జీవితం వెలుగుతుంది. జీవితం వెలుతురు సందర్భాలను తీసుకొస్తుంది. జీవితం ఎప్పుడూ నిరాశ, నిçస్పృహలనే చీకట్ల మీదకు ఆశ, ఆవేశం అనే వెలుతురు కిరణాలు పంపుతూనే ఉంటుంది. చీకటి వెలుగుల ఈ రంగేళిని సరి సమంగా స్వీకరించి ముందుకు సాగమని చెబుతుంది దీపావళి. వెలుతురును వరస కట్టుకోమని పెద్ద పెద్ద చప్పుళ్లతో అరిచి చెప్పే పండుగ ఇది. ఈ సందర్భంగా సెలబ్రిటీల వెలుతురు ముచ్చట్లు...
నా జీవితంలో వెలుగులు నింపిన సంఘటన నేను మిస్ ఇండియా కిరీటం గెలవడం. మా నాన్నగారు మాకు దూరమైన తర్వాత ఇది జరిగింది. నా కంటే ఎక్కువగా మా కుటుంబ సభ్యులు ఉద్వేగానికి గురైన క్షణాలు అవి. ఇలా మా జీవితాల్లో వెలుగులు నిండిన ఈ సమ యాన్ని నేను మర్చిపోలేను. నాన్నగారు ఆర్మీలో పని చేసేవారు. దీపావళి పండక్కి ఆయన ఇంటికి వచ్చేవారు. అందువల్ల ఇంట్లో పండగ సందడి భలేగా ఉండేది. ఫ్రెండ్స్, బంధువులు అందరూ వచ్చేవారు.
ఆయన లేకపోయినా ఆ ఆనవాయితీని కొనసాగేలా చూస్తున్నాను. మా హర్యాణలో దీపావళికి గాలిపటాలు ఎగరేస్తాం. వీధుల్లో పిల్లల ఆటపాటలు ఉంటాయి. కుటుంబ సభ్యులు అందరూ కలుస్తారు నియమంగా. ఇక షాపింగ్ చేయడం, నచ్చిన ఫుడ్ తినడం, దీపావళి వెలుగుల్లో సరదాగా గడపడం... ప్రతిసారి లాగే ఈసారి కూడా దీపాళికి ప్లాన్ చేశాను.
ఇప్పుడే కాదు.. నా చిన్నప్పటి నుంచీ నేను క్రాకర్స్ కాల్చను. కానీ ఎవరైనా క్రాకర్స్ కాల్చుతుంటే దూరంగా నిల్చుని చూస్తూ ఆనందిస్తుంటాను. చీకటి, వెలుగులు ఉన్నట్లే... మన జీవితాల్లో కూడా ఎత్తుపల్లాలు, మంచి చెడులు ఉంటూనే ఉంటాయి. అయితే మనం కంట్రోల్ చేయలేని పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం అన్నది ముఖ్యం. మన బౌండరీస్‌పై మనకు ఓ అవగాహన ఉండాలి. ప్రతి విషయంలోనూ సానుకూలంగానే ఆలోచించాలి. ఇలా ఉండటం సులభమని నేను చెప్పడం లేదు. కానీ ఉండగలగాలి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు.
నా బాల్యంలో ప్రతి ఏడాది దీపాళికి మా అమ్మమ్మ ఇంటికి వెళ్లేవాళ్ళం. దాదాపు ఇరవైమంది కుటుంబ సభ్యులం కలిసి ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. అందుకే దీపావళి అంటే నాకు ఎంతో ఇష్టం. చిన్నతనంలో క్రాకర్స్ కాల్చడాన్ని చాలా ఎంజాయ్ చేశాను. మా తాతగారు దీపాళికి పెద్దస్థాయిలో లక్ష్మీపూజ ఘనంగా జరిపేవారు. అప్పట్లో క్రాకర్స్ కొనిచ్చేవారు. పిల్లలు క్రాకర్స్ బాక్స్‌లను కలిసి కాల్చేవారు. ఎక్స్‌ఛేంజ్ చేసుకునేవాళ్ళు. బాగుండేది. కానీ పర్యావరణ పరిరక్షణ ముఖ్యమని ఇప్పుడు కాల్చడం లేదు.
అయితే ఒకసారి పండక్కు వెళ్లి కాలని లక్ష్మీబాంబులను ఏరుకుని, వాటిని విప్పి అందులోని పొడిని ఓ పేపర్లో ఉంచి, ఆ పేపర్ చివరన వెలిగించాను. నా అంతట నేనే ఓ లక్ష్మీబాంబును తయారు చేసుకుంటున్నానని ఫీలైపోయాను. కానీ దురదృష్టవశాత్తు నా రెండు వేళ్లు కాలిపోయాయి. మా అమ్మకు తెలిస్తే కోప్పడుతుందని తెలియకుండా దాచాను. కానీ అమ్మ గమనించి మందలించింది. ఈ ఘటనను నేను ఎప్పటికీ మర్చిపోలేను. అందుకే పిల్లలందరికీ చెబుతున్నా... క్రాకర్స్ కాల్చేప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. మీరు కాల్చే క్రాకర్స్‌పై మీకు అవగాహన లేకపోతే దూరంగా ఉండండి. అత్యుత్సాహం చూపకండి. నేను సరదాగా చేసిన పిచ్చిపనిలాంటివి చేయకండి.
కొన్ని కారణాల వల్ల గడిచిన రెండు సంవత్సరాలు నేను దీపాళిని మా అమ్మమ్మ ఇంట్లో సెలబ్రేట్ చేసుకోలేకపోయాను. అందుకే ఈ ఏడాది నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఆ జ్ఞాపకాలను మళ్లీ గుర్తుకు తెచ్చుకుంటూ సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటాను. ఇంటి వాతావరణంలో నేను పెరిగింది తక్కువ. బోర్డింగ్ స్కూల్లో చదువుకున్నాను. కాలేజీ కూడా అంతే. ఒంటరిగా ట్రావెల్ చేస్తుంటాను.
సమాజంలో ఎలా మెలగాలో నాకు నేను కొన్ని పాఠాలు నేర్చుకున్నాను. మీపై మీరు భరోసా ఉంచండి. ధైర్యంగా ఉండండి. నైతిక బాధ్యతతో ఉండండి. అప్పుడు క్లిష్టపరిస్థితులను నెగ్గుకు రావొచ్చు మీరు. నమ్మిన దానిపట్ల ధైర్యంగా నిలబడుతూ తలెత్తుకు జీవించండి. నా అనుభవాల నుంచి నేను నేర్చుకున్న సంగతులు ఇవి. భయం లేకపోవడమే వెలుగని నేను భావిస్తుంటాను.
(చదవండి: మన ముంగిళ్లలో వెలుగు పూలు)
Comments
Please login to add a commentAdd a comment