త్వరలో 10 చేనేత క్లస్టర్ల ఏర్పాటు
Published Tue, Sep 13 2016 10:36 PM | Last Updated on Sat, Aug 11 2018 7:29 PM
వెదురుపాక (రాయవరం) :
త్వరలో జిల్లాలో 10 చేనేత క్లస్టర్లు ఏర్పాటు చేయనున్నట్టు చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకుడు ఎస్‌ఎస్‌ఎస్‌ఆర్‌కేఆర్ ప్రసాద్ తెలిపారు. ఈమేరకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. వెదురుపాక విజయదుర్గా పీఠాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆయన మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడారు. ఉప్పాడ, తాటిపర్తి, గొల్లప్రోలు, ఒమ్మంగి, పసలపూడి, పులుగుర్త, కొట్టాం తదితరచోట్ల బ్లాక్ లెవెల్ హేండ్‌లూమ్ క్లస్టర్లు త్వరలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే క్లస్టర్ పరిధిలో చుట్టుపక్కల గ్రామాలుంటాయన్నారు. ఒక్కో క్టస్టర్‌కు అవి చేసే వ్యాపారాన్నిబట్టి రూ.కోటి నుంచి రూ.2 కోట్లు కేటాయిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆమోదం లభించగానే క్లస్టర్ పరిధిలోని చేనేత కార్మికులకు శిక్షణ, పనిముట్లు ఇవ్వడంతోపాటు కామన్ ఫెసిలిటీ సెంటర్, యార్న్ డిపో ఏర్పాటు చేస్తామని వివరించారు. జిల్లాలోని 50 చేనేత సహకార సంఘాల పరిధిలో 12,800 మగ్గాలు ఉన్నాయని, వీటిపై సుమారు 20 వేల మంది ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. జిల్లాలో ఉన్న 50 చేనేత సంఘాల ద్వారా ఏటా రూ.15కోట్ల వ్యాపారం సాగుతున్నట్లు ప్రసాద్ వెల్లడించారు. చేనేత రంగంపై కార్మికులకు ఏటా ఆసక్తి తగ్గుతున్నట్లు గుర్తిస్తున్నామన్నారు. జిల్లాలో సహకార రంగంలో 12 వేలు, సహకారేతర రంగంలో 3 వేల మగ్గాలున్నట్లు ఆయన తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 2 వేల వరకూ మగ్గాలు తగ్గినట్లు గుర్తించామన్నారు. 35 ఏళ్లు పైబడినవారు మాత్రమే ఈ రంగంలో ఉంటున్నారని, ప్రస్తుత తరం యువకులు ఈ రంగంపై ఆసక్తి చూపడంలేదని అన్నారు. 2014 జూలై నెలాఖరు వరకూ ఉన్న వస్త్రనిల్వలపై 20 శాతం రిబేటు ఉందన్నారు. ఏటా రూ.12 కోట్ల నుంచి రూ.15 కోట్ల విలువైన వస్త్రాలు ఉత్పత్తి అవుతున్నాయని చెప్పారు. దారాలపై చేనేత సంఘాలకు 20 శాతం సబ్సిడీ ఇస్తున్నట్లు వివరించారు. జిల్లాలో ఉన్న 2,300 మంది చేనేత కార్మికులకు రుణమాఫీ రూ.5 కోట్లు మంజూరైందన్నారు. ఈ సొమ్మును త్వరలోనే బ్యాంకులకు సర్దుబాటు చేస్తామని ప్రసాద్ తెలిపారు.
Advertisement