- జిల్లా రైతుల ఆందోళన
- సాగర్ ఆయకట్టుదీ అదే పరిస్థితి
- అదను దాటుతున్న పత్తి సాగు
సాక్షి, ఖమ్మం: కరువు పొంచివుంది. ఈనెల రెండోవారంలోనే జిల్లాను తాకాల్సిన నైరుతి రుతుపవనాలు ఇంతవరకు జాడలేవు. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో అరుదుగా కురిసిన వర్షాలకు నాటిన పత్తి గింజలు భూమిలోనే మాడిపోతున్నాయి. వరినార్లు పోయడానికి అదను దాటిపోతోంది. ఖరీఫ్ సీజన్ కరిగిపోతున్నా చినుకు జాడలేకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది.
జిల్లాలో ఈ ఖరీఫ్‌లో 10.12 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందులో వర్షాధారంగా వేసే పత్తి 5.4 లక్షల ఎకరాలు, సాగర్ ఆయకట్టు, చెరువులు, రిజర్వాయర్ల కింద సాగయ్యే వరి 3.42 లక్షల ఎకరాలు అంచనా కాగా, ప్రస్తుతం అది తలకిందులయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జిల్లాలో ఈనెల సాధారణ సగటు వర్షపాతం ఆదివారం నాటికి 12 సెం.మీ కాగా పడిన వర్షపాతం 2.6 సెం.మీ మాత్రమే.
ఈ వర్షపాతం ఏ పంట వేయడానికీ సరిపోదు. ప్రతి ఏటా ఖరీఫ్‌లో సాధారణ వర్షపాతం కన్నా 4 నుంచి 5 సె.మీ వర్షం పడితేనే జిల్లాలో అన్ని పంటలు విస్తారంగా సాగయ్యేది. వచ్చేనెల 15 వరకు అన్ని రకాల పంటల సాగుకు అనుకూలమని, ఆతర్వాత వర్షాలు వచ్చి పంటలు వేసినా దిగుబడి తక్కువగానే వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. రెండు, మూడు రోజుల నుంచి వాతావరణంమేఘావృతం అవుతున్నా ఉష్ణోగ్రతలు మాత్రం తగ్గడం లేదు.
దీంతో వచ్చేనెల మొదటి వారంలోనైనా నైరుతి పవనాలు కరుణిస్తాయా..? అని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. వచ్చే నెలలో కూడా పొడి పవనాలు వస్తే ఇక జిల్లాలో కరువు కోరలు తప్పవని రైతులు అభిప్రాయపడుతున్నారు. వర్షాలు లేకపోవ డంతో ఇప్పటికే పశువులు తాగడానికి చెరువులు, కుంటల్లో నీళ్లు దొరకడం లేదని, ఇలానే మరో పదిహేను రోజులు ఉంటే 2009 నాటి తీవ్ర వర్షాభావ పరిస్థితులు పునరావృతం అవుతాయని ఆందోళన చెందుతున్నారు.
ఎండిపోతున్న సాగర్..
నాగార్జునసాగర్ గరిష్ట నీటినిలువ సామర్థ్యం 590 అడుగులు కాగా, నైరుతి రుతు పవనాలు ఇప్పటికే తెలంగాణను తాకితే సాగర్ నిండేది. పవనాల అడ్రస్ లేకపోవడంతో ప్రస్తుతం సాగర్‌లో 517 అడుగుల నీరుంది. ఖరీఫ్‌లో సాగర్‌లో 530 అడుగులకు పైగా ఉంటేనే ఎడమ, కుడి కాలువలకు నీరు విడుదల చేస్తారు. అయితే ఆశించిన స్థాయిలో నీరు లేకపోవడంతో కనీసం నారుమడుల సాగుకు కూడా విడుదల చేయలేని పరిస్థితి ఉంది. సాగర్ ఆయకట్టులో జిల్లాలోని 16 మండలాల పరిధిలో 2.50 లక్షల ఎకరాల వరి ఖరీఫ్‌లో సాగవతోంది.
సాగర్‌లో నీరు లేకపోవడం, పాలేరు, వైరా రిజర్వాయర్‌లలో కూడా నీటి మట్టం తగ్గతుండడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. గతంలో వర్షాలు వచ్చాక ఆగస్టులో నీరు విడుదల చేసినా, చివరకు పంట చేతికి అందకుండా పోయింది. ఇక ఈ ఏడాది ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవడానికైనా చినుకు పడకపోవడంతో ఏం చేయాలో రైతులకు పాలుపోవడం లేదు. వేసవిలో అప్పుడప్పుడు పడిన వర్షాలతో ఆయకట్టు రైతులు పంట సాగుకు దుక్కులను సిద్ధం చేసి పెట్టుకున్నారు. గత ఏడాది ఖరీఫ్, రబీలో దిగుబడి, మద్దతు ధర లేక రైతులు సాగుకు చేసిన అప్పులే తీరలేదు. ఇక వర్షాలు పడకపోవతే దుక్కుల సాగుకు తెచ్చిన అప్పు వారికి
గుదిబండగా మారనుంది.
అదును దాటిన పత్తి ..
తొలకరి వర్షాలతోనే జిల్లాలో మొదటగా సాగు చేసే పంట పత్తి. ముందస్తుగా వర్షాలు పడితే జిల్లాలో ఈ నెలలో 5.4 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కావాలి. గత నెల చివరి వారం, ఈ నెల మొదట్లో కురిసిన అకాల వర్షాలతో రుతు పవనాలు వస్తున్నాయనే ఆశతో సుమారు 2 లక్షల ఎకరాల్లో పత్తి విత్తనాలు వేశారు. ఇప్పుడు నైరుతి పవనాలు వెనకపడడంతో విత్తనాలు దుక్కిలోనే మాడిపోతున్నాయి. కొందరు రైతులు డ్రమ్ములు, బిందెలతో నీరు పోసి దుక్కులు తడుపుతున్నా.. విత్తనాలు మొలకెత్తకపోవడంతో తమ కష్టమంతా నీళ్ల పాలవుతోందని ఆవేదన చెందుతున్నారు.
దుక్కులు, విత్తనాల కొనుగోలుకు ఎకరానికి రూ.వేలు ఖర్చు చేయగా, అదంతా బూడిదలో పోసిన పన్నీరే అయింది. ఎలాగైనా వర్షాలు పడతాయని మరికొందరు రైతులు రూ.వేలు ఖర్చు చేసి పత్తి విత్తనాలు కొనుగోలు చేసి పెట్టుకున్నారు. వర్షాలు అనుకూలిస్తే ఇప్పటికే విత్తనాలు వేయాలి. కానీ వచ్చేనెలలో వర్షాలు పడినా పత్తి సాగు అదును దాటిపోవడంతో మరే పంట సాగు చేయాలో తెలియక అయోమయంలో ఉన్నారు.
‘నై’రుతు పవనాలు
Published Mon, Jun 30 2014 3:37 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement