సాక్షి, అమరావతి: సీజన్ దాటి పోయింది. అయినా రూ.కోట్లు ఖర్చు చేసి ప్రభుత్వం కొనుగోలు చేసిన వేరుశనగ, శనగ విత్తనాలు గిడ్డంగుల్లో మగ్గిపోతున్నాయి. విత్తనాలు పుచ్చిపోకుండా అధికారులు పురుగు మందుల్ని పిచికారీ చేస్తున్నా, బూజు పట్టకుండా, ఎలుకలు పడకుండా మందు గోలీలు పెడుతున్నా ఫలితం లేకుండా పోయింది. దాదాపు లక్ష క్వింటాళ్ల విత్తనాలు పుచ్చుపట్టడంతో ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.35 కోట్ల నష్టం వాటిల్లనుంది. రైతుల అనా సక్తి ప్రదర్శిస్తున్న విషయం తెలిసి కూడా ఆయిల్ ఫెడ్, ఏపీ సీడ్స్, మార్క్‌ఫెడ్ అధికారులు కమీషన్ల కక్కుర్తితో వ్యాపా రస్తుల నుంచి అధిక ధరలకు కొనుగోలు చేసి ప్రజాధనం దుర్వినియోగానికి పాల్పడ్డారు.
2016–17 సీజన్‌కు ఆయిల్ ఫెడ్ గత ఫిబ్రవరిలో 1,72,342 క్వింటాళ్ల వేరుశనగ, 1,03,166 క్వింటాళ్ల శనగ విత్తనాలను కొనుగోలు చేసింది. బయటి మార్కెట్‌లో క్వింటాల్ వేరుశనగ విత్తనాలు 5 వేల రూపాయలకు దొరుకుతుంటే రూ.7050 పెట్టి కొనుగోలు చేశారు. రైతులకు విక్రయించే ధరను రూ.7,700గా నిర్ణయించి అందులో 40 శాతం సబ్సిడీ పోను రూ.4650లకు విక్రయించారు. శనగలను క్వింటాల్‌కు రూ.7150 చెల్లించి కొని రూ.8020గా విక్రయ ధరగా నిర్ణయించి 40 శాతం సబ్సిడీపోను రైతులకు రూ.4812లకు విక్రయించారు. ఈ ధరలు ఎక్కువగా ఉండడంతో రైతులు ప్రభుత్వ సంస్థలు ఇచ్చే సబ్సిడీ విత్తనాలకన్నా బయటి మార్కెట్‌వైపే మొగ్గుచూపారు. ఫలితంగా ఖరీఫ్ కోసం కొనుగోలు చేసిన వేరుశనగ విత్తనాల్లో 44,829 క్వింటాళ్లు, 50,160 క్వింటాళ్ల శనగ విత్తనాలు మిగిలిపోయాయి.
తాడిపత్రి, ఉరవకొండ, గుంతకల్లు, పేరుసోముల, కర్నూలు, జమ్మలమడుగు, చిత్తూరు గిడ్డంగుల్లో ప్రస్తుతం ఈ సరుకు ఎందుకూ కొరగాకుండా ఉంది. సరకు అమ్మకం, నాణ్యతతో నిమిత్తం లేకుండానే ఎవరికి చేరాల్సిన సొమ్ము వారికి చేరింది. టెండర్లు వేసిన వ్యాపారుల డిపాజిట్ మొత్తం రూ.5 లక్షలు తప్ప మిగతా సొమ్మంతా వ్యాపారులకు చేరింది. దీనికి ప్రతిఫలంగా అధికారులకూ క్వింటాల్‌కు రూ.600 చొప్పున అందింది. ఫలితంగా వచ్చిన విత్తనాలు నాణ్యమైనవా? కావా? అనే దాంతో నిమిత్తం లేకుండా సరకు గిడ్డంగుల్లోకి చేరింది.
ధర నిర్ణయంలో రైతు పాత్ర ఏదీ?
గిట్టుబాటు ధర మొదలు విత్తనాల ధర నిర్ణయం వరకు ఎక్కడా రైతు పాత్ర లేకపోవడంతో వ్యాపారులు, అధికారులు ఆడింది ఆట పాడింది పాట అవుతోంది. చిత్రమేమిటంటే కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చే ఆయిల్ పామ్ ధర నిర్ణయంలో రైతు పాత్ర ఉంటుంది. కానీ ఇతర నూనె గింజల విషయంలో మాత్రం రైతుల ప్రమేయం లేకుండానే ధరను నిర్ణయించి రైతు నెత్తిన రుద్దుతున్నారు.
తిరస్కరిస్తున్న రైతులు...
ఖరీఫ్ కోసం కొనుగోలు చేసి రబీ పంట కాలంలో ఈ పుచ్చిపోయిన విత్తనాలను అంటగట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారంటూ రైతు సంఘాలు ఆరోపించాయి. కర్నూలు జిల్లాలో గత నెల మూడో వారంలో ఈ తరహా విత్తనాలను పంపిణీ చేస్తున్నారంటూ రైతులు ఆందోళనకు దిగారు. శనగ విత్తనాల టెండరు దక్కించుకున్న ప్రకాశం జిల్లాకు చెందిన ఓ టీడీపీ నేత సరఫరా చేసిన ఈ విత్తనాలు పుచ్చిపోయాయని, దీనిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇటువంటి సంఘటనలే అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోనూ జరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment