
Edible Oil Prices: కరువుతో అమెరికా , బ్రెజిల్‌లలో తగ్గిపోయిన సోయా ఉత్పత్తి, ఇండోనేషియాలో పెరిగిన పామాయిల్ రేట్లు ఇలా అంతర్జాతీయ కారణాలతో ఇంత కాలం వంటనూనెల ధరలు పెరగుతూ సామాన్యుడికి చుర్రుమనిపిస్తున్నాయి. ఇప్పుడు వాటికి మన దేశంలోని పరిస్థితులు కూడా తోడవుతున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో వంట నూనె ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.
గుజరాత్‌లో తగ్గిన ఉత్పత్తి
దేశంలో వంట నూనె ఫ్యాక్టరీల్లో సింహభాగం గుజరాత్‌లోనే ఉన్నాయి. ఇక్కడ దాదాపుగా వెయ్యికి పైగా వంట నూనె తయారీ కర్మాగారాలు ఉండగా ఇందులో ఇప్పటికే 800లకు పైగా ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు దాదాపుగా మూత పడ్డాయి. భారీ నూనె తయారీ పరిశ్రమల్లోనే ఉత్పత్తి కొనసాగుతోంది. ఈ ఫ్యాక్టరీల్లో కూడా మరో నెలకు సరిపడా ముడి పదార్థాలు ఉన్నాయి.
మిల్లర్ల మొండిపట్టు
వంటనూనె ముడి పదార్థాలైన వేరు శనగ, పత్తిని కొనేందుకు ఆయిల్ మిల్లర్లు ఆసక్తి చూపించడం లేదు. ముఖ్యంగా పత్తికి సంబంధించి నాఫెడ్ దగ్గర సరిపడా నిల్వలు ఉన్నా.. ధర ఎక్కువగా ఉందనే కారణం చెబుతూ మిల్లర్లు కొనుగోల్లు మానేశారు. ధర తగ్గిన తర్వాతే ఉత్పత్తి మొదలు పెడతామంటూ భీష్మించుకున్నారు.
పెరిగిన విదేశీ ఎగుమతులు
గుజరాత్ నుంచి పత్తి, వేరు శనగల ఎగుమతులు విదేశాలకు పెరిగాయి. సాధారణంగా ప్రతీ ఏడు ఈ రాష్ట్రం నుంచి 30 లక్షల పత్తి బేళ్లు ఎగుమతి అవుతుండగా ఈ సారి మొత్తం 55 లక్షలకు చేరుకుంది. విదేశీ ఎగుమతులు పెరగడంతో గత పన్నెండేళ్లలో ఎన్నడూ లేనంతగా ఒక్కో బేల్ ధర రూ. 57,000లుగా పలుకుతోంది. దీంతో వీటిని కొనేందుకు ఆయిల్ మిల్లర్లు ముందుకు రావడం లేదు.
అప్పుడే వంద పెరిగింది
గుజరాత్‌లో కాటన్ సీడ్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్ ఉత్పత్తి తగ్గిపోవడంతో వాటి ప్రభావం వంట నూనెల ధరలపై పడుతోంది. ఇప్పటికే 15 కేజీల కాటన్ సీడ్ ఆయిల్ ధర రూ.100 వరకు పెరిగింది. 15 కేజీల గ్రౌండ్ నట్ ఆయిల్ ధర రూ. 2,550 నుంచి రూ. 2,560లకి చేరుకుంది. కాటన్ సీడ్ టిన్ ధర రూ. 2400 నుంచి రూ.2500కి చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment