భారీగా భూముల ధరలు | High land prices | Sakshi
Sakshi News home page

భారీగా భూముల ధరలు

Published Sun, Jan 12 2014 12:28 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

భారీగా భూముల ధరలు - Sakshi

భారీగా భూముల ధరలు

  •    భారీగా భూముల ధరలు
  •   స్వల్పంగా ప్రభుత్వ పరిహారం
  •   ససేమిరా అంటున్న రైతులు
  •   కోర్టును ఆశ్రయించిన ఇరుపక్షాలు
  •   తీర్పు కోసం ఎదురుచూపులు
  • విజయవాడ ఔటర్ రింగ్‌రోడ్డు భూసేకరణ వివాదం ఇంకా తొలగలేదు. రైతులు, ప్రభుత్వం ఎవరి వాదన వారు వినిపిస్తూ కోర్టును ఆశ్రయించారు. సమస్యలన్నీ పరిష్కరించి మూడు నెలల్లో పనులు ప్రారంభిస్తామని మరోపక్క అధికారులు చెబుతున్నారు. ఏదేమైనా రోడ్డు నిర్మాణం పూర్తయితే విజయవాడకు ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది.
     
    సాక్షి, విజయవాడ : విజయవాడ ఔటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్)కు భూసేకరణ అడ్డంకిగా మారింది. విజయవాడ, గుంటూరు జిల్లాల్లో భూముల ధరలు ఎక్కువగా ఉండటం, ప్రభుత్వం ఇస్తానంటున్న ధరలు చాలా తక్కువగా ఉండటంతో వివాదం మొదలైంది. దీంతో గుంటూరు జిల్లా వెంకటాపాలెం రైతులతో పాటు, కృష్ణాజిల్లాలోని గొల్లపూడి రైతులు కూడా కోర్టును ఆశ్రయించారు. ఇటీవల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు విజయవాడ వచ్చిన సందర్భంలో కూడా రైతులు ముఖ్యమంత్రిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు.

    ఈ విషయంపై దృష్టి పెట్టి రైతులకు న్యాయం చేయాలని ఆయన కలెక్టర్‌ను ఆదేశించారు. భూసేకరణ పూర్తయితే మూడు నెలల్లో పనులు ప్రారంభిస్తామని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు చెబుతున్నారు. కాంట్రాక్ట్ పొందిన గామన్ ఇండియా సంస్థకు, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులకు మధ్య ఈ వారంలో ఢిల్లీలో సమావేశం ఉంది. ఈ సమావేశంలో పనులు ఎప్పటినుంచి ప్రారంభమయ్యేదీ ఒక స్పష్టత వచ్చే అవకాశముంది. ఈ ప్రాజెక్టును బీఓటీ (బిల్ట్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్) పద్ధతిలో 30 నెలల్లో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
     
    భూసేకరణకు రూ.400 కోట్లు
     
    గుంటూరు జిల్లా చినకాకాని నుంచి పశ్చిమగోదావరి జిల్లా గుండుగొలను వరకు చేపడుతున్న విస్తరణకు భూసేకరణకే రూ.400 కోట్లు ఖర్చవుతుందని అధికారుల అంచనా. భూసేకరణకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, వాటన్నింటినీ త్వరలోనే పరిష్కరిస్తామని  రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. గతంలో భూసేకరణ అంశం ఎన్‌హెచ్‌ఏఐ పరిధిలో ఉన్నప్పుడు తామే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండేదని, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ అధికారుల చేతుల్లో పెట్టడంతో నిర్ణయంలో జాప్యం చోటుచేసుకుంటోందని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు చెబుతున్నారు.
     
    మరో వివాదం
     
    ఓ వైపు భూసేకరణ వివాదం ఇలా ఉంటే వంతెన కారణంగా తమ ప్రాంతమంతా మునిగిపోతుందని కృష్ణానది చుట్టూ ఉన్న లంకవాసులు ఆందోళన చెందుతున్నారు. వెంకటాపాలెం, గొల్లపూడి మధ్య 3.4 కిలోమీటర్ల మేర వంతెన వస్తుంది. దీనికోసం వేసే పిల్లర్ల కారణంగా పక్కనే ఉన్న లంకలు ముంపునకు గురవుతాయని, వాటిపై బతుకుతున్న బలహీనవర్గాలకు చెందిన 90 కుటుంబాలు రోడ్డున పడతాయని కొత్త వాదన తెరపైకి తెచ్చారు. వీరు కూడా కోర్టును ఆశ్రయించడానికి సన్నద్ధం అవుతున్నారు.
     
    టోల్ బాదుడే...
     
    రూ.1624 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టుకు అయ్యే డబ్బులు వసూలు చేసుకునేందుకు 103 కిలోమీటర్లకు గాను మూడు టోల్‌గేట్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. టోల్ ధర ఎంత అన్నది ఇంకా నిర్ణయించలేదు. గుంటూరు జిల్లా వెంకటాపాలెం, రాయనపాడు, కలపర్రు వద్ద టోల్‌ప్లాజాలు ఏర్పాటుచేసే అవకాశముంది. 2011లోనే ప్రాజెక్టు మొదలుకావాల్సి ఉన్నా భూసేకరణలో ఏర్పడిన ఇబ్బందులు, గామన్ ఇండియా సంస్థ తన వాటా డబ్బు సమకూర్చుకోవడంలో జరిగిన జాప్యం కారణంగా ఆలస్యమైంది.

    అయితే పాత ధరలతోనే పనులు చేయడానికి గామన్ ఇండియా సంస్థ అంగీకారం తెలిపింది. 103 కిలోమీటర్ల పొడవున గుంటూరు జిల్లా కాజ నుంచి పశ్చిమగోదావరి జిల్లా గుండుగొలను వరకు రోడ్డు విస్తరణ ప్రాజెక్టుగా చేపట్టనున్నారు. ఇందులో 48 కిలోమీటర్ల మేర అవుటర్ రింగ్‌రోడ్డు ఉండగా, ఏడు కిలోమీటర్లు హనుమాన్‌జంక్షన్ బైపాస్ ఉంది. మిగిలిన రోడ్డును ప్రస్తుతం ఉన్న నాలుగు లైన్ల నుంచి ఆరు లైన్లకు విస్తరిస్తారు. ఈ రోడ్డు పూర్తయితే విజయవాడకు ట్రాఫిక్ ఇక్కట్లు తగ్గుతాయి. అన్నీ సమకూరితే మూడు నెలల్లో పనులు ప్రారంభమవుతాయని చెబుతున్నారు.
     
     వివాదం ఎందుకంటే...
     ఆయా ప్రాంతాల్లోని భూముల ధరలకు, ప్రభుత్వం ఇస్తానంటున్న పరిహారానికి వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంది. దీంతో రైతులు భూములు ఇవ్వడానికి అంగీకరించడం లేదు.
     
     గుంటూరు జిల్లా వెంకటాపాలెం వద్ద ఎకరం ధర రూ.కోటి  పలికింది. ఇదే ధరతో రిజిస్ట్రేషన్లు కూడా జరిగాయి. మార్కెట్ రేటు పెంచాలని రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తులు పంపారు. ఇక్కడ వాస్తవ ధర అంతగా లేదని, రింగ్‌రోడ్డు వస్తుందన్న సాకు చూపి కావాలని రేట్లు పెంచేశారంటూ ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు రైతులకు వ్యతిరేకంగా కోర్టులో అఫిడవిట్లు దాఖలు చేశారు. దీనిపై కోర్టు తీర్పు వెలువరించాల్సి ఉంది.
     
     విజయవాడ రూరల్ మండలంలో కూడా గొల్లపూడి నుంచి జక్కంపూడి వరకు 20 ఎకరాలకు సంబంధించి భూసేకరణ వివాదంలో ఉంది. ఇక్కడ గజానికి రూ.3,500 చెల్లించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చినా రైతులు ఇంకా ఎక్కువ ధర చెల్లించాలని పట్టుబడుతున్నారు.
     
     హనుమాన్‌జంక్షన్ బైపాస్ విషయంలోనూ ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు, రైతుల మధ్య వివాదాలు నెలకొన్నాయి. పక్క జిల్లాలో ఎక్కువ ధర చెల్లిస్తూ ఇక్కడ నామమాత్రపు ధర చెల్లిస్తుండడంతో రైతులు కినుక వహిస్తున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement