న్యూఢిల్లీ: చలికాలం సమీపిస్తున్న కొద్దీ దేశంలోని పలు నగరాల్లో గాలి విషపూరితంగా మారుతుంటుంది. ఇదే కాకుండా దీపావళి సందర్భంగా పటాకులు కాల్చినప్పుడు వాయు కాలుష్యం మరింత విజృంభిస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని వివిధ రాష్ట్రాలు పటాకులు కాల్పడంపై నిషేధం విధించాయి. మరికొన్ని రాష్ట్రాల్లో కేవలం రెండు గంటలపాటు మాత్రమే టపాసులు వెలిగించేందుకు అనుమతినిచ్చారు.
ఢిల్లీ
ఢిల్లీ- ఎన్‌సీఆర్‌లలో అక్టోబరు 31న అంటే దీపావళి నాడు సాయంత్రం 8 నుంచి 10 గంటల మధ్యలో మాత్రమే గ్రీన్ టపాసులు కాల్చుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.
మహారాష్ట్ర
మహారాష్ట్ర నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) సూచనల మేరకు మహారాష్ట్రలో బాణసంచా కాల్చడాన్ని నిషేధించారు. అయితే గ్రీన్ క్రాకర్స్ కాల్చడానికి మాత్రమే అనుమతి ఉంది. గ్రీన్ క్రాకర్స్ సాధారణ క్రాకర్స్ కంటే 30శాతం తక్కువ కాలుష్యాన్ని విడుదల చేసేలా తయారు చేస్తారు.
పశ్చిమ బెంగాల్
పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో దీపావళి సందర్భంగా కాలుష్యం గణనీయంగా పెరుగుతుంది. ఈ కారణంగా గత కొన్నేళ్లుగా ఇక్కడ సాధారణ పటాకులు పేల్చేందుకు అనుమతి ఇవ్వడం లేదు. అయితే కోల్‌కతాలో గ్రీన్ క్రాకర్లు కాల్చవచ్చు. కోల్‌కతాలో రాత్రి 8 నుండి 10 గంటల వరకు గ్రీన్ క్రాకర్స్ కాల్చడానికి అనుమతి ఉంది.
పంజాబ్
పంజాబ్‌లో గ్రీన్ క్రాకర్స్ కాల్చేందుకు మాత్రమే అనుమతి ఉంది. పంజాబ్‌లో దీపావళి రోజున (అక్టోబర్ 31) ఉదయం 4 నుండి 5 గంటల వరకు, రాత్రి 9 నుండి 10 గంటల వరకు టపాసులు కాల్చేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.
బీహార్
పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని బీహార్ ప్రభుత్వం రాష్ట్రంలోని నాలుగు నగరాల్లో బాణాసంచా కాల్చడాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. రాజధాని పాట్నా, ముజఫర్‌పూర్, హాజీపూర్, గయలో ఈ ఏడాది బాణాసంచా కాల్చడానికి అనుమతి లేదు. ఈ నగరాల్లో పటాకుల అమ్మకానికి లైసెన్స్ కూడా ఇవ్వలేదు. ఎవరైనా రహస్యంగా పటాకులు విక్రయిస్తున్నట్లు తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.
హర్యానా
దీపావళి నాడు హర్యానాలో గ్రీన్ క్రాకర్స్ మాత్రమే కాల్చాలంటూ ప్రభుత్వ ఆదేశాలు జారీ అయ్యాయి. దీపావళి నాడు రాత్రి 8 నుండి 10 గంటల వరకు, క్రిస్మస్ రోజున 11.55 నుండి 12.30 గంటల వరకు గ్రీన్ క్రాకర్లు కాల్చేందుకు అనుమతినిచ్చారు.
తమిళనాడు
తమిళనాడు కాలుష్య నియంత్రణ మండలి దీపావళి రోజున పటాకులు కాల్చేందుకు మార్గదర్శకాలను విడుదల చేసింది. తమిళనాడులో దీపావళి రోజున ఉదయం 6 నుంచి 7 గంటల వరకు, సాయంత్రం 7 నుంచి 8 గంటల వరకు పటాకులు కాల్చేందుకు ప్రభుత్వం సమయం నిర్ణయించింది.
ఇది కూడా చదవండి: ఈసారి 33 విమానాలకు బెదిరింపులు
Comments
Please login to add a commentAdd a comment