సార్వత్రిక ఎన్నికల హడావుడిలో దేశం తలమునకలై ఉన్నవేళ బహుళ జాతి విత్తన సంస్థలకు మేలు చేకూర్చేలా యూపీఏ సర్కారు తీసుకున్న నిర్ణయం ఎలాగైతేనేం నిలిచిపోయింది. మొన్న మార్చిలో కేంద్ర ప్రభు త్వ ఆధ్వర్యంలోని జన్యు సాంకేతిక అనుమతుల సంఘం(జీఈఏసీ) గోధుమ, వరి, మొక్కజొన్న, పత్తివంటి 11 పంటలకు సంబంధించిన క్షేత్రస్థాయి ప్రయోగాలకు పచ్చజెండా ఊపగా... ఈ నెల 18న నరేంద్ర మోడీ సర్కారు కూడా దాన్నే ఖరారుచేసి అందరినీ దిగ్భ్రాంతిపరిచింది. సంఘ్‌పరివార్ సంస్థలు స్వదేశీ జాగరణ్ మంచ్(ఎస్‌జేఎం), భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) ప్రతినిధుల జోక్యంతో ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపేసిందని తాజా కథనాలు చెబు తున్నాయి. యూపీఏ హయాంలో బహుళజాతి సంస్థల లాబీయింగ్ అడ్డూ ఆపూ లేకుండా సాగినప్పుడు నోరెత్తని కొందరు ఇప్పుడు మోడీ సర్కారుపై పరివార్ పట్టు బిగిస్తున్నదని నొచ్చుకుంటున్నారు. ఒక లాబీ యింగ్‌ను అడ్డుకోవడానికి మరో లాబీయింగ్ రంగంలోకి దిగడం వారికి ససేమిరా నచ్చినట్టులేదు.
నిజానికిది లాబీయింగ్‌ల ద్వారా తేలవలసిన సమస్య కాదు. ఈ గడ్డపైనా, ఈ దేశ పౌరులపైనా ప్రజా ప్రభుత్వాలకు ఉండవలసిన బాధ్యతకు సంబంధించిన వ్యవహారమిది. వ్యవసాయ రంగంలో ఏర్పడిన సంక్షోభానికీ, పెరుగుతున్న జనాభా ఆహార అవస రాలు తీరడానికి జన్యుమార్పిడి పంటలు తప్ప గత్యంతరంలేదన్న వాద నల హోరు కొన్నాళ్లుగా బాగా పెరిగిపోయింది. అయితే, వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సంక్షోభానికి ఇది పరిష్కారం కాకపోగా దాన్ని అనేకరెట్లు పెంచే ప్రమాదమున్నదని... ఆహార, సాగు వ్యవస్థలకు జన్యుమార్పిడి పంటలు తీవ్ర విఘాతం కలిగిస్తాయని పార్లమెంటరీ స్థాయి సంఘం తన నివేదికలో స్పష్టంగా చెప్పింది. జన్యుమార్పిడి పం టల్ని ఒకసారి సాగుచేసిన నేలలో సాధారణ సేద్యం అసాధ్యమవుతుం దని వివరించింది. నేలను సారవంతంచేసి పంటపొలాలకు మేలుచేసే కోట్లాది సూక్ష్మజీవులు జన్యుమార్పిడి విత్తనాలవల్ల తుడిచిపెట్టుకుపోతా యని ఆ నివేదిక హెచ్చరించింది. రాను రాను దిగుబడి తగ్గిపోయే ప్రమాదం ఉం టుందని కూడా చెప్పింది. ఈ నివేదిక ఇంతగా చెప్పినా... పదేళ్లపాటు ఇలాంటి ప్రయోగాలకు అంగీకరించవ ద్దని సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ సూచించినా...తగిన కట్టుదిట్టాలు చేశాకే జన్యుమార్పిడి పంటలకు అనుమతులివ్వాలని సుప్రీంకోర్టు తెలిపినా యూపీఏ సర్కారు వాటన్నిటినీ పెడచెవినబె ట్టింది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖను జయంతి నటరాజన్ పర్యవేక్షిస్తున్నంతకాలమూ ఆగిపోయిన జన్యుమార్పిడి ప్రయోగాల ప్రతిపాదన... ఆ శాఖ వీరప్పమొయిలీకి వెళ్లగానే ప్రాణం పోసుకుంది. చకచకా అన్నీ కదిలిపోయాయి. జీఈఏసీ ఎక్కడలేని చురుకుదనాన్నీ ప్రదర్శించి ఈ బాపతు పంటల క్షేత్రస్థాయి ప్రయోగాలకు అనుమతిని స్తున్నట్టు ప్రకటించింది.
మరికొన్ని రోజుల్లో అధికారంనుంచి నిష్ర్కమించబోయే సర్కారు ప్రమాదకర పర్యవసానాలకు దారితీయగల ఇలాంటి నిర్ణయాన్ని తీసు కోవడం నైతికంగా న్యాయమేనా అన్న ప్రశ్నకు బదులివ్వకపోగా... అంతా దేశహితం కోరే చేశామని, ఇది మన భవిష్యత్తుకు అవసరమని దబాయింపు! దేశంలో ఇప్పటికే కోటి హెక్టార్ల భూమిలో బీటీ కాటన్ పండిస్తున్నారు. బీటీ వంకాయకు అనుమతులివ్వొచ్చునంటూ 2007లో జీఈఏసీ సిఫార్సుచేసింది. అన్ని లాంఛనాలూ పూర్తయి 2010లో ప్రయోగాలకు సిద్ధమవుతుండగా అప్పటి పర్యావరణ మంత్రి జైరాంరమేష్ ఆపేశారు. వంకాయ సాగు చేసే దేశాల్లో చైనా తర్వాత స్థానం మనదే. కరువు కాలంలో కూడా మంచి దిగుబడిని అందించి రైతును ఆదుకుంటున్న ఆ పంటను జన్యుమార్పిడి విత్తనాలకు వదిలేస్తే చేటుకాలం దాపురిస్తుందని పర్యావరణవేత్తలతోపాటు రైతు సంఘాలు, ప్రజాసంఘాలు హెచ్చరించాయి. వీరందరి మాటా ఒకటే. మన దేశంలో జీవ సాంకేతిక నియంత్రణ వ్యవస్థలు లేవు. ఏ పంటను ఎలా పండించారో చెప్పే లేబిలింగ్ వ్యవస్థా లేదు. ఇవన్నీ సరిగా పని చేస్తున్నాయో లేదో చూడటానికి అవసరమైన పర్యవేక్షక సంస్థ అంతకన్నా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో జన్యుమార్పిడి పంటలకు అనుమతులిస్తే సంప్రదాయ విత్తనాలు క్రమేపీ కనుమరుగవుతాయి. విత్తనాల కోసం బహుళజాతి సంస్థలను ప్రాధేయపడే దుస్థితి ఏర్పడుతుంది. అంతేకాదు... భూసారం క్రమేపీ దెబ్బతింటుంది. ఈ వాదనలకు సంతృప్తికరమైన సమాధానాలివ్వకుండా, కూలంకషమైన చర్చకు చోటివ్వకుండా కంపెనీల లాబీయింగ్‌కు లొంగి నిర్ణయాలు తీసుకోవడం తెలివితక్కువతనం అవుతుంది.
పరివార్ సంస్థల ఒత్తిళ్ల గురించి వెలువడిన కథనాలకు జడిసో, మరే కారణంచేతనో పర్యావరణ మంత్రి ప్రకాష్ జవదేకర్ జన్యు మార్పి డి పంటలపై ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదంటున్నారు. ఈ విషయంలో తొందరపడబోమంటున్నారు. వ్యవసాయ దిగుబడులు పెంచడానికి, రైతులు ఆర్ధికంగా లాభపడటానికి, ఆహార భద్రతకు తీసు కోవాల్సిన ఇతరేతర చర్యలను ఎందరో నిపుణులు సూచించారు. వాట న్నిటినీ ఉపేక్షించి, కేవలం జన్యుమార్పిడి పంటల అనుమతితోనే అంతా చక్కబడుతుందని గతంలో యూపీఏ ప్రభుత్వం చెప్పబోయింది. బహు ళజాతి సంస్థల ప్రయోజనాలను పరిరక్షించడమే ధ్యేయంగా వ్యవహ రించింది. జన్యుమార్పిడి పంటల విషయంలో అధ్యయనం చేసి నివేదిక ఇచ్చిన పార్లమెంటరీ స్థాయీ సంఘం నివేదికను కూడా పూర్తిగా విస్మరించింది. కనుక ఈ విషయంలో ఎన్డీయే ప్రభుత్వం ఆచితూచి అడుగేయాలి. ఇందులో ఇమిడివుండగల సమస్యలను అన్ని కోణా ల్లోనూ పరిశీలించాలి. మన ప్రజల అవసరాలేమిటో, మన ప్రాధమ్యా లేమిటో నిర్ధారించుకున్నాకే తుది నిర్ణయం తీసుకోవాలి.
‘జన్యుమార్పిడి’కి బ్రేక్!
Published Thu, Jul 31 2014 1:16 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement
Advertisement