పారుచర్లలో పట్టుబడిన నకిలీ పత్తి విత్తనాల సూత్రధారి గోవిందుతో స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం
ధరూరు(గద్వాల): నకిలీ పత్తి విత్తనాల వ్యాపారుల గుట్టురట్టు అవుతోంది. చాపకింద నీరులా గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న జర్మనేషన్ ఫెయిల్ అయిన విత్తనాలకు రంగులు, రసాయనాలు అద్ది రైతులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్న అక్రమ వ్యాపారులు ఒక్కొరుగా బయటికొస్తున్నారు. కలెక్టర్ రజత్‌కుమార్‌సైనీ, ఎస్పీ రెమారాజేశ్వరి ఆదేశానుసారం ఇటీవల ప్రత్యేకంగా నియమించిన స్పెషల్ టాస్క్‌ఫోర్స్ టీం సభ్యులు నకిలీ గుట్టును రట్టు చేస్తున్నారు. వ్యవసాయ, పోలీస్, రెవెన్యూ తదితర శాఖల సమన్వయంతో సాగుతున్న టాస్క్‌ఫోర్స్ తనిఖీలతో నకిలీ వ్యాపారుల గుండెల్లో దడ పుట్టిస్తోంది.
వారం రోజుల వ్యవధిలోనే రెండు కేసులు..
పత్తి సాగుకు కేంద్ర బింధువైన గద్వాల నియోజకవర్గంలో అత్యధికంగా సాగయ్యే సీడ్ పత్తితో రైతులు అప్పులపాలవుతుండగా.. ఆర్గనైజర్లు, సబ్ ఆర్గనైజర్లు, ఇతర వ్యాపారులు రూ.కోట్లకు పడగలెత్తుతున్నారు. స్పెషల్ టాస్క్‌ఫోర్స్ టీం బృందం తనిఖీల్లో వారం వ్యవధిలోనే మండలంలో రెండు ప్రాంతాల్లో నకిలీ పత్తివిత్తనాల కేంద్రాలను గుర్తించి బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేశారు. ఈ నెల 10న మార్లబీడులో రాము అనే ఆర్గనైజర్ కోళ్లఫారం వద్ద 3.25 క్వింటాళ్ల పత్తి విత్తనాలు లభించగా.. అతన్ని రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘనటన జరిగిన ఐదురోజుల వ్యవధిలోనే పారుచర్ల అనుబంధ గ్రామమైన సోంపురంలో సోమవారం ఏఓ భవానీ, స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు వెంకటేష్, స్వాములు, నజీర్ సోదాలు నిర్వహించి 4.50 క్వింటాళ్ల పత్తివిత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. అందుకు బాధ్యులైన గోవిందును అదుపోలోకి తీసుకున్నారు. రంగులు అద్ది రాష్ట్రం, రాయిచూరులో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు గుర్తించారు. వ్యవసాయ పొలంలో గుడిసెలో దాచి ఉంచిన విత్తనాలకు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
అనుమానిత దుకాణాల్లో సోదాలు
అనుమానం ఉన్న ఎరువుల దకాణాలు, గద్వాలలోని వివిధ పత్తి మిల్లుల్లో సోదాలు కొనసాగుతున్నాయి. అనుమానిత విత్తనాలను షాంపిల్ సేకరించి టెస్ట్‌కు పంపినట్లు పోలీసులు తెలిపారు. వారం వ్యవధిలోనే మండలంలో రెండు ప్రాంతాల్లో పట్టుబడిన దాదాపు 8 క్వింటాళ్ల నకిలీ విత్తనాల విలువ సుమారు రూ.3లక్షలకు పైనే ఉంటుందని అధికారులు తెలిపారు. నకిలీ సీడ్ పత్తి విత్తనాల గుట్టు రట్టు చేస్తున్న ప్రత్యేక బృందాలను ఎస్పీ రెమారాజేశ్వరి అభినందిస్తున్నారు. ఎన్ని సమస్యలు ఎదురొచ్చినా తమ సహకారం ఉంటుందని చెప్పడంతో పోలీసులు మరింత ముందుకుసాగి నకిలీ గుట్టును రట్టు చేసే పనిలో బిజీగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment