రిక్తహస్తం | Otan account budget | Sakshi
Sakshi News home page

రిక్తహస్తం

Published Tue, Feb 11 2014 6:08 AM | Last Updated on Wed, Apr 3 2019 8:07 PM

రిక్తహస్తం - Sakshi

రిక్తహస్తం

సాక్షి, సిటీబ్యూరో : ఆశల ఊసులు.. హామీల బాసలు.. మినహా ఆనం సోమవారం ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మొత్తంగా కనికట్టునే తలపించింది. గ్రేటర్ పరిధిలో మంచినీరు, రహదారులు, పారిశుధ్యం, ప్రజారోగ్యం, ప్రజారవాణా, మౌలిక వసతుల కల్పనకు ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యం దక్కకపోవడం మహానగర జనులను నిరాశ పరిచింది. జీహెచ్‌ఎంసీ ప్రతిపాదించిన పలు అభివృద్ధి పథకాలు, ఆర్‌ఓబీలు, ఆర్‌యూబీలు, గృహనిర్మాణం, సంక్షేమ పథకాలకు నయాపైసా నిధులు విదల్చకుండా రాష్ట్ర సర్కారు అంకెల గారడీని ప్రదర్శించింది.

ఆక్ట్రాయ్, వృత్తిపన్నులో వాటా కేటాయించలేదు. రహదారుల విస్తరణ వంటి పథకాలకూ నిరాశే మిగిల్చింది. మొత్తంగా మహానగర పాలక సంస్థ(జీహెచ్‌ఎంసీ)కు ఈ బడ్జెట్‌లో దక్కింది కేవలం రూ.29 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. ఇక పేరు గొప్ప మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఔటర్ రింగ్‌రోడ్డు, హుస్సేన్‌సాగర్ ప్రక్షాళనకు నయాపైసా నిధులు విదిల్చకుండా సర్కారు ముఖం చాటేసింది. కేవలం బాపూఘాట్ బ్రిడ్జికి రూ.50 లక్షల నిధులు కేటాయించి చేతులు దులుపుకొంది. మాస్టర్‌ప్లాన్ అమలు, మౌలిక వసతుల కల్పనకు నిధులు విడుదల చేయకపోవడం సర్కారు చిత్తశుద్ధిని ప్రశ్నార్థకంగా మారుస్తోంది.

ఇక జలమండలి రూ. 579.48 కోట్ల మేర బడ్జెట్ ప్రతిపాదనలు పంపగా.. వీటిలో మొదటి త్రైమాసికం(ఫస్ట్ క్వార్టర్) కింద రూ.150 కోట్ల  నిధులు మాత్రమే ఓట్‌ఆన్ అకౌంట్ బడ్జెట్‌లో బోర్డు ఖాతాకు జమ అయ్యే అవకాశాలున్నట్లుజలమండలి ఫైనాన్స్ విభాగం అధికారులు తెలిపారు. దీంతో మహానగర దాహార్తిని తీర్చేందుకు కీలకమైన గోదావరి మంచినీటి పథకం, కృష్ణా మూడోదశ పథకాలు నత్తనడకన సాగనున్నాయి. ఇప్పటికే పాతనగరం, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో చేపట్టిన సీవరేజి మాస్టర్‌ప్లాన్ పనులపై సర్కారు శీతకన్ను వేయడంతో పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారనున్నాయి.

శివార్ల దాహార్తిని తీర్చేందుకు మంచినీటి పైప్‌లైన్ నెట్‌వర్క్ విస్తరణ, డ్రైనేజి వసతుల కల్పన వంటి కీలక అంశాలకూ ఈ బడ్జెట్‌లో సముచిత ప్రాధాన్యం లభించకపోవడం గ్రేటర్ పిటీగా మారింది. ఇక నగరానికి తలమానికంగా మారిన ఎలివేటెడ్ మెట్రో ప్రాజెక్టుకు రూ.500 కోట్ల మేర నిధులు కేటాయించనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో పేర్కొనడం కాస్త ఊరట కలిగించే అంశం. ఉస్మానియా, నిమ్స్ సర్కారు దవాఖానాలకు అరకొర నిధులు కేటాయించి ప్రభుత్వం మమ అనిపించింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కల్పన, అధునాతన వైద్య సదుపాయాల కల్పన విషయాన్ని గాలికొదిలేసింది. రోజురోజుకూ కిక్కిరిసిపోతున్న మహానగర ప్రజారవాణా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అవసరమైన నిధులు విడుదల చేయడంలో సర్కారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిందని నిపుణులు ఆక్షేపిస్తున్నారు. మొత్తంగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ గ్రేటర్ సిటీజన్లకు అరచేతిలో వైకుంఠం చూపిందని చెప్పక తప్పదు.
 
 జీహెచ్‌ఎంసీకి మొండిచెయ్యి

 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ జీహెచ్‌ఎంసీకి మొండిచెయ్యే చూపింది. ఏ ఒక్క ప్రాజెక్టుకు కానీ.. కనీస మౌలిక సదుపాయాల కల్పనకు కానీ ఎలాంటి నిధుల్ని చూపలేదు. వార్షిక ప్లాన్ కింద జీహెచ్‌ఎంసీ కమిషనర్ పేరిట రూ. 2 కోట్లు, ప్రణాళిక కేటాయింపుల్లో భాగంగా యూసీడీ, చార్మినార్ పాదచారుల పథకాలకు చెరో రూ. కోటి చొప్పున మరో రూ. 2 కోట్లు కేటాయించింది. ఎంఎంటీఎస్‌కు రూ. 25 కోట్లు చూపింది. అంతకుమించి ఇతరత్రా పధకాలు, నిధుల ఊసే లేదు. గత ఆర్థిక సంవత్సరం వృత్తిపన్ను వసూళ్ల నుంచి జీహెచ్‌ఎంసీకి రూ. 300 కోట్లు చెల్లించాల్సిందిగా కోరగా, కనీసం రూ. 100 కోట్లు కేటాయించింది. ఈ సంవత్సరం సైతం రూ. 300 కోట్లను జీహెచ్‌ఎంసీ ప్రతిపాదించినప్పటికీ, ఎలాంటి కేటాయింపులు చూపలేదు. ప్రణాళిక (రూ. 162.35 కోట్లు), ప్రణాళికేతర (రూ. 551.69 కోట్లు) పద్దుల కింద మొత్తం రూ. 714.04 కోట్లు కావాల్సిందిగా జీహెచ్‌ఎంసీ ప్రతిపాదనలు పంపగా.. మొత్తంగా రూ.29 కోట్ల కేటాయింపులు మాత్రమే చూపింది. ప్రణాళికేతర పద్దులకు అసలు కేటాయింపులే లేవు.
 
 ఆస్పత్రులకు అరకొర వడ్డింపు
 గ్రేటర్‌లోని ధర్మాసుపత్రులకు అరకొరగా వడ్డించింది. నిరుడు ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ కేటాయింపులనే ఈ బడ్జెట్‌లోనూ చూపించింది. నిమ్స్, ఉస్మానియా, ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రి, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రులు మినహా, మిగిలిన ఆస్పత్రుల ఊసే లేదు.
 
 హెచ్‌ఎండీఏకి నిధులు నిల్
 బడ్జెట్‌లో హెచ్‌ఎండీఏ ప్రతిపాదించిన కొత్త ప్రాజెక్టుల్లో నాన్ ప్లానింగ్ కింద ఒక్కటంటే ఒక్కదానికి కూడా నిధులు విదల్చలేదు. ఆన్‌గోయింగ్ ప్రాజెక్టులకు ఁజైకా* నుంచి తీసుకొన్న రుణాలనే నిధులుగా ప్లానింగ్ కింద బడ్జెట్‌లో చూపించారు. మూసీనదిపై బాపూఘాట్ వద్ద వంతెన నిర్మాణానికి రూ.50 లక్షలు మినహా మరే ఇతర నిధులు కేటాయించ లేదు. ప్రతిష్టాత్మకమైన ఔటర్‌రింగ్‌రోడ్డు, హుస్సేన్ సాగర్ ప్రక్షాళన, ఫ్లైఓవర్స్ ఇతర అభివృద్ధి పనులకు రుణ రూపంలో విదేశీ సాయం పొందేలా ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.1281.07కోట్లు కేటాయించింది. వాస్తవానికి గత ఏడాది బడ్జెట్‌లో ప్లానింగ్ కింద రూ.1281.07కోట్లు  కేటాయించిన సర్కార్.. ప్రస్తుత బడ్జెట్‌లో కూడా అంతే మొత్తాన్ని కేటాయించి చేతులు దులుపేసుకొంది.
 
 జలమండలికి నిరాశే
 బడ్జెట్ జలమండలికి నిరాశే మిగిల్చింది. గోదావరి మంచినీటి పథకం, కృష్ణా మూడోదశ, మూసీ ప్రక్షాళన రెండోదశ, శివారు మంచినీటి సరఫరా, మూసీ ప్రక్షాళన రెండోదశ, వసతుల కల్పన పథకాలకు అరకొర నిధులు విదిల్చి చేతులు దులుపుకుంది. మొత్తంగా వివిధ పథకాలకు సంబంధించి మొత్తంగా జలమండలి 579.48 కోట్ల మేర బడ్జెట్ ప్రతిపాదనలు పంపగా వీటిలో మొదటి త్రైమాసికం (ఫస్ట్ క్వార్టర్) కింద రూ.150 కోట్ల నిధులు మాత్రమే ఓట్‌ఆన్ అకౌంట్ బడ్జెట్‌లో బోర్డు ఖాతాకు జమ కానున్నట్లు జలమండలి ఫైనాన్స్ విభాగం అధికారులు తెలిపారు.
 
 మెట్రోకు రూ.500 కోట్లు..
 నగరంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టుకుబడ్జెట్‌లో రూ.500 కోట్లు కేటాయించనున్నట్లు ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. దీంతో మెట్రో పనులు ఊపందుకోనున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి నాగోల్-మెట్టుగూడా మార్గంలో మెట్రో మార్గాన్ని పూర్తిచేస్తామని బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించడం విశేషం. ఈ నిధులతో మెట్రో పనులు జరుగుతున్న ప్రాంతాల్లో ఆధునిక వసతులు కల్పించనున్నారు.
 
 ఎంఎంటీఎస్ రెండో దశకు రూ.25 కోట్లు

 రాష్ట్రప్రభుత్వం బడ్జెట్‌లో ఎంఎంటీఎస్ రెండో దశకు కేవలం రూ.25 కోట్లు కేటాయించింది. నిర్మాణ వ్యయంలో తన వాటా కింద 2/3 వంతు నిధులు చెల్లించవలసిన ప్రభుత్వం గత ఆర్ధిక సంవత్సరం రూ.60 కోట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించి రూ.30 కోట్లే ఇచ్చింది. ఈ ఆర్ధిక సంవత్సరం రూ.25 కోట్లు ప్రకటించింది. రైల్వేశాఖ నిరుడు రూ.30 కోట్ల నిధులను వెచ్చించింది. కేంద్ర,రాష్ట్రాల సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు నిర్మాణానికి  నిధుల లేమి వెంటాడుతోంది.
 
 ట్రాఫిక్‌కు ఈ ‘సారీ’...
  ప్రభుత్వం ట్రాఫిక్ విభాగానికి బడ్జెట్‌లో ప్రత్యేకించి కేటాయింపులు ప్రస్తావించకపోయినా... గత ఏడాది మాదిరే ఉంటుందని స్పష్టం చేసింది. ఈ లెక్కన వరుసగా మూడోసారి కూడా రూ.3.7 కోట్లు కేటాయించినట్లవుతుంది. 2013-14 సంవత్సరానికి సంబంధించి ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాల కింద హైదరాబాద్ కమిషనరేట్‌కు రూ. 425 కోట్లు, సైబరాబాద్‌కు రూ.235 కోట్లు కేటాయించారు. ఈసారీ కేటాయింపులు ఇలానే కొనసాగనున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement