
గులాబీలను ప్రేమకానుకగా ఇచ్చిపుచ్చుకోవడం చాలాకాలంగా ఉన్న అలవాటే. శుభాకాంక్షలు చెప్పడానికి, అభినందనలు తెలియజేయడానికి గులాబీల గుత్తులను కానుకలుగా ఇస్తూ ఉంటారు. కనువిందు చేసే గులాబీలు ఎక్కువకాలం తాజాగా ఉండవు. ఒకటి రెండు రోజుల్లోనే వాడిపోతాయి. వాటి రేకులు రాలిపోతాయి. ఇక మీదట అంత త్వరగా వాడిపోకుండా ఉండే గులాబీలు అందుబాటులోకి రానున్నాయి. జన్యు మార్పిడి పద్ధతుల్లో త్వరగా వాడిపోని గులాబీలను సృష్టించడానికి చేసిన ప్రయోగాలు ఆశాజనకమైన ఫలితాలను ఇచ్చినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జన్యు మార్పిడి ప్రక్రియతో రూపొందించిన ఈ రకం గులాబీలు ఎక్కువకాలం తాజాగా ఉంటాయని, సాధారణమైన గులాబీల కంటే మరింత ఎక్కువ పరిమళం కలిగి ఉంటాయని వారు చెబుతున్నారు.
జన్యుమార్పిడితో రూపొందించిన ఈ రకం గులాబీల మొక్కలు ఫంగల్ వ్యాధులను సమర్థంగా తట్టుకుని మరీ పెరగగలవని వివరిస్తున్నారు. చైనాకు చెందిన ‘ఓల్డ్ బుష్’ రకం గులాబీ మొక్కల్లోని లేత చిగుళ్ల నుంచి సేకరించిన డీఎన్‌ఏలో మార్పులను చేయడం ద్వారా ఆశాజనకమైన ఫలితాలను సాధించామని, మరిన్ని మార్పులతో పూర్తి స్థాయిలో కొత్త రకం గులాబీలను త్వరలోనే రూపొందించనున్నామని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. త్వరగా వాడిపోని, మరింత పరిమళభరితమైన గులాబీలు కొద్ది సంవత్సరాల్లోనే అందుబాటులోకి తీసుకురాగలమని బ్రిటన్‌కు చెందిన శాస్త్రవేత్త డాక్టర్ మహ్మద్ బెందహ్మానె తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment