ground nuts seeds
-
సలసలకాగుతున్న వంటనూనె ధరలు! మరోసారి షాక్ తప్పదా?
Edible Oil Prices: కరువుతో అమెరికా , బ్రెజిల్‌లలో తగ్గిపోయిన సోయా ఉత్పత్తి, ఇండోనేషియాలో పెరిగిన పామాయిల్ రేట్లు ఇలా అంతర్జాతీయ కారణాలతో ఇంత కాలం వంటనూనెల ధరలు పెరగుతూ సామాన్యుడికి చుర్రుమనిపిస్తున్నాయి. ఇప్పుడు వాటికి మన దేశంలోని పరిస్థితులు కూడా తోడవుతున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో వంట నూనె ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. గుజరాత్లో తగ్గిన ఉత్పత్తి దేశంలో వంట నూనె ఫ్యాక్టరీల్లో సింహభాగం గుజరాత్‌లోనే ఉన్నాయి. ఇక్కడ దాదాపుగా వెయ్యికి పైగా వంట నూనె తయారీ కర్మాగారాలు ఉండగా ఇందులో ఇప్పటికే 800లకు పైగా ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు దాదాపుగా మూత పడ్డాయి. భారీ నూనె తయారీ పరిశ్రమల్లోనే ఉత్పత్తి కొనసాగుతోంది. ఈ ఫ్యాక్టరీల్లో కూడా మరో నెలకు సరిపడా ముడి పదార్థాలు ఉన్నాయి. మిల్లర్ల మొండిపట్టు వంటనూనె ముడి పదార్థాలైన వేరు శనగ, పత్తిని కొనేందుకు ఆయిల్ మిల్లర్లు ఆసక్తి చూపించడం లేదు. ముఖ్యంగా పత్తికి సంబంధించి నాఫెడ్ దగ్గర సరిపడా నిల్వలు ఉన్నా.. ధర ఎక్కువగా ఉందనే కారణం చెబుతూ మిల్లర్లు కొనుగోల్లు మానేశారు. ధర తగ్గిన తర్వాతే ఉత్పత్తి మొదలు పెడతామంటూ భీష్మించుకున్నారు. పెరిగిన విదేశీ ఎగుమతులు గుజరాత్ నుంచి పత్తి, వేరు శనగల ఎగుమతులు విదేశాలకు పెరిగాయి. సాధారణంగా ప్రతీ ఏడు ఈ రాష్ట్రం నుంచి 30 లక్షల పత్తి బేళ్లు ఎగుమతి అవుతుండగా ఈ సారి మొత్తం 55 లక్షలకు చేరుకుంది. విదేశీ ఎగుమతులు పెరగడంతో గత పన్నెండేళ్లలో ఎన్నడూ లేనంతగా ఒక్కో బేల్ ధర రూ. 57,000లుగా పలుకుతోంది. దీంతో వీటిని కొనేందుకు ఆయిల్ మిల్లర్లు ముందుకు రావడం లేదు. అప్పుడే వంద పెరిగింది గుజరాత్లో కాటన్ సీడ్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్ ఉత్పత్తి తగ్గిపోవడంతో వాటి ప్రభావం వంట నూనెల ధరలపై పడుతోంది. ఇప్పటికే 15 కేజీల కాటన్ సీడ్ ఆయిల్ ధర రూ.100 వరకు పెరిగింది. 15 కేజీల గ్రౌండ్ నట్ ఆయిల్ ధర రూ. 2,550 నుంచి రూ. 2,560లకి చేరుకుంది. కాటన్ సీడ్ టిన్ ధర రూ. 2400 నుంచి రూ.2500కి చేరుకుంది. చదవండి: Onion : ఉల్లిఘాటు.. ‘ముందే కొని పెట్టుకోండి’! -
ఆందోళన అనవసరం..విత్తనాలు తెప్పిస్తాం
సాక్షి, అనంతపురం జిల్లా: రైతులందరికీ వేరుశనగ విత్తనాలు పంపిణీ చేస్తామని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని అనంతపురం జిల్లా కలెక్టర్ సత్యనారాయణ స్పష్టం చేశారు. విత్తన సంస్థలకు గత ప్రభుత్వం రూ. 150 కోట్ల బకాయిలు ఉన్నందునే అనంతపురం జిల్లాలో విత్తనాల సేకరణ ఆలస్యం అయిందన్నారు. మొత్తం మూడు లక్షల క్వింటాళ్ల కు గాను ఇప్పటిదాకా రెండు లక్షల క్వింటాళ్ల విత్తనాలు రైతులకు పంపిణీ చేశామని వివరించారు. రైతుల డిమాండ్ మేరకు మరో నలభై వేల క్వింటాళ్ల విత్తనాలు సేకరిస్తున్నామని చెప్పారు. ఎంత ధర అయినా చెల్లించి వేరుశనగ విత్తనాలు సేకరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారని.. పొరుగు రాష్ట్రాల నుంచి విత్తనాలు తెప్పిస్తున్నామని తెలిపారు. -
లక్ష క్వింటాళ్లు పుచ్చిపోతున్నాయ్!
సాక్షి, అమరావతి: సీజన్ దాటి పోయింది. అయినా రూ.కోట్లు ఖర్చు చేసి ప్రభుత్వం కొనుగోలు చేసిన వేరుశనగ, శనగ విత్తనాలు గిడ్డంగుల్లో మగ్గిపోతున్నాయి. విత్తనాలు పుచ్చిపోకుండా అధికారులు పురుగు మందుల్ని పిచికారీ చేస్తున్నా, బూజు పట్టకుండా, ఎలుకలు పడకుండా మందు గోలీలు పెడుతున్నా ఫలితం లేకుండా పోయింది. దాదాపు లక్ష క్వింటాళ్ల విత్తనాలు పుచ్చుపట్టడంతో ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.35 కోట్ల నష్టం వాటిల్లనుంది. రైతుల అనా సక్తి ప్రదర్శిస్తున్న విషయం తెలిసి కూడా ఆయిల్ ఫెడ్, ఏపీ సీడ్స్, మార్క్‌ఫెడ్ అధికారులు కమీషన్ల కక్కుర్తితో వ్యాపా రస్తుల నుంచి అధిక ధరలకు కొనుగోలు చేసి ప్రజాధనం దుర్వినియోగానికి పాల్పడ్డారు. 2016–17 సీజన్‌కు ఆయిల్ ఫెడ్ గత ఫిబ్రవరిలో 1,72,342 క్వింటాళ్ల వేరుశనగ, 1,03,166 క్వింటాళ్ల శనగ విత్తనాలను కొనుగోలు చేసింది. బయటి మార్కెట్లో క్వింటాల్ వేరుశనగ విత్తనాలు 5 వేల రూపాయలకు దొరుకుతుంటే రూ.7050 పెట్టి కొనుగోలు చేశారు. రైతులకు విక్రయించే ధరను రూ.7,700గా నిర్ణయించి అందులో 40 శాతం సబ్సిడీ పోను రూ.4650లకు విక్రయించారు. శనగలను క్వింటాల్‌కు రూ.7150 చెల్లించి కొని రూ.8020గా విక్రయ ధరగా నిర్ణయించి 40 శాతం సబ్సిడీపోను రైతులకు రూ.4812లకు విక్రయించారు. ఈ ధరలు ఎక్కువగా ఉండడంతో రైతులు ప్రభుత్వ సంస్థలు ఇచ్చే సబ్సిడీ విత్తనాలకన్నా బయటి మార్కెట్వైపే మొగ్గుచూపారు. ఫలితంగా ఖరీఫ్ కోసం కొనుగోలు చేసిన వేరుశనగ విత్తనాల్లో 44,829 క్వింటాళ్లు, 50,160 క్వింటాళ్ల శనగ విత్తనాలు మిగిలిపోయాయి. తాడిపత్రి, ఉరవకొండ, గుంతకల్లు, పేరుసోముల, కర్నూలు, జమ్మలమడుగు, చిత్తూరు గిడ్డంగుల్లో ప్రస్తుతం ఈ సరుకు ఎందుకూ కొరగాకుండా ఉంది. సరకు అమ్మకం, నాణ్యతతో నిమిత్తం లేకుండానే ఎవరికి చేరాల్సిన సొమ్ము వారికి చేరింది. టెండర్లు వేసిన వ్యాపారుల డిపాజిట్ మొత్తం రూ.5 లక్షలు తప్ప మిగతా సొమ్మంతా వ్యాపారులకు చేరింది. దీనికి ప్రతిఫలంగా అధికారులకూ క్వింటాల్‌కు రూ.600 చొప్పున అందింది. ఫలితంగా వచ్చిన విత్తనాలు నాణ్యమైనవా? కావా? అనే దాంతో నిమిత్తం లేకుండా సరకు గిడ్డంగుల్లోకి చేరింది. ధర నిర్ణయంలో రైతు పాత్ర ఏదీ? గిట్టుబాటు ధర మొదలు విత్తనాల ధర నిర్ణయం వరకు ఎక్కడా రైతు పాత్ర లేకపోవడంతో వ్యాపారులు, అధికారులు ఆడింది ఆట పాడింది పాట అవుతోంది. చిత్రమేమిటంటే కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చే ఆయిల్ పామ్ ధర నిర్ణయంలో రైతు పాత్ర ఉంటుంది. కానీ ఇతర నూనె గింజల విషయంలో మాత్రం రైతుల ప్రమేయం లేకుండానే ధరను నిర్ణయించి రైతు నెత్తిన రుద్దుతున్నారు. తిరస్కరిస్తున్న రైతులు... ఖరీఫ్ కోసం కొనుగోలు చేసి రబీ పంట కాలంలో ఈ పుచ్చిపోయిన విత్తనాలను అంటగట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారంటూ రైతు సంఘాలు ఆరోపించాయి. కర్నూలు జిల్లాలో గత నెల మూడో వారంలో ఈ తరహా విత్తనాలను పంపిణీ చేస్తున్నారంటూ రైతులు ఆందోళనకు దిగారు. శనగ విత్తనాల టెండరు దక్కించుకున్న ప్రకాశం జిల్లాకు చెందిన ఓ టీడీపీ నేత సరఫరా చేసిన ఈ విత్తనాలు పుచ్చిపోయాయని, దీనిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇటువంటి సంఘటనలే అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోనూ జరిగాయి. -
ధర మోత.. సబ్సిడీ కోత
► అధిక ధరలకు వేరుశనగ విత్తన కాయల పంపిణీ ► కరువు ప్రాంత సబ్సిడీలోనూ కోత ► విత్తనాలతోపాటు జిప్సం, నవధాన్యాలు కొనుగోలు తప్పనిసరంటున్న అధికారులు ►సాగు ప్రారంభంలోనే తడిసి మోపెడవుతున్న ఖర్చులు ఏడాదిగా వర్షాభావం వల్ల కరువు విలయతాండవం చేస్తోంది. ప్రభుత్వం చిత్తూ రును కరువు జిల్లాగా ప్రకటించింది. అయితే ఉపశమనానికి తీసుకోవాల్సిన చర్యలు మాత్రం మరిచిపోయింది. ఫలితంగా జిల్లా ప్రజలు, రైతాంగం ఆర్థిక ఇబ్బందులతో దిక్కుతోచని స్థితిలో పడుతున్నారు. ఇలాంటి తరుణంలో ఖరీఫ్ సీజనులో వేరుశనగ సాగుకు చేయూత అందించాల్సిన ప్రభుత్వం మరింత భారాన్ని మోపుతోంది. తాజాగా వేరుశనగ విత్తన కాయలకు అందించాల్సిన సబ్సిడీలోనూ కోత విధిస్తోంది. చిత్తూరు (అగ్రికల్చర్): ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు జిల్లా రైతాంగానికి శాపంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఖరీఫ్‌లో వేరుశనగ సాగు చేయాలనుకునేవారికి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరువవుతోంది. రైతులు సబ్సిడీ విత్తన కాయలతో పాటు జిప్సం, విత్తనశుద్ధి మందులు, చిరుధాన్యాల విత్తన గింజలు కూడా తప్పనిసరిగా కొనుగోలు చేయాలంటూ అధికారులు ఆంక్షలు విధించడమే ఇందుకు నిదర్శనం. దీంతో రైతులకు సాగు ప్రారంభంలోనే అధిక పెట్టుబడులు పెట్టా ల్సిన దుస్థితి ఏర్పడింది. 84వేల క్వింటాళ్ల విత్తనకాయల కేటాయింపు.. జిల్లాలో ఈ ఖరీఫ్ సీజనుకు వేరుశనగ సాగుకు ప్రభుత్వం సబ్సిడీ విత్తన కాయలు 84,500 క్వింటాళ్లు కేటాయించింది. మొత్తం 1.36 లక్షల హెక్టార్ల సాధారణ విస్తీర్ణంలో రైతులు వేరుశనగను సాగు చేస్తారు. వర్షాధారితంగా సాగయ్యే ఈపంట ద్వారా రైతులకు ఆశించిన మేరకు కచ్చితమైన దిగుబడి వస్తుందనే నమ్మకం లేదు. రైతులు నష్టాలను చవిచూడాల్సి వచ్చినా నిరుత్సాహం చెందకుండా పంట సజావుగా సాగేందుకు ప్రభుత్వం ఏటా విత్తనకాయలను సబ్సిడీపై అందించడం పరిపాటి. అయితే ఈ ఏడాది ప్రభుత్వం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ రైతుల నెత్తిన మరింత భారాన్ని మోపుతోంది. సబ్సిడీ పేరుతో అధిక ధరలను నిర్ణయిస్తూ రైతులను మరింత అప్పుల్లోకి నెడుతోంది. సబ్సిడీలోనూ కోతే.. చిత్తూరును కరువు జిల్లాగా ప్రకటించినా విత్తన కాయలకు సబ్సిడీపై ప్రభుత్వం ఎలాంటి భరోసా ఇవ్వడం లేదు. ఏటా వేరుశనగ విత్తనకాయలను రాష్ట్రవ్యాప్తంగా 30 నుంచి 35 శాతం మేరకు సబ్సిడీతో రైతులకు అం దించడం పరిపాటి. గత ఏడాది కూడా 33.3 శాతంతో కిలోవిత్తన కాయలను రూ. 50 చొప్పున అందించింది. ఈ ఖరీఫ్‌కు గత ఏడాదికన్నా 6.67 శాతం పెంచి, 40 శాతం సబ్సిడీతో కాయలు అందించే విధంగా నిర్ణయం తీసుకోనుంది. కరువు జిల్లాలో మాత్రం కనీసం 50 శాతం సబ్సిడీతో విత్తన కాయలు అందించి రైతులను ఆదుకోవాల్సి ఉంది. అయితే ఇదేమీ పట్టని ప్రభుత్వం మన జిల్లా రైతులకు కూడా అన్ని జిల్లాలతో సమానంగానే చూస్తూ సబ్సిడీలో 10 శాతం మేరకు కోత విధించింది. కేటాయించిన 40 శాతం సబ్సిడీతో కిలో విత్తన కాయలు రూ.46.20 చొప్పున బస్తా కాయలు (30 కిలోలు) రూ.1,386 మేరకు అందించనుంది. గత ఏడాదికి పోలిస్తే బస్తాపై కేవలం రూ.114 మాత్రమే తగ్గించి అన్ని జిల్లాలతోపాటు మనకు కేటాయించింది. ప్రభుత్వం జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించినా.. ఒరిగిందేమీ లేదని రైతులు వాపోతున్నారు. జిప్సం, నవధాన్యాలు తప్పనిసరి.. వేరుశనగ విత్తన కాయలతోపాటు రైతులు జిప్సం, విత్తనశుద్ధి మందు, నవధాన్యాలు కూడా తప్పనిసరిగా కొనుగోలు చేయాలని వ్యవశాయశాఖ అధికారులు నిబంధనలు పెడుతున్నారు. విత్తనకాయలతోపాటు ప్రతి రైతు తప్పనిసరిగా రెండు క్వింటాళ్ల మేరకు జిప్సం, విత్తనశుద్ధి మందు, నవధాన్యాలు కంది, జొన్న, అలసంద, పెసర, అనప తదితర విత్తన గింజలు కొనుగోలు చేయాలనే ఆంక్షలు పెడుతున్నారు. భారం ఇలా.. వేరుశనగ సాగు చేయాలంటే రైతులు ఆరంభంలోనే అధిక పెట్టుబడులు పెట్టాల్సి వస్తోంది. ఎకరా సాగు చేయాలంటే రెండు బస్తాల విత్తనకాయలకు రూ.2,772లతో పాటు రెండు క్విటాళ్ల జిప్సం, విత్తనశుద్ధి మందు, నవధాన్యాలకు దాదాపు రూ.500 మేరకు వెచ్చించాల్సి ఉంది. ఇదిగాక దుక్కులు దున్నడం నుంచి పంట చేతికందే వరకు ఎకరాకు కనీసం రూ. 20 వేల వరకు పెట్టుబడి పెట్టాలి. ఒకవేళ ఆ మేరకు అప్పులు చేసి పెట్టుబడి పెట్టేందుకు రైతులు సిద్ధమైనా గత ఏడాదిలాగే మళ్లీ ప్రకృతి వైపరీత్యాలు, వర్షాభావం నెలకొంటే ఈసారి కూడా ఆశించిన మేరకు పంట చేతికొస్తుందనే నమ్మకం లేదు. దీంతో రైతులు సాగుపై ఆందోళన చెందుతున్నారు. 29 నుంచి వేరుశనగ విత్తన కాయల పంపిణీ చిత్తూరు అగ్రికల్చర్: ఈ ఖరీఫ్ సీజన్‌కు ప్రభుత్వం రైతులకు అందించే సబ్సిడీ వేరుశనగ విత్తన కాయలు ఈనెల 29 వ తేదీ నుంచి పంపిణీ చేయాలని వ్యవసాయ శాఖ రాష్ట్ర కమిషనర్ హరిజవహర్ ఆదేశించారు. సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా వ్యవసాయాధికారులతో సమీక్షించారు. జిల్లాకు కేటాయించిన 84,500 క్వింటాళ్ల వేరుశనగ విత్తన కాయలను పంపిణీ చేసేందుకు 238 కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. రైతులకు కాయల పంపిణీని బయోమెట్రిక్ విధానం ద్వారా చేపట్టాలన్నారు. ఇందుకోసం బయోమెట్రిక్ విధానంపై వ్యవసాయశాఖ సిబ్బంది ఈనెల 26న ఒకరోజు శిక్షణ ఇవ్వాలన్నారు. 29న కాయల పంపిణీ చేపట్టాలన్నారు. రైతులకు అందించే సబ్సిడీ విత్తన కాయలకు ప్రభుత్వం 40 శాతం రాయితీ ప్రకటించిందన్నారు. ఈ సబ్సిడీ మేరకు కే6 రకం విత్తన కాయలను రూ.77గా నిర్ణయించగా, సబ్సిడీ రూ.30.80 పోగా రైతు కిలో రూ.46.20కు, నారాయణి రకం కాయలకు కిలో రూ.79 నిర్ణయించగా అందులో సబ్సిడీ రూ.31.10 పోగా రైతుకు కిలో రూ.47.90 చొప్పున అందించే విధంగా నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రకారం కే6 రకం బస్తా (30 కిలోలు) రూ.1,386, నారాయణి రకం బస్తా (30 కిలోలు) రూ.1,437 ధరతో రైతులకు అందించనున్నారు.