మెగా పవర్‌లూమ్‌ క్లస్టర్‌ ఇవ్వండి  | Telangana Minister KTR Demands Centre To Cancel GST On Handloom | Sakshi
Sakshi News home page

మెగా పవర్‌లూమ్‌ క్లస్టర్‌ ఇవ్వండి 

Aug 16 2022 2:44 AM | Updated on Aug 16 2022 10:03 AM

Telangana Minister KTR Demands Centre To Cancel GST On Handloom - Sakshi

సిరిసిల్లలో నూలు పోగుల దండతో మంత్రి కేటీఆర్‌ను సన్మానిస్తున్న నేతన్నలు   

సిరిసిల్ల: సిరిసిల్లకు మెగా పవర్‌లూమ్‌ క్లస్టర్‌ మంజూరు చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్‌ శాఖల మంత్రి కె.తారకరామారావు ప్రధాని, కేంద్ర టెక్స్‌టైల్‌ శాఖ మంత్రిని కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలో సోమవారం జరిగిన స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో కేటీఆర్‌ ప్రసంగించారు. టెక్స్‌టైల్‌ రంగంపై విధించిన జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని కేంద్రాన్ని కోరారు.

నేత కార్మికులకు బాసటగా నిలిచేందుకు దేశంలో ఎక్కడా లేనివిధంగా నేతన్న బీమా పథకాన్ని అమలు చేస్తున్నామని, చేనేత, పవర్‌లూమ్‌ కార్మికులు ఏ కారణంగా మరణించినా వారి కుటుంబాలకు రూ.5 లక్షల సాయం అందుతుందని అన్నారు. రాష్ట్రంలో 80 వేలమంది నేత, పవర్‌లూమ్‌ కార్మికులకు బీమాసౌకర్యం లభిస్తుందని తెలిపారు. పవర్‌లూమ్‌ కార్మికులకు రూ.2,500 కోట్ల బతుకమ్మ చీరలు, రంజాన్, క్రిస్మస్, స్కూల్‌ యూనిఫారాల వస్త్ర ఉత్పత్తికి ఆర్డర్లు ఇచ్చామని వివరించారు.

ప్రభుత్వ ఆర్డర్లతో నేత కార్మికులు మెరుగైన ఉపాధి పొందుతున్నారని, వారికి పొదుపు(త్రిఫ్ట్‌) పథకాన్ని కూడా అమలు చేస్తున్నామని వివరించారు. సిరిసిల్ల శివారుల్లోని 60 ఎకరాల్లో రూ.174 కోట్లతో నిర్మిస్తున్న అపెరల్‌ పార్క్‌ పూర్తయితే గార్మెంట్‌ రంగంలో 8 వేలమంది మహిళలకు ఉపాధి లభిస్తుందని చెప్పారు. మధ్యమానేరు జలాశయంలో రూ.2 వేల కోట్ల పెట్టుబడులతో 10 వేలమందికి ఉపాధినిచ్చేలా 367 ఎకరాల్లో ఆక్వాహబ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కేటీఆర్‌ తెలిపారు. 

12 రాష్ట్రాలకు సిరిసిల్ల జెండాలు 
స్వాతంత్య్ర వజ్రోత్సవాల వేళ రెండు వేలమంది సిరిసిల్ల నేతన్నలు ఐదువేల మగ్గాలపై కోటి 20 లక్షల జాతీయజెండాలను తయారు చేశారని కేటీఆర్‌ అన్నారు. రూ.5 కోట్ల విలువైన జాతీయ జెండాలను 12 రాష్ట్రాలకు అందించారని అభినందించారు. మండెపల్లి వద్ద 12 బ్యాచ్‌ల్లోని 332 మందికి అత్యుత్తమ ప్రమాణాలతో శిక్షణ ఇచ్చి 139 మందికి ప్లేస్‌మెంట్‌ కల్పించినట్లు తెలిపారు.

కాలునొప్పితోనే మంత్రి కేటీఆర్‌ స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్నారు. కుర్చిలో కూర్చునే ప్రసంగించారు. మంత్రి ప్రయాణిస్తున్న వ్యాన్‌ మొరాయించడంతో నిర్ణీత సమయం కంటే 35 నిమిషాలు ఆలస్యంగా సిరిసిల్లకు చేరుకున్నారు. అనంతరం సిరిసిల్ల నేతకార్మికులు మంత్రి కేటీఆర్‌ను నూలుపోగుల దండతో సత్కరించారు.  

మూడు అంశాలతో ముందుకు... 
తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరణలకు వేదికైందని, ఇన్నోవేషన్, ఇన్‌ఫ్రాస్టక్చర్, ఇంక్లుజివ్‌ గ్రోత్‌ అనే మూడు అంశాలపై ముందుకెళ్తోందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్‌లో ఇంటింటా ఇన్నోవేటర్‌ ఎగ్జిబిషన్‌–2022ను కేటీఆర్‌ ప్రారంభించారు. 33 జిల్లాల ఆవిష్కర్తలతో జరిగిన గూగుల్‌మీట్‌లో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహిస్తోందన్నారు. టీ–హబ్, వీ–హబ్, అగ్రీ–హబ్, కే–హబ్, బీ–హబ్‌ వంటి అనేక కొత్త ఆవిష్కరణలకు రాష్ట్రం వేదికగా నిలుస్తుందని కేటీఆర్‌ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement