పెద్దపల్లిలో పత్తి పంటను పరిశీలిస్తున్న శాస్త్రవేత్తల బృందం (ఫైల్)
సాక్షి, గద్వాల : నడిగడ్డలో విత్తనోత్పత్తి కంపెనీల బాగోతాలు ఒక్కటొక్కటిగా బయట పడుతున్నాయి. ఇటీవల ఐటీ శాఖ అధికారులు చేసిన దాడుల్లో రైతుల సంతకాలు ఫోర్జరీ చేసి రైతుల భూములను లీజ్‌కు తీసుకున్నట్లు అగ్రిమెంట్లు సృష్టించినట్లు బహిర్గతమైన విషయం విదితమే. తాజాగా కేంద్ర ప్రభుత్వం నిషేధించిన అనుమతి లేని బీటీ–3 విత్తనాలను గద్వాల కేంద్రంగా వ్తితన కంపెనీలు సాగు చేస్తున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ పరిశోధన శాస్త్రవేత్తల బృందం, డీఎన్‌ఏ పరిశోధన సంస్థ నిర్ధారించినట్లు తేలడం గమనార్హం. గతనెల 18న కేంద్ర వ్యవసాయ పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు, అ«ధికారులు, విత్తన ధ్రువీకరణ సంస్థల ప్రతినిధులు జోగుళాంబ గద్వాల జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా 300 పత్తి విత్తనాల శాంపిళ్లను సేకరించి ఢిల్లీ ల్యాబ్‌లో పరీక్షించగా బీటీ–3 విత్తనాల సాగు జరుగుతోందని గుర్తించినట్లు తెలిసింది. గత నెలలోనే ఓ గోదాంలో పట్టుబడిన ఒక కంపెనీకి చెందిన ఐదు శాంపిళ్లలో మూడింటిలో బీటీ–3 విత్తనాలు ఉన్నట్లు రాష్ట్ర, కేంద్ర పరిశోధన బృందం నిర్ధారించినట్లు సమాచారం. ఈ నివేదికను జిల్లా వ్యవసాయశాఖకు పంపించినట్లు తెలిసింది. కానీ ఆ శాఖ అధికారులు మాత్రం అధికారికంగా ధ్రువీకరించడం లేదు.
ఇన్‌కం ట్యాక్స్ దాడులు మరువకముందే..
జోగుళాంబ గద్వాల విత్తన పత్తికి ప్రసిద్ధి. జిల్లాలో దాదాపు కోటి ప్యాకెట్ల పత్తి విత్తనాలను రైతులు సాగు చేస్తున్నారు. అయితే పన్నుల చెల్లింపులో తేడాలు రావడంతో జనవరి నెలలో ఇన్‌కం ట్యాక్స్ అధికారులు విత్తన కంపెనీలపై దాడులు చేశారు. గద్వాలలో రైతుల వద్దకు, ఆర్గనైజర్ల వద్ద నేరుగా విచారణ జరిపారు. రైతుల భూములను లీజుకు తీసుకుని విత్తనాలను సాగు చేస్తున్నట్లు విత్తన కంపెనీలు తప్పుడు పత్రాలను సృష్టించినట్లు ఐటీ శాఖ తనిఖీల్లో తేలింది. రెండు విత్తన కంపెనీలు దాదాపు రూ.1,700 కోట్ల ఆదాయ పన్ను ఎగవేసినట్లు ఐటీ శాఖ గుర్తించింది.
గత నెలలో కేంద్ర బృందాల ఆరా
కేంద్ర ప్రభుత్వ అనుమతి లేని గడ్డిమందును తట్టుకునే పత్తి రకాలు సాగు చేస్తున్నారా, గడ్డి మందు అయిన హెచ్‌టీ(హెర్బిసైడ్ టాలరెంట్) వంటి మందు వాడకంపై కేంద్ర బృందాలు గత నెల 18న జిల్లాలో ఆరా తీశాయి. భారత ప్రభుత్వం తరపున న్యూఢిల్లీలోని భారతీయ పరిశోధన సంస్థ, నాగ్‌పూర్ కేంద్ర పత్తి పరిశోధన సంస్థ, బయోటెక్నాలజీ మంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వశాఖ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల బృందంతో పాటు తెలంగాణ రాష్ట్ర విత్తన దృవీకరణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ కె.కేశవులు, తెలంగాణ వ్యవసాయశాఖ కమిషనర్ కార్యాలయం జేడీ రాజారత్నం నేతృత్వంలోని బృందం జోగుళాంబ గద్వాల జిల్లాలోని మల్దకల్ మండలంలోని పెద్దపల్లి, బూడిదపాడు, అమరవాయి గ్రామాల్లో పర్యటించింది. ఈ సందర్భంగా పత్తి పంటను పరిశీలించి గడ్డి మందు అయిన గ్రై ఫోసెట్, హెచ్‌టీ మందు వాడకంపై రైతులతో ఆరా తీశారు. ఈ సందర్భంగా కాటన్‌సీడ్ మిల్లుల్లో కాటన్ సీడ్ పత్తిని, విత్తనాలను, కెమికల్‌తో శుద్ది చేసిన విత్తనాల శాంపిళ్లను సేకరించి వాటిని పరిశోధనలకు పంపించారు.
బీటీ–3పై నిషేధం
ప్రస్తుతం దేశంలో సాగవుతున్న పత్తిలో బీటీ–1, బీటీ–2 విత్తనాలను రైతులు వినియోగిస్తున్నారు. ఇందులో కలుపు తొలగించేందుకు హెచ్‌టీ (హెర్బిసైడ్ టాలరెంట్) గడ్డి మందు స్ప్రే చేస్తే గడ్డితో పాటు పత్తి పంట కూడా చనిపోతుంది. దీంతో రైతులు ఎలాంటి మందులు వినియోగించకుండా కూలీలతో కలుపు తొలగించుకుంటుండగా ఎకరానికి రూ.10వేల వరకు ఖర్చవుతోంది. బీటీ–3 విత్తనాలతో సాగు చేస్తే హెచ్‌టీ స్ప్రే తట్టుకునే శక్తి పత్తి పంటకు ఉంటుంది. అ యితే, విత్తనాలకు కేంద్ర వ్యవసాయ పరిశోదన సం స్థ అనుమతి ఇవ్వలేదు. ఈ రకంపై హెచ్‌టీ గడ్డి మందులు వాడితే వాతావరణ సమతుల్యం దెబ్బతింటుందని, పర్యావరణానికి ముప్పు ఉంటుం దని కేంద్ర ప్రభుత్వం గుర్తించి, బీటీ– 3ను నిషేధించింది. కానీ కొన్ని కంపెనీలు ఈ విత్తనాలను సాగు చేయించి మార్కెట్‌లో అమ్మకాలు సాగిస్తున్నా యనే సమాచారం అందగా కేంద్ర వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్తల బృందం దేశంలోని వివిధ ప్రాం తాలతో పాటు గద్వాలలో పర్య టించి శాంపిళ్లను సేకరించింది. ఈ క్రమంలోనే జిల్లాలో బీటీ–3 పండిస్తున్నట్లు గా గుర్తించినట్లు తెలిసింది. అయితే, దీనిని జిల్లా వ్యవశాఖ అధి కారి గోవింద్‌నాయక్ ధృవీకరించలేదు.
Comments
Please login to add a commentAdd a comment