెజబ్బుల బారిన పడిన వారు జీవితాంతం మందులు తీసుకునే అవసరం లేకుండా పోతుందని.. జన్యుమార్పులు చేసే వ్యాక్సీన్‌ను ఒకసారి తీసుకుంటే సరిపోతుందని కిరణ్ వివరించారు. -
క్రిస్పర్తోఎన్నో వ్యాధులకు చెక్!
జన్యుమార్పులను కచ్చితంగా, సులువుగా చేయగలిగే క్రిస్పర్ టెక్నాలజీ మరో ముందడుగు వేసింది. మధుమేహంతోపాటు ఊబకాయాన్ని కూడా తగ్గించేందుకు షికాగో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు క్రిస్పర్ టెక్నాలజీతో ఒక వినూత్న పద్ధతిని ఆవిష్కరించారు. క్లోమం ద్వారా ఇన్సులిన్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేసేందుకు జీఎల్పీ1 అనే హార్మోన్ ఉపయోగపడుతుందని తెలుసు. ఇదే హార్మోన్ ఆకలిని తగ్గించగలదు. ఈ నేపథ్యంలో క్రిస్పర్ టెక్నాలజీ సాయంతో జీఎల్పీ1 హార్మోన్లో షికాగో శాస్త్రవేత్తలు మార్పులు చేసి దాని జీవితకాలాన్ని పెంచారు. దీర్ఘకాలం పాటు శరీరం మొత్తం తిరిగేలా చేయగలిగారు. ఒక యాంటీబయోటిక్ మందుకు స్పందిస్తూ జీఎల్పీ1 హార్మోన్‌ను అధికంగా ఉత్పత్తి చేసేలా చేశారు. ఈ మార్పులన్నీ చేసిన జీఎల్పీ హార్మోన్‌ను చర్మ కణాల్లోకి చొప్పించి పరిశోధన శాలలో వాటిని పెంచారు. కొంతకాలం తరువాత ఈ కణాలకు గాలి సోకేలా చేసినప్పుడు.. అవి పలు పొరలున్న చర్మం లాంటి అవయవంగా మారింది. దీన్ని ఎలుకల చర్మానికి అతికించారు. ఈ ఎలుకలు యాంటీబయోటిక్ మందుతో కూడిన ఆహారాన్ని తిన్నప్పుడు వాటిల్లో జీఎల్పీ1 ఎక్కువగా ఉత్పత్తి అయింది. ఫలితంగా రక్తంలో ఇన్సులిన్ శాతం పెరిగి మధుమేహ లక్షణాలు నెమ్మదించాయి. కొవ్వులు ఎక్కువగా ఉన్న ఆహారం తిన్నప్పుడు కూడా జన్యుమార్పిడి చర్మమున్న ఎలుకలు పెద్దగా బరువు పెరగలేదు. సాధారణ ఎలుకలు బాగా లావెక్కాయి. జన్యుమార్పిడి తాలూకు ప్రయోజనాలు పొందేందుకు ఇదో వినూత్న పద్ధతని, భవిష్యత్తులో ఇది మధుమేహం, ఊబకాయంతోపాటు అనేక ఇతర వ్యాధుల చికిత్సకూ ఉపయోగపడే అవకాశముందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త షియాంగ్ వూ అంటున్నారు. -
జన్యుమార్పిడితో...
జీవ సాంకేతిక పరిజ్ఞానంతో సత్ఫలితాలు అవగాహన సదస్సులో శాస్త్రవేత్తలు, అధికారులు తిరుపతి సిటీ: వ్యవసాయంలో జన్యుమార్పిడితోనే భవిష్యత్తులో సాగుకు సుస్థిరత ఉంటుందని వ్యవసాయ యూనివర్సిటీ విస్తరణ సంచాల కులు ఫ్రొఫెసర్ కె.రాజారెడ్డి తెలి పారు. ఆచార్య ఎన్జీరంగా ప్రాంతీ య వ్యవసాయ పరిశోధన కేంద్రం లో మంగళవారం జన్యుమార్పిడి పంటల పరిశీలన, చేపట్టాల్సిన పరిశోధనలు అనే అంశంపై ఒకరోజు వర్క్‌షాప్ నిర్వహించారు. రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ వర్సిటీ విస్తరణ సంచాలకులు ఫ్రొపెసర్ కె.రాజారెడ్డి మాట్లాడుతూ జీవ సాంకేతిక పరిజ్ఞానం మంచి ఫలితాలు ఇస్తుం దన్నారు. బయో టెక్నాలజీ ద్వారా బిటి కాటన్ తయారైందని తెలి పారు. జన్యుమార్పిడి పంటలంటే చాలామందికి తెలియడం లేదని, అందుకే ఆసక్తి చూపడం లేదని, అవగాహన కల్పించాల్సిన అవస రం ఎంతైనా ఉందని అన్నారు. తెలంగాణా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఎస్.జి.రహమాన్ మాట్లాడుతూ బీటీ పత్తి వచ్చాక తెగుళ్ల బెడద తప్పిందని చెప్పారు. బయో టెక్నాలజీ ద్వారా ఆహార పంటల్లో ఎలాంటి ఇబ్బందులూ ఉండబోవని తెలిపారు. జాతీయ బయోటెక్నాలజీ రెగ్యులేటరీ కమిషన్ ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్ బి.శశికిరణ్ మాట్లాడుతూ జీవకోటి, జంతుజాలం, పర్యావరణానికి హానికలగని రీతిలో జన్యుమార్పిడి పంటలను రైతులకు అందుబాటులోకి తేవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ పరిశోధన అధికారి టి.గిరిధర్‌కృష్ణ, ఎస్వీ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ ఎన్పీ.ఈశ్వర్‌రెడ్డి, వ్యవసాయ శాఖ రాష్ట్ర అధికారి మునిప్రసాద్రెడ్డి, వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ మురళీకృష్ణ, డాక్టర్ రమణ , ప్రతిమ, నాగమాధురి, జి.ప్రసాద్, రామకృష్ణరావు తదితరులు పాల్గొన్నారు. -
విత్తన చోరులకు రాయల్టీలెందుకు?
జన్యుమార్పిడి పత్తి విత్తనాలు విత్తన పరాధీనతకు దారితీశాయి. సమాజ సొత్తయిన స్థానిక విత్తనాలను కంపెనీల గుత్తాధిపత్యం నుంచి కాపాడుకునే దిశగా ైరె తులు కదలాలి. ఇందుకు తగిన రక్షణ చట్టాలను ప్రభుత్వం రూపొందించాలంటున్నారు ప్రొఫెసర్ ఎన్. వేణుగోపాలరావు వ్యవసాయంలో భూమి, నీరు తరువాత అత్యంత కీలకమైనవి పంట విత్తనాలు. హరిత విప్లవంలో విత్తనాల అభివృద్ధికి ప్రముఖ స్థానమిచ్చారు. నార్మన్ బోర్లాగ్నో, స్వామినాథన్నో, వ్యవసాయ విశ్వవిద్యాలయాలనో, అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థలనో తరచుగా రైతులు మననం చేసుకోటానికి ముఖ్య కారణం ఆ వ్యక్తులు, సంస్థలు ప్రవేశపెట్టిన నూతన తరం విత్తనాలే. అన్ని ముఖ్య పంటల మూల విత్తనాలు రైతులు అనాదిగా కాపాడుకుంటున్నవే. మంచి వ్యక్తీకరణ(గింజ, కాండం, వేరు, ఆకు, కాయ) గల పంట రకాన్ని గుర్తించటంలో, సంకరపరిచే నైపుణ్యతలను పెంపొందించు కోవటంలో రైతులు, గిరిజన జాతుల పాత్ర కాదనలేనిది. ప్రస్తుతం మనం రూపొందించుకున్న మెరుగైన వంగడాలకు, హైబ్రిడ్లకు మూలాలు ఆ విత్తనాలే. కానీ, విత్తనం ఇప్పుడు కంపెనీల గుత్తాధిపత్యంలోకి వెళ్లిపోయే దుస్థితి నెలకొంది. జన్యువైవిధ్యత, పెరుగుదల, వ్యక్తీకరణల వైవిధ్యాలున్న పంట మొక్కలెక్కువగా ఉష్ణ లేక సమశీతోష్ణ ప్రాంతాల్లో.. అనగా సంపదల్ని పోగెయ్యటంలో వెనుకబడ్డ(ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా) దేశాల్లో రూపొందాయి. ఈ వైవిధ్యం సంపన్న ఐరోపా, ఉత్తర అమెరికాలలో చాలా తక్కువ. అయినా జన్యుపరంపరాధారిత సైన్స్ వెలుగులో ఉద్భవించిన సాంకేతికాల ద్వారా కృత్రిమంగా పంట మొక్కల్లో జన్యువైవిధ్యతను రూపొందించగలిగాయి ధనిక దేశాలు. శాస్త్రవేత్తలు ఇతర సాంకేతికాలతో పాటు విత్తన సాంకేతికాల్ని కూడా వాణిజ్య ఆయుధాలుగా మార్చారు. అదిగో ఆ నేపథ్యంలో ప్రపంచమంతా విస్తరించినదే ‘హరిత విప్లవం’. సామాజిక స్పృహతో విస్తృతపరచిన సంపదలు సార్వత్రిక, సర్వజన పరమైన నేపథ్యంలో ఈ టెక్నాలజీలు రూపొందాయనేది అతి ముఖ్యవిషయం. మార్కెట్ శక్తుల చేతికి.. ఐతే హరిత విప్లవ విస్తరణ మలి దశలో ప్రపంచ దేశాల రాజకీయ వ్యవస్థలు మారుతూ వచ్చాయి. సమాజంలోని అన్ని వర్గాల ప్రయోజనాల్ని పర్యావరణ పటిష్టత(సుస్థిరత)ను కాపాడగల ప్రభుత్వాల స్థానంలో మార్కెట్ శక్తుల ద్వారా నియంత్రిచబడే పాలకులొచ్చారు. సైన్స్, టెక్నాలజీ పూర్తిగా వ్యాపార వర్గాల పరిష్వంగంలో చేరిపోయాయి. పేటెంట్ చట్టాలు, రాయల్టీలు వంటి వాటి ముసుగులో అన్ని వనరులతో అటు వ్యవసాయ వనరులను ప్రజల నుంచి దూరం చేసే ఒరవడి మొదలైంది. అదిగో ఆ నేపథ్యంలో వెలుగు చూసిన జన్యుమార్పిడి పంట విత్తనాలు పూర్తిగా ప్రభుత్వ(ప్రజా) సంస్థలకు దూరమై వ్యాపార వర్గాల అజమాయిషీలోకెళ్లాయి. జన్యుమార్పిడి విత్తనాల ద్వారా దిగుబడులు అనూహ్యంగా పెరుగుతూ వస్తున్నాయనే కంపెనీల ప్రచార హోరులో ప్రభుత్వాలు, శాస్త్త్రవేత్తలు, రైతులు కొట్టుకుపోయే స్థితిని తెచ్చారు. భారత వ్యవసాయరంగం చుట్టూ ఎంత పెద్ద కుట్ర అల్లుకున్నదో చూడండి.. బీటీ పత్తి ప్రహసనం బీటీ హైబ్రిడ్ వంగడాల వల్ల పత్తి దిగుబడులు అనూహ్యంగా పెరిగినట్లు మోసపూరిత ప్రచారాలు మొదలెట్టి ఇటువంటి టెక్నాలజీల్ని వరి వంటి ఇతర పంట విత్తనాల్లోకి ప్రవేశపెట్టే నేపథ్యాన్ని సృష్టించారు. కేంద్రంలో ప్రభుత్వం మారగానే కంపెనీలు, ముఖ్యంగా మోనోశాంటో, తమ విత్తన కుట్ర ఆచరణకు నడుం బిగించాయి. జన్యుమార్పిడి బీటీ విత్తనాల విషయంలో ఇప్పటి వరకూ సరైన సమాచారాన్ని ఏ కంపెనీ కూడా ప్రభుత్వాల ముందు.. శాస్త్ర, సాంకేతిక సంస్థల ముందు ఎందుకు ఉంచలేకపోతున్నాయని నోబెల్ బహుమతి గ్రహీతలైన జీవ సాంకేతిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు. బీటీ హైబ్రిడ్ విత్తనంతోనే పత్తి దిగుబడులు పెరిగాయనేది వాస్తవమైతే, అమెరికా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, చైనా దేశాల్ల్లో కేవలం బీటీ జన్యువున్న సూటి రకాలే ఎందుకు సాగు చేసున్నట్లు? అక్కడి సగటు దిగుబడులు మనకంటే ఎక్కువేననే నిజాన్ని కంపెనీలు ఎందుకు దాస్తున్నట్లు? జీవుల్ని, జంతువుల్ని గుత్త సొమ్ముగా మార్చుకోవటం అనైతికమనే ప్రపంచ స్థాయి ఒప్పందాన్ని మోన్శాంటో కంపెనీ ఎందుకు ధిక్కరిస్తున్నట్లు? బీటీ హైబ్రిడ్ విత్తనాలకు మూలాధారాలుగా నిలిచిన పత్తి వంగడాలు రైతుల నుంచి, ప్రభుత్వ సంస్థల నుంచి వచ్చినవే. వాటికి కంపెనీలు ఎంత రాయల్టీలు చెల్లిస్తున్నాయి? బీటీ హైబ్రిడ్ విత్తన ఉత్పత్తి ఖర్చుతో పోలిస్తే కంపెనీలు రైతులకు అమ్ముతున్న ధర చాలా ఎక్కువ. దానిపై ప్రభుత్వ నియంత్రణ లేకపోగా ప్రభుత్వ సంస్థల ద్వారా కంపెనీలు ఎక్కువ ధరలకు రైతులకు అమ్మడం ఎంతవరకూ వ్యాపార నీతి? బీటీ హైబ్రిడ్ పత్తిని వర్షాధారంగానూ, అల్ప భూసార నేలల్లోనూ సాగుచేసే స్థితికి తీసుకురావటానికి ప్రభుత్వ సంస్థల నిర్లక్ష్యం, కంపెనీల ప్రచార హోరు కారణం. దీనికి జవాబుదారీ ఎవరు? బీటీ పత్తివల్ల సస్యరక్షణ రసాయనాల వాడకం తగ్గిందనే ప్రచారంలో హేతుబద్ధతెంత? అతి తక్కువ ప్రమాణాల్లోనే ఘాటు విషాల్ని వదలగల నూతన రసాయనాల్ని పాత విష రసాయనాల్తో పోల్చగలమా? బీటీ హైబ్రిడ్ మాయలో పడి పోగొట్టుకుంటూ పోతున్న దేశీయ, స్థానిక పత్తి రకాల్ని ఎవరు పునరుద్ధరించగలరు? బీటీ పత్తి పేరుతో నడిచిన కుట్ర విత్తన పరాధీనతకు దారితీసింది. ఇది మనకు పాఠం నేర్పాలి! విత్తనాల్ని కాపాడుకునే ఉద్యమంలో రైతుల పాత్ర పెరగాలి. ఇందుకు తగిన రక్షణ చట్టాల్ని ప్రభుత్వం రూపొందించాలి. (వ్యాసకర్త గుంటూరులోని రైతు రక్షణ వేదిక కన్వీనర్, వ్యవసాయ విశ్వవిద్యాలయ విశ్రాంతాచార్యులు. nvgrao2002@yahoo.com) -
‘జన్యుమార్పిడి’కి బ్రేక్!
సార్వత్రిక ఎన్నికల హడావుడిలో దేశం తలమునకలై ఉన్నవేళ బహుళ జాతి విత్తన సంస్థలకు మేలు చేకూర్చేలా యూపీఏ సర్కారు తీసుకున్న నిర్ణయం ఎలాగైతేనేం నిలిచిపోయింది. మొన్న మార్చిలో కేంద్ర ప్రభు త్వ ఆధ్వర్యంలోని జన్యు సాంకేతిక అనుమతుల సంఘం(జీఈఏసీ) గోధుమ, వరి, మొక్కజొన్న, పత్తివంటి 11 పంటలకు సంబంధించిన క్షేత్రస్థాయి ప్రయోగాలకు పచ్చజెండా ఊపగా... ఈ నెల 18న నరేంద్ర మోడీ సర్కారు కూడా దాన్నే ఖరారుచేసి అందరినీ దిగ్భ్రాంతిపరిచింది. సంఘ్‌పరివార్ సంస్థలు స్వదేశీ జాగరణ్ మంచ్(ఎస్జేఎం), భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) ప్రతినిధుల జోక్యంతో ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపేసిందని తాజా కథనాలు చెబు తున్నాయి. యూపీఏ హయాంలో బహుళజాతి సంస్థల లాబీయింగ్ అడ్డూ ఆపూ లేకుండా సాగినప్పుడు నోరెత్తని కొందరు ఇప్పుడు మోడీ సర్కారుపై పరివార్ పట్టు బిగిస్తున్నదని నొచ్చుకుంటున్నారు. ఒక లాబీ యింగ్‌ను అడ్డుకోవడానికి మరో లాబీయింగ్ రంగంలోకి దిగడం వారికి ససేమిరా నచ్చినట్టులేదు. నిజానికిది లాబీయింగ్‌ల ద్వారా తేలవలసిన సమస్య కాదు. ఈ గడ్డపైనా, ఈ దేశ పౌరులపైనా ప్రజా ప్రభుత్వాలకు ఉండవలసిన బాధ్యతకు సంబంధించిన వ్యవహారమిది. వ్యవసాయ రంగంలో ఏర్పడిన సంక్షోభానికీ, పెరుగుతున్న జనాభా ఆహార అవస రాలు తీరడానికి జన్యుమార్పిడి పంటలు తప్ప గత్యంతరంలేదన్న వాద నల హోరు కొన్నాళ్లుగా బాగా పెరిగిపోయింది. అయితే, వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సంక్షోభానికి ఇది పరిష్కారం కాకపోగా దాన్ని అనేకరెట్లు పెంచే ప్రమాదమున్నదని... ఆహార, సాగు వ్యవస్థలకు జన్యుమార్పిడి పంటలు తీవ్ర విఘాతం కలిగిస్తాయని పార్లమెంటరీ స్థాయి సంఘం తన నివేదికలో స్పష్టంగా చెప్పింది. జన్యుమార్పిడి పం టల్ని ఒకసారి సాగుచేసిన నేలలో సాధారణ సేద్యం అసాధ్యమవుతుం దని వివరించింది. నేలను సారవంతంచేసి పంటపొలాలకు మేలుచేసే కోట్లాది సూక్ష్మజీవులు జన్యుమార్పిడి విత్తనాలవల్ల తుడిచిపెట్టుకుపోతా యని ఆ నివేదిక హెచ్చరించింది. రాను రాను దిగుబడి తగ్గిపోయే ప్రమాదం ఉం టుందని కూడా చెప్పింది. ఈ నివేదిక ఇంతగా చెప్పినా... పదేళ్లపాటు ఇలాంటి ప్రయోగాలకు అంగీకరించవ ద్దని సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ సూచించినా...తగిన కట్టుదిట్టాలు చేశాకే జన్యుమార్పిడి పంటలకు అనుమతులివ్వాలని సుప్రీంకోర్టు తెలిపినా యూపీఏ సర్కారు వాటన్నిటినీ పెడచెవినబె ట్టింది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖను జయంతి నటరాజన్ పర్యవేక్షిస్తున్నంతకాలమూ ఆగిపోయిన జన్యుమార్పిడి ప్రయోగాల ప్రతిపాదన... ఆ శాఖ వీరప్పమొయిలీకి వెళ్లగానే ప్రాణం పోసుకుంది. చకచకా అన్నీ కదిలిపోయాయి. జీఈఏసీ ఎక్కడలేని చురుకుదనాన్నీ ప్రదర్శించి ఈ బాపతు పంటల క్షేత్రస్థాయి ప్రయోగాలకు అనుమతిని స్తున్నట్టు ప్రకటించింది. మరికొన్ని రోజుల్లో అధికారంనుంచి నిష్ర్కమించబోయే సర్కారు ప్రమాదకర పర్యవసానాలకు దారితీయగల ఇలాంటి నిర్ణయాన్ని తీసు కోవడం నైతికంగా న్యాయమేనా అన్న ప్రశ్నకు బదులివ్వకపోగా... అంతా దేశహితం కోరే చేశామని, ఇది మన భవిష్యత్తుకు అవసరమని దబాయింపు! దేశంలో ఇప్పటికే కోటి హెక్టార్ల భూమిలో బీటీ కాటన్ పండిస్తున్నారు. బీటీ వంకాయకు అనుమతులివ్వొచ్చునంటూ 2007లో జీఈఏసీ సిఫార్సుచేసింది. అన్ని లాంఛనాలూ పూర్తయి 2010లో ప్రయోగాలకు సిద్ధమవుతుండగా అప్పటి పర్యావరణ మంత్రి జైరాంరమేష్ ఆపేశారు. వంకాయ సాగు చేసే దేశాల్లో చైనా తర్వాత స్థానం మనదే. కరువు కాలంలో కూడా మంచి దిగుబడిని అందించి రైతును ఆదుకుంటున్న ఆ పంటను జన్యుమార్పిడి విత్తనాలకు వదిలేస్తే చేటుకాలం దాపురిస్తుందని పర్యావరణవేత్తలతోపాటు రైతు సంఘాలు, ప్రజాసంఘాలు హెచ్చరించాయి. వీరందరి మాటా ఒకటే. మన దేశంలో జీవ సాంకేతిక నియంత్రణ వ్యవస్థలు లేవు. ఏ పంటను ఎలా పండించారో చెప్పే లేబిలింగ్ వ్యవస్థా లేదు. ఇవన్నీ సరిగా పని చేస్తున్నాయో లేదో చూడటానికి అవసరమైన పర్యవేక్షక సంస్థ అంతకన్నా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో జన్యుమార్పిడి పంటలకు అనుమతులిస్తే సంప్రదాయ విత్తనాలు క్రమేపీ కనుమరుగవుతాయి. విత్తనాల కోసం బహుళజాతి సంస్థలను ప్రాధేయపడే దుస్థితి ఏర్పడుతుంది. అంతేకాదు... భూసారం క్రమేపీ దెబ్బతింటుంది. ఈ వాదనలకు సంతృప్తికరమైన సమాధానాలివ్వకుండా, కూలంకషమైన చర్చకు చోటివ్వకుండా కంపెనీల లాబీయింగ్‌కు లొంగి నిర్ణయాలు తీసుకోవడం తెలివితక్కువతనం అవుతుంది. పరివార్ సంస్థల ఒత్తిళ్ల గురించి వెలువడిన కథనాలకు జడిసో, మరే కారణంచేతనో పర్యావరణ మంత్రి ప్రకాష్ జవదేకర్ జన్యు మార్పి డి పంటలపై ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదంటున్నారు. ఈ విషయంలో తొందరపడబోమంటున్నారు. వ్యవసాయ దిగుబడులు పెంచడానికి, రైతులు ఆర్ధికంగా లాభపడటానికి, ఆహార భద్రతకు తీసు కోవాల్సిన ఇతరేతర చర్యలను ఎందరో నిపుణులు సూచించారు. వాట న్నిటినీ ఉపేక్షించి, కేవలం జన్యుమార్పిడి పంటల అనుమతితోనే అంతా చక్కబడుతుందని గతంలో యూపీఏ ప్రభుత్వం చెప్పబోయింది. బహు ళజాతి సంస్థల ప్రయోజనాలను పరిరక్షించడమే ధ్యేయంగా వ్యవహ రించింది. జన్యుమార్పిడి పంటల విషయంలో అధ్యయనం చేసి నివేదిక ఇచ్చిన పార్లమెంటరీ స్థాయీ సంఘం నివేదికను కూడా పూర్తిగా విస్మరించింది. కనుక ఈ విషయంలో ఎన్డీయే ప్రభుత్వం ఆచితూచి అడుగేయాలి. ఇందులో ఇమిడివుండగల సమస్యలను అన్ని కోణా ల్లోనూ పరిశీలించాలి. మన ప్రజల అవసరాలేమిటో, మన ప్రాధమ్యా లేమిటో నిర్ధారించుకున్నాకే తుది నిర్ణయం తీసుకోవాలి. -
జన్యుమార్పిడే శరణ్యం
సంభాషణ వ్యవసాయ జీవ సాంకేతికత ఎంత విప్లవాత్మకమైనదో అంత వివాదాస్పదమైనది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొన్ని ఆహార పంటల జన్యుమార్పిడి వంగడాల క్షేత్ర ప్రయోగాలను అనుమతించింది. దీంతో జన్యు మార్పిడి పంటలపై మరోసారి చర్చ రేగింది. ఈ సందర్భంగా జీవసాంకేతిక నిపుణులు ప్రొఫెసర్ అర్జుల రామచంద్రారెడ్డితో ముఖాముఖి. అర్జుల రామచంద్రారెడ్డి(67) సుదీర్ఘకాలం అధ్యాపకునిగా, యోగి వేమన విశ్వవిద్యాలయానికి వ్యవస్థాపక వైస్ చాన్స్‌లర్‌గా పనిచేశారు. ఆ బాధ్యతలను నిర్వహిస్తూనే జన్యుమార్పిడి(జీఎం) పంటలపై నియంత్రణాధికారాలను కలిగిన ‘జెనిటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ(జీఈఏసీ)’కి సహాధ్యక్షునిగా(2009-2012) పనిచేశారు. అంతకుముందు జన్యుమార్పిడి సమీక్షా సంఘం(ఆర్సీజీఎం), అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ టాస్క్‌ఫోర్స్‌లలో సైతం పనిచేశారు. ముంచుకొస్తున్న తీవ్ర వాతావరణ మార్పులను తట్టుకుని నిలిచి, అధిక దిగుబడులకు హామీని ఇవ్వగలిగేవి జన్యుమార్పిడి పంటలేనని ఆయన స్పష్టం చేస్తున్నారు. రామచంద్రా రెడ్డితో ‘సాక్షి’ ప్రతినిధి పంతంగి రాంబాబు ముఖాముఖిలోని కొన్ని ముఖ్యాంశాలు.. కేంద్రం ఆహార పంటల జన్యుమార్పిడి వంగడాలపై క్షేత్ర ప్రయోగాలను అనుమతించడంపై వ్యక్తమౌతున్న తీవ్ర అభ్యంతరాలపై మీ అభిప్రాయం..? స్థానిక ఆహార అవసరాలను తీర్చుకోవడమనే పరిమిత లక్ష్యంతోనే మన పెద్దలు అనాదిగా వ్యవసాయం చేస్తూ వచ్చారు. ఇప్పటి పరిస్థితి వేరు. పరిశ్రమగా మారిన ఆధునిక వ్యవసాయం లక్ష్యం అధికోత్పత్తి, అధిక ఆదాయం పొందడమే. రానున్న 15-20 ఏళ్లలో ఆహారోత్పత్తిని 70% పెంచుకోవాల్సి ఉంది. ఈ శతాబ్దపు విప్లవాత్మక సాంకేతికత అయిన వ్యవసాయక బయోటెక్నాలజీ అందుకు ఒక మార్గం. జన్యుమార్పిడి పంటల ద్వారా దిగుబడులను ఏ మేరకు పెంచగలం? వంగడాలలో సహజ సిద్ధంగా ఉండే దిగుబడి సామర్థ్యాన్ని ప్రస్తుతం పూర్తిగా వినియోగించుకోలేకపోతున్నాం. వరి, గోధుమల దిగుబడి సామర్థ్యంలో 25% మేరకే ఉపయోగించుకోగలుగుతున్నాం. ఈ లోటును భర్తీ చేయడానికి జన్యుమార్పిడి పంటలు ఒక మార్గం. జన్యుమార్పిడి, ఆధునిక బ్రీడింగ్ పద్ధతుల వల్ల మొక్కజొన్న విత్తనాల సహజ సామర్థ్యంలో 75% మేరకు దిగుబడి పొందగలుగుతున్నాం. బీటీ పత్తి వచ్చిన తర్వాత మన దేశం పత్తిని దిగుమతి చేసుకోవడం మాని, ఎగుమతి చేసే దేశంగా మారిపోయింది. బీటీ పత్తి వచ్చాక రైతుల ఆత్మహత్యలు పెరిగాయి కదా..! బయోటెక్నాలజీ సాంకేతికతకు, రైతుల ఆత్మహత్యలు పెరగడానికి నేరుగా ఏ సంబంధమూ లేదు. అనేక కారణాలతో రైతులు నష్టాల పాలవుతున్నారు. ఇతర పంటలు పండించే రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం లేదా? జీఎం ఆహారం వల్ల ప్రజారోగ్యానికి ముప్పు ఉందంటున్నారు..? అమెరికాలో 20 ఏళ్ల నుంచి జన్యుమార్పిడి పంటలు పండిస్తున్నారు, వాడుతున్నారు. ఎవరూ చనిపోలేదు. జీఎం పంటల వల్ల జీవ వైవిధ్యానికి ముప్పు వాటిల్లుతుందంటున్నారు..? సాంప్రదాయ వంగడాల్లో ఔషధగుణాలున్న మాట నిజమే. కేరళలో ఔషధ గుణాలున్న వరి వంగడం ఉంది. కిలో బియ్యం రూ.450 పలుకుతుంది. కానీ, దిగుబడి చాలా తక్కువ. వేగంగా పెరుగుతున్న జనాభా, ముంచుకొస్తున్న వాతావరణ మార్పుల దృష్ట్యా బయోటెక్నాలజీ వాడకాన్ని వాయిదా వేయలేం. అందిపుచ్చుకోవాల్సిందే. జీఎం పంటల వల్ల జీవ వైవిధ్యానికి కొత్తగా జరిగిన నష్టమేమీ లేదు. దేశవాళీ వంగడాల జెర్మ్ప్లాస్మ్ను పదిలంగా భద్రపరుచుకున్నాం. ఆ విత్తనాలు సాగులో లేనంత మాత్రాన అవి పూర్తిగా అంతరించినట్లు కాదు. వాతావరణ మార్పులను తట్టుకొని నిలిచే సాంప్రదాయ వంగడాలున్నాయి కదా? వాతావరణంలో పెను మార్పులొస్తున్నాయి. రుతువులు మారిపోతున్నాయి. కరువును, నీటి ముంపును, కాలుష్యాన్ని తట్టుకొని నిలిచి, అధిక దిగుబడులనిచ్చే వంగడాలు అవసరం. సద్గుణాలున్న సంప్రదాయ వంగడాలను జీఎం వంగడాల తయారీలో పేరెంట్స్‌గా వినియోగించుకోవచ్చు. కేవలం పాత పంటలతోనే మన అవసరాలు తీరవు. అందుకే, పోషకాహార లోపాన్ని తగ్గించేందుకు గోల్డెన్ రైస్ కూడా వస్తోంది. ఏ, సీ విటమిన్లతో కూడిన ధాన్యాన్ని తెలుగు రైతు శాస్త్రవేత్త చింతల వెంకటరెడ్డి పండిస్తున్నారు. ఎండిన మట్టిని ఎరువుగా వాడుతున్నారు. దీనిపై మీ అభిప్రాయం? సాంప్రదాయ విజ్ఞానంతో రైతులు వినూత్న సాగు పద్ధతులను అనుసరిస్తూ చక్కటి ఫలితాలు పొందుతుంటారు. వాటిని ప్రభుత్వం విస్మరించకూడదు, గుర్తించాలి. ప్రభుత్వ రంగ వ్యవసాయ పరిశోధన సంస్థలు అటువంటి ఆవిష్కరణలను పరిశోధనాంశాలుగా స్వీకరించాలి. జీఎం పంటలపై ప్రజల్లో ఉన్న సందేహాల మాటేమిటి? జన్యుమార్పిడి వంగడాలను తయారుచేస్తున్న కంపెనీలు జీవ భద్రతకు సంబంధించిన చర్యలను సక్రమంగా పాటిస్తున్నప్పటికీ.. వాటిపై ప్రజల్లో, ప్రజాసంఘాల్లో కొన్ని అనుమానాలు, సందేహాలు ఉన్న మాట నిజం. మన జెనిటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ (జీఈఏసీ) వంటి నియంత్రణ వ్యవస్థలు బాగానే పనిచేస్తున్నాయి. అయితే మారుతున్న అవసరాల రీత్యా వాటిని మరింత పటిష్టం చేయాలి. పూర్తికాలం స్వతంత్రంగా పనిచేసే నిపుణులను అందులో నియమించాలి. జీఎం వంగడాలను తయారుచేస్తున్న కంపెనీలు ప్రభుత్వ నిబంధనలకు కట్టుబడి సురక్షితమైన వంగడాలను రూపొందించాలి. జీవ భద్రత ప్రక్రియలపై అప్రమత్తత అవసరం. బయోటెక్నాలజీ చెడు ప్రభావాలపై ఎటువంటి కచ్చితమైన ఆధారాల్లేవు. అంతమాత్రాన నిర్లక్ష్యంగా ఉండలేం. కొత్తగా మరికొన్ని జన్యుమార్పిడి పంటలను ప్రవేశపెడుతున్న దృష్ట్యా మరింత పటిష్టమైన నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం అవసరం. ఎటువంటి చర్యలు చేపట్టాలంటారు..? జన్యుమార్పిడి వంగడాల రూపకల్పన ప్రక్రియలోజీవ భద్రతకు ఢోకా లేకుండా చూడాలి. ఈ బాధ్యత ప్రభుత్వం, ప్రభుత్వ రంగ వ్యవసాయ పరిశోధన సంస్థలు, ప్రైవేటు కంపెనీలపై ఉంది. పరిశోధనా రంగానికి, జీవభద్రత ప్రక్రియలకు మరిన్ని నిధులను కేటాయించాలి. మన దేశంలోని సకల ఆధునిక సదుపాయాలున్న లేబొరేటరీల్లో జెనిటిక్ టెస్టింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. జీవభద్రతపై శిక్షణ అవకాశాలు పెంచాలి. మొక్కజొన్న, పత్తి, సోయాబీన్స్ వంటి అంతర్జాతీయ పంటలపై ఇప్పటికే బహుళజాతి కంపెనీలు పరిశోధనలు సాగిస్తున్నాయి. కానీ, శనగ, ఆముదం, మిరప, బెండ వంటి స్థానిక పంటల జన్యుమార్పిడి వంగడాల తయారీపై భారతీయ కంపెనీలు, భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి, విశ్వవిద్యాలయాలు ఇప్పుడు దృష్టిపెట్టాయి. ఈ నేపథ్యంలో జన్యుమార్పిడి పంటలపై ప్రజల్లో ఉన్న సందేహాలను, భయాందోళనలను నివృత్తి చేయడం అవసరం. అది సజావుగా జరగాలంటే.. ప్రభుత్వ నియంత్రణ యంత్రాంగాన్ని మరింత పటిష్టం చేయడంతో పాటు, ప్రజల్లో చైతన్యాన్ని కలిగించే ప్రయత్నాలు జరగాలి. రైతుల భాగస్వామ్యం లేకుండా ఈ టెక్నాలజీని ముందుకు తీసుకెళ్లడం కష్టం. అప్పుడే జన్యుమార్పిడి పంటలపై ప్రజలకు పూర్తి నమ్మకం కలుగుతుంది. చైనా నుంచి మనం నేర్చుకోవాల్సిందేమైనా ఉందా? జన్యుమార్పిడి పంటలను మనకన్నా చైనా సమర్థవంతంగా ఉపయోగించుకుంటున్నది. చైనా ఈ పరిశోధనలపై చేస్తున్న ఖర్చులో సగం కూడా మనం వెచ్చించడం లేదు. ఈ రంగంలో కృషి చేస్తున్న శాస్త్రవేత్తల సంఖ్య కూడా అక్కడ చాలా ఎక్కువ.