Outer Ring
-
ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ 3 వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రింగ్ రోడ్డుపైన ప్రయాణిస్తున్న లారీని వెనుకనుంచి కారు ఢీ కొట్టింది. ఒక్కసారిగా అకస్మాత్తుగా చెలరేగిన మంటలు చెలరేగాయి. మంటల్లో కారు పూర్తిగా దగ్ధం కాగా.. లారీకి మంటలు అంటుకున్నాయి. కారులో ఇద్దరూ సజీవ దహనం అయినట్టు సమాచారం.దీంతో మేడ్చల్ నుండి శంషాబాద్ వెళ్లే ఓఆర్ఆర్ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. పూర్తిగా దగ్దమైన కారు, కారు నెంబర్ ద్వారా గుర్తించే పనిలో పోలీసులు పరిశీలిస్తున్నారు. -
ఇకపై ఈ ప్రాంతాలకు 'ఆర్ ఆర్ ఆర్' (RRR)
గజ్వేల్: ట్రిపుల్ ఆర్ (రీజినల్ రింగ్ రోడ్డు)కు సంబంధించి ఉత్తర భాగంలో చేపట్టాల్సిన భూసేకరణ, సామగ్రి తరలింపు అంశాలపై సంబంధిత అధికారులు ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరుణంలో సహజంగానే ట్రిపుల్ ఆర్ వ్యవహారంలోనూ కొంత స్తబ్దత ఏర్పడింది. ప్రస్తుతం అధికారిక కార్యక్రమాలన్నీ వేగవంతమవుతున్న నేపథ్యంలో ట్రిపుల్ఆర్ విషయంలో ముందడుగుపడే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ అంశం కీలక దశకు చేరుకుంది. భూసేకరణ, రోడ్డు నిర్మాణం కోసం గుర్తించిన స్థలంలో అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాలు, టవర్లు, ఇతర సామగ్రి పక్కకు తరలించే పనిపై సంబంధిత అధికారులు దృష్టి సారించారు. ఉత్తర భాగంలోని ఉమ్మడి నల్గొండ జిల్లాతోపాటు ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని (సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి) పనులు జరగనున్నాయి. భూసేకరణను చేపట్టడానికి రెవెన్యూడివిజన్ల వారీగా కాలా (కాంపిటెంట్ అథారిటీ ఫర్ ల్యాండ్ అక్వజైషన్)లను ఏర్పాటు చేసిన సంగతి విదితమే. ఇందులో భాగంగానే చౌటుప్పల్, యాదాద్రి, అందోల్–జోగిపేటతోపాటు గజ్వేల్, తూప్రాన్, భువనగిరి కాలాల పరిధిలోనూ త్రీడీ నోటిఫికేషన్లు వెలువడిన సంగతి తెలిసిందే. మొత్తంగా ఎనిమిది కాలాల పరిధిలోని 84 గ్రామాల్లో 4700 ఎకరాల వరకు భూసేకరణ జరగనుండగా.. అత్యధికంగా గజ్వేల్‌లో 980 ఎకరాలను సేకరించనున్నారు. ఉత్తర భాగం రీజినల్ రింగు రోడ్డు నిడివి 158 కిలోమీటర్లు కాగా ఇందులో 100 కిలోమీటర్ల వరకు ఉమ్మడి మెదక్ జిల్లాలో విస్తరించనున్నది. సామగ్రి తరలింపునకు చర్యలు ఉత్తర భాగంలో నిర్మించనున్న ట్రిపుల్ఆర్ రోడ్డు గుర్తించిన భూముల్లో అడ్డంగా ఉన్న విద్యుత్ స్తంభాలు, టవర్లు, ఇతర సామగ్రి తరలింపునకు చర్యలు తీసుకోనున్నాం. ఇందుకు సంబంధించిన కార్యాచరణపై కసరత్తు జరుగుతోంది. పూర్తికాగానే పనులు ప్రారంభమవుతాయి. భూసేకరణ అంశంలోనూ ముందడుగు పడనుంది. – రాహుల్, ఎన్హెచ్ఏఐ డిప్యూటీ మేనేజర్ ఇవి చదవండి: కోడళ్లకు అక్కడ 'నో రేషన్‌కార్డు'.. -
సాఫ్ట్వేర్ ఇంజనీర్ దుర్మరణం
శంషాబాద్ రూరల్(రాజేంద్రనగర్): అసంపూర్తిగా ఉన్న ఔటర్ సర్వీసు రోడ్డుపై ఉన్న ఓ గుంతలో పడిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ దుర్మరణం చెందాడు. ఈ సంఘటన మండలంలోని పోశెట్టిగూడ సమీపంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. ఎస్సై అహ్మద్‌పాషా తెలిపిన వివరాల ప్రకారం.. జయశంకర్ జిల్లా మంగపేట్ మండలం కమలాపూర్ వాసి జి.శంకర్(26) శంషాబాద్ సమీపంలో ఉన్న అమెజాన్ కంపెనీ గోదాంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. శంషాబాద్‌లో నివాసముంటున్న ఇతను సోమవారం ఉదయం బైక్‌పై తుక్కుగూడ వైపు నుంచి శంషాబాద్ వస్తున్నాడు. ఔటర్‌లోని సర్వీసు దారిగుండా హమీదుల్లానగర్ సమీపంలోకి రాగానే.. ఇతను తొండుపల్లి మార్గం వైపు వెళ్లకుండా నేరుగా ముందుకు వెళ్లాడు. కొద్దిదూరంలో అసంపూర్తిగా ఉన్న సర్వీసు రోడ్డు చివరలో గుంతలో పడిపోయాడు. బీటీ రోడ్డు చివరి నుంచి దాదాపు వంద అడుగుల దూరం వరకు బైక్ వేగంగా రాళ్లు, మట్టికుప్పలు దాటుకుంటూ అక్కడున్న గుంతలో పడిపోయింది. ఈ ప్రమాదంలో శంకర్ తలకు తీవ్రగాయాలై సంఘటన స్థలంలోనే మృతిచెందాడు. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు మృతుడి వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పరిశ్రమల ఏర్పాటుకు ప్రత్యేక క్లస్టర్లు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: అవకాశాల స్వర్గంగా ఆధునిక హంగులు సొంతం చేసుకోనున్న మన జిల్లా త్వరలోవిశ్వ విపణిలో ఆధునిక నగరాల సరసన చేరనుంది. ప్రణాళికాబద్ధ అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా నిలవబోతుంది. గ్లోబల్‌సిటీగా మలచాలనే కొత్త ప్రభుత్వం ఆలోచనలకు కార్యరూపం ఇచ్చేందుకు జిల్లా యంత్రాంగం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. షాంైఘై, చండీగఢ్ సిటీల తరహాలో పక్కా ప్రణాళికతో నగర శివార్లను అభివృద్ధిచేసే దిశగా అడుగులు వేస్తోంది. చారిత్రక నగరంగా పేరున్న హైదరాబాద్ మురికి మయంగా తయారుచేసిన గత పాలకుల నిర్వాకాలకు భిన్నంగా సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టనుంది. ఘట్కేసర్, శామీర్‌పేట ప్రాంతాల్లో మధ్యస్థ విమానాశ్రయాలు, రేడియల్ రహదారులు, బల్క్‌డ్రగ్, ఫార్మా, ఐటీ, పారిశ్రామిక సంస్థలు నెలకొల్పేందుకు నూతన కారిడార్లు, మౌలిక వసతులు ఇలా.. అన్ని రంగాల్లో జిల్లాను అగ్రభాగాన నిలబెట్టేందుకు సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మాస్టర్ ప్లాన్ ప్రాతిపదికగా అభివృద్ధిని వికేంద్రీకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన మార్గనిర్దేశానికి అనుగుణంగా జిల్లా యంత్రాంగం ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ప్రస్తుతం కోటి ఉన్న గ్రేటర్ హైదరాబాద్ జనాభా రానున్న ఐదేళ్లలో మూడు కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్న సర్కారు.. అందుకనుగుణంగా మౌలిక వసతులను మెరుగుపరచడానికి కసరత్తు చేస్తోంది. హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు గ్లోబల్ కన్సల్టెన్సీల సహకారాన్ని కూడా వినియోగించుకోవాలని నిర్ణయించింది. అదే విధంగా జిల్లాలోని రెండు వేల చిన్ననీటి పారుదల చెరువుల పరిరక్షణకు ప్రత్యేక ప్రణాళిక తయారు చేసింది. రీజినల్ రింగ్‌రోడ్డు: ప్రస్తుతం ఔటర్‌రింగ్ రోడ్డుకు అవతల రీజినల్ రింగ్‌రోడ్డు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజధానికి 60-70 కిలోమీటర్ల దూరంలో నగరాన్ని చుట్టుతూ ఈ రోడ్డు నిర్మితమవుతుంది. రెండు రింగ్‌రోడ్డుల మధ్య ఉన్న ప్రాంతాన్ని పారిశ్రామిక హబ్‌గా మలచాలని సర్కారు యోచిస్తోంది. ఫార్మా, ఐటీ తదితర రంగాలకు ప్రత్యేక క్లస్టర్లను ప్రతిపాదించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో మౌలిక సదుపాయాల కల్పన, ప్రణాళికాబద్ధ అభివృద్ధికి పెద్దపీట వేయాలని భావిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈ పరిధి అంతటికీ ప్రత్యేక మాస్టర్‌ప్లాన్‌ను తయారు చేయాలని హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీని ఆదేశించారు. రెండు ఎయిర్‌పోర్టులు: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికితోడు జిల్లాలో మరో రెండు కొత్త ఎయిర్‌పోర్టులు ఏర్పాటు కానున్నాయి. పట్టణీకరణ నేపథ్యంలో శివార్లు శరవేగంగా అభివృద్ది చెందుతాయని అంచనా వేసిన సర్కారు.. శామీర్‌పేట, ఘట్కేసర్ ప్రాంతాల్లో మధ్యతరహా ఎయిర్‌పోర్టులను నిర్మించాలని భావిస్తోంది. ఈ మేరకు భూసేకరణపై దృష్టి సారించింది. కనెక్టివిటీ: కొత్త పరిశ్రమల స్థాపన, నగరీకరణ ఇక పూర్తిగా ఔటర్ రింగ్‌రోడ్డు బయటే అవకాశమున్నందున.. ఆయా ప్రాంతాలకు సులువుగా చేరుకునేందుకు రవాణా సదుపాయాలను మెరుగు పరచనుంది. దీనికి కోసం మల్టీమోడల్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఎంఎంటీఎస్)ను విస్తరించాలని నిర్ణయించింది. శివారు ప్రాంతాలకు ఈ రైళ్లను పొడిగించడం ద్వారా రవాణా సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. పారిశ్రామికవాడలు: పారిశ్రామిక అవసరాలకు జిల్లా యంత్రాంగం 19వేల ఎకరాలను సిద్ధం చేసింది. క్లస్టర్లుగా పరిశ్రమలను నోటిఫై చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. కొత్త సంస్థలకు కేటాయించేందుకు వీలుగా భూదాన్ యజ్జబోర్డు, సీలింగ్, యూఎల్సీ భూములతో ల్యాండ్‌బ్యాంకును తయారు చేస్తోంది. -
అతివేగానికి ఇద్దరి బలి
‘ఔటర్’పై ప్రమాదానికి గురైన టాటా ఏస్ వాహనం డ్రైవర్ తో పాటు యువకుడి మృతి మరో యువకుడికి తీవ్రగాయాలు రాజేంద్రనగర్, న్యూస్‌లైన్: అతివేగం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. మరో యువకుడిని తీవ్రగాయాల పాల్జేసింది. ఔటర్ రింగ్‌రోడ్డుపై శనివారం ఈ దుర్ఘటన జరిగింది. నార్సింగి పోలీసుల కథనం ప్రకారం... సైదాబాద్ సింగరేణి కాలనీకి చెందిన మహ్మద్ ముక్తార్(27) గూడ్స్ వాహనాల డ్రైవర్. శనివారం ఉదయం టాటా ఏస్ వాహనంలో వేస్ట్ ఆయిల్ డ్రమ్ములను తీసుకుని కొల్లాపూర్ మీదుగా శంషాబాద్‌కు బయలుదేరాడు. ఇతనికి సహాయకులుగా సింగరేణి కాలనీకి చెందిన అఫ్సర్‌ఖాన్(28), మహ్మద్ అమీర్(27)లు వాహనంలో ప్రయాణిస్తున్నారు. ఔటర్‌రింగ్‌రోడ్డు కోకాపేట్ టోల్గేట్ వద్దకు రాగానే వాహనం అదుపుతప్పి స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ సంఘటనలో వాహనం ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. డ్రైవర్ ముక్తార్, అఫ్సర్‌ఖాన్‌కు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. అమీర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న వెంటనే నార్సింగి పోలీసులు, రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వాహనంలో ఇరుక్కున్న ఇరువురి మృతదేహాలతో పాటు గాయపడ్డ అమీర్‌ను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. అమీర్ చావుబతుకుల మధ్య చికిత్సపొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రిక్తహస్తం
సాక్షి, సిటీబ్యూరో : ఆశల ఊసులు.. హామీల బాసలు.. మినహా ఆనం సోమవారం ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మొత్తంగా కనికట్టునే తలపించింది. గ్రేటర్ పరిధిలో మంచినీరు, రహదారులు, పారిశుధ్యం, ప్రజారోగ్యం, ప్రజారవాణా, మౌలిక వసతుల కల్పనకు ఈ బడ్జెట్లో ప్రాధాన్యం దక్కకపోవడం మహానగర జనులను నిరాశ పరిచింది. జీహెచ్ఎంసీ ప్రతిపాదించిన పలు అభివృద్ధి పథకాలు, ఆర్ఓబీలు, ఆర్‌యూబీలు, గృహనిర్మాణం, సంక్షేమ పథకాలకు నయాపైసా నిధులు విదల్చకుండా రాష్ట్ర సర్కారు అంకెల గారడీని ప్రదర్శించింది. ఆక్ట్రాయ్, వృత్తిపన్నులో వాటా కేటాయించలేదు. రహదారుల విస్తరణ వంటి పథకాలకూ నిరాశే మిగిల్చింది. మొత్తంగా మహానగర పాలక సంస్థ(జీహెచ్ఎంసీ)కు ఈ బడ్జెట్లో దక్కింది కేవలం రూ.29 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. ఇక పేరు గొప్ప మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఔటర్ రింగ్‌రోడ్డు, హుస్సేన్‌సాగర్ ప్రక్షాళనకు నయాపైసా నిధులు విదిల్చకుండా సర్కారు ముఖం చాటేసింది. కేవలం బాపూఘాట్ బ్రిడ్జికి రూ.50 లక్షల నిధులు కేటాయించి చేతులు దులుపుకొంది. మాస్టర్‌ప్లాన్ అమలు, మౌలిక వసతుల కల్పనకు నిధులు విడుదల చేయకపోవడం సర్కారు చిత్తశుద్ధిని ప్రశ్నార్థకంగా మారుస్తోంది. ఇక జలమండలి రూ. 579.48 కోట్ల మేర బడ్జెట్ ప్రతిపాదనలు పంపగా.. వీటిలో మొదటి త్రైమాసికం(ఫస్ట్ క్వార్టర్) కింద రూ.150 కోట్ల నిధులు మాత్రమే ఓట్‌ఆన్ అకౌంట్ బడ్జెట్లో బోర్డు ఖాతాకు జమ అయ్యే అవకాశాలున్నట్లుజలమండలి ఫైనాన్స్ విభాగం అధికారులు తెలిపారు. దీంతో మహానగర దాహార్తిని తీర్చేందుకు కీలకమైన గోదావరి మంచినీటి పథకం, కృష్ణా మూడోదశ పథకాలు నత్తనడకన సాగనున్నాయి. ఇప్పటికే పాతనగరం, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో చేపట్టిన సీవరేజి మాస్టర్‌ప్లాన్ పనులపై సర్కారు శీతకన్ను వేయడంతో పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారనున్నాయి. శివార్ల దాహార్తిని తీర్చేందుకు మంచినీటి పైప్‌లైన్ నెట్వర్క్ విస్తరణ, డ్రైనేజి వసతుల కల్పన వంటి కీలక అంశాలకూ ఈ బడ్జెట్లో సముచిత ప్రాధాన్యం లభించకపోవడం గ్రేటర్ పిటీగా మారింది. ఇక నగరానికి తలమానికంగా మారిన ఎలివేటెడ్ మెట్రో ప్రాజెక్టుకు రూ.500 కోట్ల మేర నిధులు కేటాయించనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో పేర్కొనడం కాస్త ఊరట కలిగించే అంశం. ఉస్మానియా, నిమ్స్ సర్కారు దవాఖానాలకు అరకొర నిధులు కేటాయించి ప్రభుత్వం మమ అనిపించింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కల్పన, అధునాతన వైద్య సదుపాయాల కల్పన విషయాన్ని గాలికొదిలేసింది. రోజురోజుకూ కిక్కిరిసిపోతున్న మహానగర ప్రజారవాణా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అవసరమైన నిధులు విడుదల చేయడంలో సర్కారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిందని నిపుణులు ఆక్షేపిస్తున్నారు. మొత్తంగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ గ్రేటర్ సిటీజన్లకు అరచేతిలో వైకుంఠం చూపిందని చెప్పక తప్పదు. జీహెచ్ఎంసీకి మొండిచెయ్యి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ జీహెచ్ఎంసీకి మొండిచెయ్యే చూపింది. ఏ ఒక్క ప్రాజెక్టుకు కానీ.. కనీస మౌలిక సదుపాయాల కల్పనకు కానీ ఎలాంటి నిధుల్ని చూపలేదు. వార్షిక ప్లాన్ కింద జీహెచ్ఎంసీ కమిషనర్ పేరిట రూ. 2 కోట్లు, ప్రణాళిక కేటాయింపుల్లో భాగంగా యూసీడీ, చార్మినార్ పాదచారుల పథకాలకు చెరో రూ. కోటి చొప్పున మరో రూ. 2 కోట్లు కేటాయించింది. ఎంఎంటీఎస్‌కు రూ. 25 కోట్లు చూపింది. అంతకుమించి ఇతరత్రా పధకాలు, నిధుల ఊసే లేదు. గత ఆర్థిక సంవత్సరం వృత్తిపన్ను వసూళ్ల నుంచి జీహెచ్ఎంసీకి రూ. 300 కోట్లు చెల్లించాల్సిందిగా కోరగా, కనీసం రూ. 100 కోట్లు కేటాయించింది. ఈ సంవత్సరం సైతం రూ. 300 కోట్లను జీహెచ్ఎంసీ ప్రతిపాదించినప్పటికీ, ఎలాంటి కేటాయింపులు చూపలేదు. ప్రణాళిక (రూ. 162.35 కోట్లు), ప్రణాళికేతర (రూ. 551.69 కోట్లు) పద్దుల కింద మొత్తం రూ. 714.04 కోట్లు కావాల్సిందిగా జీహెచ్ఎంసీ ప్రతిపాదనలు పంపగా.. మొత్తంగా రూ.29 కోట్ల కేటాయింపులు మాత్రమే చూపింది. ప్రణాళికేతర పద్దులకు అసలు కేటాయింపులే లేవు. ఆస్పత్రులకు అరకొర వడ్డింపు గ్రేటర్‌లోని ధర్మాసుపత్రులకు అరకొరగా వడ్డించింది. నిరుడు ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ కేటాయింపులనే ఈ బడ్జెట్లోనూ చూపించింది. నిమ్స్, ఉస్మానియా, ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రి, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రులు మినహా, మిగిలిన ఆస్పత్రుల ఊసే లేదు. హెచ్ఎండీఏకి నిధులు నిల్ బడ్జెట్లో హెచ్ఎండీఏ ప్రతిపాదించిన కొత్త ప్రాజెక్టుల్లో నాన్ ప్లానింగ్ కింద ఒక్కటంటే ఒక్కదానికి కూడా నిధులు విదల్చలేదు. ఆన్‌గోయింగ్ ప్రాజెక్టులకు ఁజైకా* నుంచి తీసుకొన్న రుణాలనే నిధులుగా ప్లానింగ్ కింద బడ్జెట్లో చూపించారు. మూసీనదిపై బాపూఘాట్ వద్ద వంతెన నిర్మాణానికి రూ.50 లక్షలు మినహా మరే ఇతర నిధులు కేటాయించ లేదు. ప్రతిష్టాత్మకమైన ఔటర్‌రింగ్‌రోడ్డు, హుస్సేన్ సాగర్ ప్రక్షాళన, ఫ్లైఓవర్స్ ఇతర అభివృద్ధి పనులకు రుణ రూపంలో విదేశీ సాయం పొందేలా ప్రభుత్వం బడ్జెట్లో రూ.1281.07కోట్లు కేటాయించింది. వాస్తవానికి గత ఏడాది బడ్జెట్లో ప్లానింగ్ కింద రూ.1281.07కోట్లు కేటాయించిన సర్కార్.. ప్రస్తుత బడ్జెట్లో కూడా అంతే మొత్తాన్ని కేటాయించి చేతులు దులుపేసుకొంది. జలమండలికి నిరాశే బడ్జెట్ జలమండలికి నిరాశే మిగిల్చింది. గోదావరి మంచినీటి పథకం, కృష్ణా మూడోదశ, మూసీ ప్రక్షాళన రెండోదశ, శివారు మంచినీటి సరఫరా, మూసీ ప్రక్షాళన రెండోదశ, వసతుల కల్పన పథకాలకు అరకొర నిధులు విదిల్చి చేతులు దులుపుకుంది. మొత్తంగా వివిధ పథకాలకు సంబంధించి మొత్తంగా జలమండలి 579.48 కోట్ల మేర బడ్జెట్ ప్రతిపాదనలు పంపగా వీటిలో మొదటి త్రైమాసికం (ఫస్ట్ క్వార్టర్) కింద రూ.150 కోట్ల నిధులు మాత్రమే ఓట్‌ఆన్ అకౌంట్ బడ్జెట్లో బోర్డు ఖాతాకు జమ కానున్నట్లు జలమండలి ఫైనాన్స్ విభాగం అధికారులు తెలిపారు. మెట్రోకు రూ.500 కోట్లు.. నగరంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టుకుబడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించనున్నట్లు ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. దీంతో మెట్రో పనులు ఊపందుకోనున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి నాగోల్-మెట్టుగూడా మార్గంలో మెట్రో మార్గాన్ని పూర్తిచేస్తామని బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించడం విశేషం. ఈ నిధులతో మెట్రో పనులు జరుగుతున్న ప్రాంతాల్లో ఆధునిక వసతులు కల్పించనున్నారు. ఎంఎంటీఎస్ రెండో దశకు రూ.25 కోట్లు రాష్ట్రప్రభుత్వం బడ్జెట్లో ఎంఎంటీఎస్ రెండో దశకు కేవలం రూ.25 కోట్లు కేటాయించింది. నిర్మాణ వ్యయంలో తన వాటా కింద 2/3 వంతు నిధులు చెల్లించవలసిన ప్రభుత్వం గత ఆర్ధిక సంవత్సరం రూ.60 కోట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించి రూ.30 కోట్లే ఇచ్చింది. ఈ ఆర్ధిక సంవత్సరం రూ.25 కోట్లు ప్రకటించింది. రైల్వేశాఖ నిరుడు రూ.30 కోట్ల నిధులను వెచ్చించింది. కేంద్ర,రాష్ట్రాల సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు నిర్మాణానికి నిధుల లేమి వెంటాడుతోంది. ట్రాఫిక్‌కు ఈ ‘సారీ’... ప్రభుత్వం ట్రాఫిక్ విభాగానికి బడ్జెట్లో ప్రత్యేకించి కేటాయింపులు ప్రస్తావించకపోయినా... గత ఏడాది మాదిరే ఉంటుందని స్పష్టం చేసింది. ఈ లెక్కన వరుసగా మూడోసారి కూడా రూ.3.7 కోట్లు కేటాయించినట్లవుతుంది. 2013-14 సంవత్సరానికి సంబంధించి ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాల కింద హైదరాబాద్ కమిషనరేట్‌కు రూ. 425 కోట్లు, సైబరాబాద్‌కు రూ.235 కోట్లు కేటాయించారు. ఈసారీ కేటాయింపులు ఇలానే కొనసాగనున్నాయి. -
భారీగా భూముల ధరలు
భారీగా భూముల ధరలు స్వల్పంగా ప్రభుత్వ పరిహారం ససేమిరా అంటున్న రైతులు కోర్టును ఆశ్రయించిన ఇరుపక్షాలు తీర్పు కోసం ఎదురుచూపులు విజయవాడ ఔటర్ రింగ్‌రోడ్డు భూసేకరణ వివాదం ఇంకా తొలగలేదు. రైతులు, ప్రభుత్వం ఎవరి వాదన వారు వినిపిస్తూ కోర్టును ఆశ్రయించారు. సమస్యలన్నీ పరిష్కరించి మూడు నెలల్లో పనులు ప్రారంభిస్తామని మరోపక్క అధికారులు చెబుతున్నారు. ఏదేమైనా రోడ్డు నిర్మాణం పూర్తయితే విజయవాడకు ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది. సాక్షి, విజయవాడ : విజయవాడ ఔటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్ఆర్)కు భూసేకరణ అడ్డంకిగా మారింది. విజయవాడ, గుంటూరు జిల్లాల్లో భూముల ధరలు ఎక్కువగా ఉండటం, ప్రభుత్వం ఇస్తానంటున్న ధరలు చాలా తక్కువగా ఉండటంతో వివాదం మొదలైంది. దీంతో గుంటూరు జిల్లా వెంకటాపాలెం రైతులతో పాటు, కృష్ణాజిల్లాలోని గొల్లపూడి రైతులు కూడా కోర్టును ఆశ్రయించారు. ఇటీవల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు విజయవాడ వచ్చిన సందర్భంలో కూడా రైతులు ముఖ్యమంత్రిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ విషయంపై దృష్టి పెట్టి రైతులకు న్యాయం చేయాలని ఆయన కలెక్టర్‌ను ఆదేశించారు. భూసేకరణ పూర్తయితే మూడు నెలల్లో పనులు ప్రారంభిస్తామని ఎన్హెచ్ఏఐ అధికారులు చెబుతున్నారు. కాంట్రాక్ట్ పొందిన గామన్ ఇండియా సంస్థకు, ఎన్హెచ్ఏఐ అధికారులకు మధ్య ఈ వారంలో ఢిల్లీలో సమావేశం ఉంది. ఈ సమావేశంలో పనులు ఎప్పటినుంచి ప్రారంభమయ్యేదీ ఒక స్పష్టత వచ్చే అవకాశముంది. ఈ ప్రాజెక్టును బీఓటీ (బిల్ట్, ఆపరేట్, ట్రాన్స్ఫర్) పద్ధతిలో 30 నెలల్లో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భూసేకరణకు రూ.400 కోట్లు గుంటూరు జిల్లా చినకాకాని నుంచి పశ్చిమగోదావరి జిల్లా గుండుగొలను వరకు చేపడుతున్న విస్తరణకు భూసేకరణకే రూ.400 కోట్లు ఖర్చవుతుందని అధికారుల అంచనా. భూసేకరణకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, వాటన్నింటినీ త్వరలోనే పరిష్కరిస్తామని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. గతంలో భూసేకరణ అంశం ఎన్హెచ్ఏఐ పరిధిలో ఉన్నప్పుడు తామే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండేదని, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ అధికారుల చేతుల్లో పెట్టడంతో నిర్ణయంలో జాప్యం చోటుచేసుకుంటోందని ఎన్హెచ్ఏఐ అధికారులు చెబుతున్నారు. మరో వివాదం ఓ వైపు భూసేకరణ వివాదం ఇలా ఉంటే వంతెన కారణంగా తమ ప్రాంతమంతా మునిగిపోతుందని కృష్ణానది చుట్టూ ఉన్న లంకవాసులు ఆందోళన చెందుతున్నారు. వెంకటాపాలెం, గొల్లపూడి మధ్య 3.4 కిలోమీటర్ల మేర వంతెన వస్తుంది. దీనికోసం వేసే పిల్లర్ల కారణంగా పక్కనే ఉన్న లంకలు ముంపునకు గురవుతాయని, వాటిపై బతుకుతున్న బలహీనవర్గాలకు చెందిన 90 కుటుంబాలు రోడ్డున పడతాయని కొత్త వాదన తెరపైకి తెచ్చారు. వీరు కూడా కోర్టును ఆశ్రయించడానికి సన్నద్ధం అవుతున్నారు. టోల్ బాదుడే... రూ.1624 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టుకు అయ్యే డబ్బులు వసూలు చేసుకునేందుకు 103 కిలోమీటర్లకు గాను మూడు టోల్గేట్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. టోల్ ధర ఎంత అన్నది ఇంకా నిర్ణయించలేదు. గుంటూరు జిల్లా వెంకటాపాలెం, రాయనపాడు, కలపర్రు వద్ద టోల్‌ప్లాజాలు ఏర్పాటుచేసే అవకాశముంది. 2011లోనే ప్రాజెక్టు మొదలుకావాల్సి ఉన్నా భూసేకరణలో ఏర్పడిన ఇబ్బందులు, గామన్ ఇండియా సంస్థ తన వాటా డబ్బు సమకూర్చుకోవడంలో జరిగిన జాప్యం కారణంగా ఆలస్యమైంది. అయితే పాత ధరలతోనే పనులు చేయడానికి గామన్ ఇండియా సంస్థ అంగీకారం తెలిపింది. 103 కిలోమీటర్ల పొడవున గుంటూరు జిల్లా కాజ నుంచి పశ్చిమగోదావరి జిల్లా గుండుగొలను వరకు రోడ్డు విస్తరణ ప్రాజెక్టుగా చేపట్టనున్నారు. ఇందులో 48 కిలోమీటర్ల మేర అవుటర్ రింగ్‌రోడ్డు ఉండగా, ఏడు కిలోమీటర్లు హనుమాన్‌జంక్షన్ బైపాస్ ఉంది. మిగిలిన రోడ్డును ప్రస్తుతం ఉన్న నాలుగు లైన్ల నుంచి ఆరు లైన్లకు విస్తరిస్తారు. ఈ రోడ్డు పూర్తయితే విజయవాడకు ట్రాఫిక్ ఇక్కట్లు తగ్గుతాయి. అన్నీ సమకూరితే మూడు నెలల్లో పనులు ప్రారంభమవుతాయని చెబుతున్నారు. వివాదం ఎందుకంటే... ఆయా ప్రాంతాల్లోని భూముల ధరలకు, ప్రభుత్వం ఇస్తానంటున్న పరిహారానికి వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంది. దీంతో రైతులు భూములు ఇవ్వడానికి అంగీకరించడం లేదు. గుంటూరు జిల్లా వెంకటాపాలెం వద్ద ఎకరం ధర రూ.కోటి పలికింది. ఇదే ధరతో రిజిస్ట్రేషన్లు కూడా జరిగాయి. మార్కెట్ రేటు పెంచాలని రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తులు పంపారు. ఇక్కడ వాస్తవ ధర అంతగా లేదని, రింగ్‌రోడ్డు వస్తుందన్న సాకు చూపి కావాలని రేట్లు పెంచేశారంటూ ఎన్హెచ్ఏఐ అధికారులు రైతులకు వ్యతిరేకంగా కోర్టులో అఫిడవిట్లు దాఖలు చేశారు. దీనిపై కోర్టు తీర్పు వెలువరించాల్సి ఉంది. విజయవాడ రూరల్ మండలంలో కూడా గొల్లపూడి నుంచి జక్కంపూడి వరకు 20 ఎకరాలకు సంబంధించి భూసేకరణ వివాదంలో ఉంది. ఇక్కడ గజానికి రూ.3,500 చెల్లించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చినా రైతులు ఇంకా ఎక్కువ ధర చెల్లించాలని పట్టుబడుతున్నారు. హనుమాన్‌జంక్షన్ బైపాస్ విషయంలోనూ ఎన్హెచ్ఏఐ అధికారులు, రైతుల మధ్య వివాదాలు నెలకొన్నాయి. పక్క జిల్లాలో ఎక్కువ ధర చెల్లిస్తూ ఇక్కడ నామమాత్రపు ధర చెల్లిస్తుండడంతో రైతులు కినుక వహిస్తున్నారు.