సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: అవకాశాల స్వర్గంగా ఆధునిక హంగులు సొంతం చేసుకోనున్న మన జిల్లా త్వరలోవిశ్వ విపణిలో ఆధునిక నగరాల సరసన చేరనుంది. ప్రణాళికాబద్ధ అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా నిలవబోతుంది. గ్లోబల్‌సిటీగా మలచాలనే కొత్త ప్రభుత్వం ఆలోచనలకు కార్యరూపం ఇచ్చేందుకు జిల్లా యంత్రాంగం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. షాంైఘై, చండీగఢ్ సిటీల తరహాలో పక్కా ప్రణాళికతో నగర శివార్లను అభివృద్ధిచేసే దిశగా అడుగులు వేస్తోంది.
చారిత్రక నగరంగా పేరున్న హైదరాబాద్ మురికి మయంగా తయారుచేసిన గత పాలకుల నిర్వాకాలకు భిన్నంగా సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టనుంది. ఘట్‌కేసర్, శామీర్‌పేట ప్రాంతాల్లో మధ్యస్థ విమానాశ్రయాలు, రేడియల్ రహదారులు, బల్క్‌డ్రగ్, ఫార్మా, ఐటీ, పారిశ్రామిక సంస్థలు నెలకొల్పేందుకు నూతన కారిడార్లు, మౌలిక వసతులు ఇలా.. అన్ని రంగాల్లో జిల్లాను అగ్రభాగాన నిలబెట్టేందుకు సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మాస్టర్ ప్లాన్ ప్రాతిపదికగా అభివృద్ధిని వికేంద్రీకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన మార్గనిర్దేశానికి అనుగుణంగా జిల్లా యంత్రాంగం ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
ప్రస్తుతం కోటి ఉన్న గ్రేటర్ హైదరాబాద్ జనాభా రానున్న ఐదేళ్లలో మూడు కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్న సర్కారు.. అందుకనుగుణంగా మౌలిక వసతులను మెరుగుపరచడానికి కసరత్తు చేస్తోంది. హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు గ్లోబల్ కన్సల్టెన్సీల సహకారాన్ని కూడా వినియోగించుకోవాలని నిర్ణయించింది. అదే విధంగా జిల్లాలోని రెండు వేల చిన్ననీటి పారుదల చెరువుల పరిరక్షణకు ప్రత్యేక ప్రణాళిక తయారు చేసింది.
రీజినల్ రింగ్‌రోడ్డు: ప్రస్తుతం ఔటర్‌రింగ్ రోడ్డుకు అవతల రీజినల్ రింగ్‌రోడ్డు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజధానికి 60-70 కిలోమీటర్ల దూరంలో నగరాన్ని చుట్టుతూ ఈ రోడ్డు నిర్మితమవుతుంది. రెండు రింగ్‌రోడ్డుల మధ్య ఉన్న ప్రాంతాన్ని పారిశ్రామిక హబ్‌గా మలచాలని సర్కారు యోచిస్తోంది. ఫార్మా, ఐటీ తదితర రంగాలకు ప్రత్యేక క్లస్టర్లను ప్రతిపాదించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో మౌలిక సదుపాయాల కల్పన, ప్రణాళికాబద్ధ అభివృద్ధికి పెద్దపీట వేయాలని భావిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈ పరిధి అంతటికీ ప్రత్యేక మాస్టర్‌ప్లాన్‌ను తయారు చేయాలని హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీని ఆదేశించారు.
రెండు ఎయిర్‌పోర్టులు: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికితోడు జిల్లాలో మరో రెండు కొత్త
ఎయిర్‌పోర్టులు ఏర్పాటు కానున్నాయి. పట్టణీకరణ నేపథ్యంలో శివార్లు శరవేగంగా అభివృద్ది చెందుతాయని అంచనా వేసిన సర్కారు.. శామీర్‌పేట, ఘట్‌కేసర్ ప్రాంతాల్లో మధ్యతరహా ఎయిర్‌పోర్టులను నిర్మించాలని భావిస్తోంది. ఈ మేరకు భూసేకరణపై దృష్టి సారించింది.
కనెక్టివిటీ: కొత్త పరిశ్రమల స్థాపన, నగరీకరణ ఇక పూర్తిగా ఔటర్ రింగ్‌రోడ్డు బయటే అవకాశమున్నందున.. ఆయా ప్రాంతాలకు సులువుగా చేరుకునేందుకు రవాణా సదుపాయాలను మెరుగు పరచనుంది. దీనికి కోసం మల్టీమోడల్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఎంఎంటీఎస్)ను విస్తరించాలని నిర్ణయించింది. శివారు ప్రాంతాలకు ఈ రైళ్లను పొడిగించడం ద్వారా రవాణా సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది.
పారిశ్రామికవాడలు: పారిశ్రామిక అవసరాలకు జిల్లా యంత్రాంగం 19వేల ఎకరాలను సిద్ధం చేసింది. క్లస్టర్లుగా పరిశ్రమలను నోటిఫై చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. కొత్త సంస్థలకు కేటాయించేందుకు వీలుగా భూదాన్ యజ్జబోర్డు, సీలింగ్, యూఎల్‌సీ భూములతో ల్యాండ్‌బ్యాంకును తయారు చేస్తోంది.
పరిశ్రమల ఏర్పాటుకు ప్రత్యేక క్లస్టర్లు
Published Tue, Jul 8 2014 11:54 PM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM
Advertisement
Advertisement