కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో తెలంగాణ మంత్రి కేటీఆర్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో చేనేత రంగాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు ఇప్పటికే మంజూరు చేసిన హ్యాండ్‌లూమ్ క్లస్టర్లకు అదనంగా మరో 10 కొత్త వాటిని మంజూరు చేయాలని కేంద్ర జౌళి మంత్రి స్మృతీ ఇరానీని రాష్ట్ర మంత్రి కె. తారకరామారావు కోరారు. మంగళవారం కేంద్ర మంత్రిని ఢిల్లీలో కలసిన కేటీఆర్ చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఇప్పటికే రూ.1,200 కోట్ల బడ్జెట్‌తో నేతన్నకు చేయూత, చేనేత మిత్ర లాంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో ఈ రంగాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు ఇప్పటికే మంజూరు చేసిన హ్యాండ్‌లూమ్ క్లస్టర్లకు అదనంగా మరో 10 క్లస్టర్లు మంజూరు చేయాలని కోరారు.
దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించి జౌళి శాఖ సంయుక్త కార్యదర్శితో మాట్లాడి చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు కేటీఆర్ మీడియాకు తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం 8 వేల పవర్‌లూమ్స్‌ను ఆధునీకరించేందుకు చర్యలు తీసుకుంటోందని, దీనికయ్యే ఖర్చులో కేంద్రం నుంచి రావాల్సిన సగం వాటా నిధుల విడుదల ఆలస్యం కావడంతో పనులు జరగడం లేదని వివరించారు. ఈ నిధులను వెంటనే విడుదల చేయాలని కోరానన్నారు. ఈ నిధుల విడుదలపై ముంబైలోని జౌళి శాఖ కమిషనర్‌తో కేంద్ర మంత్రి మాట్లాడినట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment