జన్యుమార్పిడే శరణ్యం
సంభాషణ
వ్యవసాయ జీవ సాంకేతికత ఎంత విప్లవాత్మకమైనదో అంత వివాదాస్పదమైనది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొన్ని ఆహార పంటల జన్యుమార్పిడి వంగడాల క్షేత్ర ప్రయోగాలను అనుమతించింది. దీంతో జన్యు మార్పిడి పంటలపై మరోసారి చర్చ రేగింది. ఈ సందర్భంగా జీవసాంకేతిక నిపుణులు ప్రొఫెసర్ అర్జుల రామచంద్రారెడ్డితో ముఖాముఖి.
అర్జుల రామచంద్రారెడ్డి(67) సుదీర్ఘకాలం అధ్యాపకునిగా, యోగి వేమన విశ్వవిద్యాలయానికి వ్యవస్థాపక వైస్ చాన్స్‌లర్‌గా పనిచేశారు. ఆ బాధ్యతలను నిర్వహిస్తూనే జన్యుమార్పిడి(జీఎం) పంటలపై నియంత్రణాధికారాలను కలిగిన ‘జెనిటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ(జీఈఏసీ)’కి సహాధ్యక్షునిగా(2009-2012) పనిచేశారు. అంతకుముందు జన్యుమార్పిడి సమీక్షా సంఘం(ఆర్సీజీఎం), అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ టాస్క్‌ఫోర్స్‌లలో సైతం పనిచేశారు. ముంచుకొస్తున్న తీవ్ర వాతావరణ మార్పులను తట్టుకుని నిలిచి, అధిక దిగుబడులకు హామీని ఇవ్వగలిగేవి జన్యుమార్పిడి పంటలేనని ఆయన స్పష్టం చేస్తున్నారు. రామచంద్రా రెడ్డితో ‘సాక్షి’ ప్రతినిధి పంతంగి రాంబాబు ముఖాముఖిలోని కొన్ని ముఖ్యాంశాలు..
కేంద్రం ఆహార పంటల జన్యుమార్పిడి వంగడాలపై క్షేత్ర ప్రయోగాలను అనుమతించడంపై వ్యక్తమౌతున్న తీవ్ర అభ్యంతరాలపై మీ అభిప్రాయం..? స్థానిక ఆహార అవసరాలను తీర్చుకోవడమనే పరిమిత లక్ష్యంతోనే మన పెద్దలు అనాదిగా వ్యవసాయం చేస్తూ వచ్చారు. ఇప్పటి పరిస్థితి వేరు. పరిశ్రమగా మారిన ఆధునిక వ్యవసాయం లక్ష్యం అధికోత్పత్తి, అధిక ఆదాయం పొందడమే. రానున్న 15-20 ఏళ్లలో ఆహారోత్పత్తిని 70% పెంచుకోవాల్సి ఉంది. ఈ శతాబ్దపు విప్లవాత్మక సాంకేతికత అయిన వ్యవసాయక బయోటెక్నాలజీ అందుకు ఒక మార్గం.
జన్యుమార్పిడి పంటల ద్వారా దిగుబడులను ఏ మేరకు పెంచగలం?
వంగడాలలో సహజ సిద్ధంగా ఉండే దిగుబడి సామర్థ్యాన్ని ప్రస్తుతం పూర్తిగా వినియోగించుకోలేకపోతున్నాం. వరి, గోధుమల దిగుబడి సామర్థ్యంలో 25% మేరకే ఉపయోగించుకోగలుగుతున్నాం. ఈ లోటును భర్తీ చేయడానికి జన్యుమార్పిడి పంటలు ఒక మార్గం. జన్యుమార్పిడి, ఆధునిక బ్రీడింగ్ పద్ధతుల వల్ల మొక్కజొన్న విత్తనాల సహజ సామర్థ్యంలో 75% మేరకు దిగుబడి పొందగలుగుతున్నాం. బీటీ పత్తి వచ్చిన తర్వాత మన దేశం పత్తిని దిగుమతి చేసుకోవడం మాని, ఎగుమతి చేసే దేశంగా మారిపోయింది.
బీటీ పత్తి వచ్చాక రైతుల ఆత్మహత్యలు పెరిగాయి కదా..!
బయోటెక్నాలజీ సాంకేతికతకు, రైతుల ఆత్మహత్యలు పెరగడానికి నేరుగా ఏ సంబంధమూ లేదు. అనేక కారణాలతో రైతులు నష్టాల పాలవుతున్నారు. ఇతర పంటలు పండించే రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం లేదా? జీఎం ఆహారం వల్ల ప్రజారోగ్యానికి ముప్పు ఉందంటున్నారు..? అమెరికాలో 20 ఏళ్ల నుంచి జన్యుమార్పిడి పంటలు పండిస్తున్నారు, వాడుతున్నారు. ఎవరూ చనిపోలేదు.
జీఎం పంటల వల్ల జీవ వైవిధ్యానికి ముప్పు వాటిల్లుతుందంటున్నారు..?
సాంప్రదాయ వంగడాల్లో ఔషధగుణాలున్న మాట నిజమే. కేరళలో ఔషధ గుణాలున్న వరి వంగడం ఉంది. కిలో బియ్యం రూ.450 పలుకుతుంది. కానీ, దిగుబడి చాలా తక్కువ. వేగంగా పెరుగుతున్న జనాభా, ముంచుకొస్తున్న వాతావరణ మార్పుల దృష్ట్యా బయోటెక్నాలజీ వాడకాన్ని వాయిదా వేయలేం. అందిపుచ్చుకోవాల్సిందే. జీఎం పంటల వల్ల జీవ వైవిధ్యానికి కొత్తగా జరిగిన నష్టమేమీ లేదు. దేశవాళీ వంగడాల జెర్మ్‌ప్లాస్మ్‌ను పదిలంగా భద్రపరుచుకున్నాం. ఆ విత్తనాలు సాగులో లేనంత మాత్రాన అవి పూర్తిగా అంతరించినట్లు కాదు.
వాతావరణ మార్పులను తట్టుకొని నిలిచే సాంప్రదాయ వంగడాలున్నాయి కదా?
వాతావరణంలో పెను మార్పులొస్తున్నాయి. రుతువులు మారిపోతున్నాయి. కరువును, నీటి ముంపును, కాలుష్యాన్ని తట్టుకొని నిలిచి, అధిక దిగుబడులనిచ్చే వంగడాలు అవసరం. సద్గుణాలున్న సంప్రదాయ వంగడాలను జీఎం వంగడాల తయారీలో పేరెంట్స్‌గా వినియోగించుకోవచ్చు. కేవలం పాత పంటలతోనే మన అవసరాలు తీరవు. అందుకే, పోషకాహార లోపాన్ని తగ్గించేందుకు గోల్డెన్ రైస్ కూడా వస్తోంది.
ఏ, సీ విటమిన్లతో కూడిన ధాన్యాన్ని తెలుగు రైతు శాస్త్రవేత్త చింతల వెంకటరెడ్డి పండిస్తున్నారు. ఎండిన మట్టిని ఎరువుగా వాడుతున్నారు. దీనిపై మీ అభిప్రాయం?
సాంప్రదాయ విజ్ఞానంతో రైతులు వినూత్న సాగు పద్ధతులను అనుసరిస్తూ చక్కటి ఫలితాలు పొందుతుంటారు. వాటిని ప్రభుత్వం విస్మరించకూడదు, గుర్తించాలి. ప్రభుత్వ రంగ వ్యవసాయ పరిశోధన సంస్థలు అటువంటి ఆవిష్కరణలను పరిశోధనాంశాలుగా స్వీకరించాలి.
జీఎం పంటలపై ప్రజల్లో ఉన్న సందేహాల మాటేమిటి?
జన్యుమార్పిడి వంగడాలను తయారుచేస్తున్న కంపెనీలు జీవ భద్రతకు సంబంధించిన చర్యలను సక్రమంగా పాటిస్తున్నప్పటికీ.. వాటిపై ప్రజల్లో, ప్రజాసంఘాల్లో కొన్ని అనుమానాలు, సందేహాలు ఉన్న మాట నిజం. మన జెనిటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ (జీఈఏసీ) వంటి నియంత్రణ వ్యవస్థలు బాగానే పనిచేస్తున్నాయి. అయితే మారుతున్న అవసరాల రీత్యా వాటిని మరింత పటిష్టం చేయాలి. పూర్తికాలం స్వతంత్రంగా పనిచేసే నిపుణులను అందులో నియమించాలి. జీఎం వంగడాలను తయారుచేస్తున్న కంపెనీలు ప్రభుత్వ నిబంధనలకు కట్టుబడి సురక్షితమైన వంగడాలను రూపొందించాలి. జీవ భద్రత ప్రక్రియలపై అప్రమత్తత అవసరం. బయోటెక్నాలజీ చెడు ప్రభావాలపై ఎటువంటి కచ్చితమైన ఆధారాల్లేవు. అంతమాత్రాన నిర్లక్ష్యంగా ఉండలేం. కొత్తగా మరికొన్ని జన్యుమార్పిడి పంటలను ప్రవేశపెడుతున్న దృష్ట్యా మరింత పటిష్టమైన నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం అవసరం.
ఎటువంటి చర్యలు చేపట్టాలంటారు..?
జన్యుమార్పిడి వంగడాల రూపకల్పన ప్రక్రియలోజీవ భద్రతకు ఢోకా లేకుండా చూడాలి. ఈ బాధ్యత ప్రభుత్వం, ప్రభుత్వ రంగ వ్యవసాయ పరిశోధన సంస్థలు, ప్రైవేటు కంపెనీలపై ఉంది. పరిశోధనా రంగానికి, జీవభద్రత ప్రక్రియలకు మరిన్ని నిధులను కేటాయించాలి. మన దేశంలోని సకల ఆధునిక సదుపాయాలున్న లేబొరేటరీల్లో జెనిటిక్ టెస్టింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. జీవభద్రతపై శిక్షణ అవకాశాలు పెంచాలి. మొక్కజొన్న, పత్తి, సోయాబీన్స్ వంటి అంతర్జాతీయ పంటలపై ఇప్పటికే బహుళజాతి కంపెనీలు పరిశోధనలు సాగిస్తున్నాయి. కానీ, శనగ, ఆముదం, మిరప, బెండ వంటి స్థానిక పంటల జన్యుమార్పిడి వంగడాల తయారీపై భారతీయ కంపెనీలు, భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి, విశ్వవిద్యాలయాలు ఇప్పుడు దృష్టిపెట్టాయి. ఈ నేపథ్యంలో జన్యుమార్పిడి పంటలపై ప్రజల్లో ఉన్న సందేహాలను, భయాందోళనలను నివృత్తి చేయడం అవసరం. అది సజావుగా జరగాలంటే.. ప్రభుత్వ నియంత్రణ యంత్రాంగాన్ని మరింత పటిష్టం చేయడంతో పాటు, ప్రజల్లో చైతన్యాన్ని కలిగించే ప్రయత్నాలు జరగాలి. రైతుల భాగస్వామ్యం లేకుండా ఈ టెక్నాలజీని ముందుకు తీసుకెళ్లడం కష్టం. అప్పుడే జన్యుమార్పిడి పంటలపై ప్రజలకు పూర్తి నమ్మకం కలుగుతుంది.
చైనా నుంచి మనం నేర్చుకోవాల్సిందేమైనా ఉందా?
జన్యుమార్పిడి పంటలను మనకన్నా చైనా సమర్థవంతంగా ఉపయోగించుకుంటున్నది. చైనా ఈ పరిశోధనలపై చేస్తున్న ఖర్చులో సగం కూడా మనం వెచ్చించడం లేదు. ఈ రంగంలో కృషి చేస్తున్న శాస్త్రవేత్తల సంఖ్య కూడా అక్కడ చాలా ఎక్కువ.