సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ పర్యటనలో ఉన్న పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు, కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. చేనేత కార్మికుల సమస్యల గురించి మంత్రి స్మృతి ఇరానీతో చర్చించనట్లు తెలిపారు. హ్యాండ్లూమ్, పవర్ లూం రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను స్మృతి ఇరానీకి వివరించానన్నారు. నేతన్నకు చేయూతనిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం దాదాపు 12 వందల కోట్ల రూపాయలతో ప్రారంభించిన పథకాల గురించి వివరించానన్నారు.
అంతేకాక 8 వేల మగ్గాలను ఆధునీకరిస్తున్నామని తెలిపారు. చేనేత రంగం అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం సహకారంతో కొన్ని కొత్త హ్యాండ్లూమ్ క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలో కొత్త క్లస్టర్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇవేకాక మరో 10 క్లస్టర్లను మంజూరు చేయాల్సిందిగా మంత్రి స్మృతి ఇరానీని కోరానని తెలిపారు. చేనేత కార్మికులను ఆదుకునేవిధంగా ఈ క్లస్టర్స్ ఉంటాయన్నారు. క్లస్టర్ల ఏర్పాటు కోసం కొన్ని నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. కానీ నిధుల విడుదలలో జాప్యం జరుగుతోందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్ళానన్నారు. అందుకు స్మృతి ఇరానీ సానుకులంగా స్పందించినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment