‘చుక్కల’ రైతులకు ఊరట
Published Wed, Mar 29 2017 10:56 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
– అధారాలు చూపితే భూముల క్రమబద్ధీకరణ
– అసెంబ్లీకి చేరిన బిల్లు
కర్నూలు(అగ్రికల్చర్): చుక్కల భూములు కలిగిన రైతులకు ఊరటనిచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. చుక్కల భూముల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి శాసనసభలో బిల్లును ప్రవేశపెట్టారు. భూములకు సంబంధించి సర్వే నెంబరు వారిగా రీ సెటిల్‌మెంటు రిజిష్టర్( ఆర్‌ఎస్‌ఆర్) 1908లో రూపొందించారు. అప్పట్లో భూమికి పట్టాదారు ఉంటే సర్వే నెంబరు ఎదురుగా పట్టాదారు పేరు నమోదు చేశారు. లేకపోతే చుక్కలు పెట్టారు. చుక్కలకు ఎలాంటి నిర్వచనం లేదు. అయితే కాలక్రమంలో ఆర్‌ఆస్‌ఆర్‌లోని చుక్కల( డాట్Š ) భూములను రెవెన్యూ శాఖ ప్రభుత్వ భూములుగా గుర్తించింది.
ఇందులో భాగంగా స్టాంపుల రిజిస్ట్రేషన్‌ల శాఖ చట్టం సెక్షన్ 22(ఏ) కిందకు తీసుకవచ్చి భూముల క్రయవిక్రయాలను నిలిపివేసింది. గతంలో చుక్కల భూముల క్రయవిక్రయాలకు సంబంధించి సబ్ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్‌లు చేయడంతో 2009లో వీటిని ప్రభుత్వ భూములుగా పరిగణించి సెక్షన్ 22లో పెట్టారు. దీంతో ఈభూములను అమ్ముకోలేని, కొనలేని పరిస్థితి ఏర్పడింది. కర్నూలు జిల్లాలో చుక్కల భూములు 1,23,982 ఎకరాలు ఉన్నాయి. అత్యధికంగా కర్నూలు రెవెన్యూ డివిజన్‌లోనే 1,00,724 ఎకరాలు ఉన్నాయి. చుక్కల భూములు కలిగిన రైతులు 59,760 మంది ఉన్నారు. అన్ని జిల్లాలో ఇదే సమస్య నెలకొంది. దీంతో చుక్కల భూములను 12 ఏళ్లగా అనుభవిస్తున్నట్లు తగిన ఆధారాలు చూపితే క్రమబద్ధీకరించే దిశగా రెవెన్యూ మంత్రి బిల్లు ప్రవేశపెట్టారు. దీనిపై ప్రభుత్వం త్వరలో విధి విధానాలు ప్రకటించే అవకాశం ఉంది.
Advertisement