భూ బాధిత రైతుల ఆందోళన
భూ బాధిత రైతుల ఆందోళన
Published Mon, Nov 21 2016 9:15 PM | Last Updated on Mon, Oct 22 2018 8:26 PM
- కలెక్టర్ నియంతృత్వ ధోరణిని విడనాడాలంటూ నినాదాలు
- అదుపులోకి తీసుకున్న పోలీసులు
- 50 మందిపై కేసు నమోదు, రిమాండ్‌కు తరలింపు
ఓర్వకల్లు : శకునాల సోలార్ పరిశ్రమ కోసం తీసుకున్న భూములకు సంబంధించి పరిహారం చెల్లింపులో జరుగుతున్న అన్యాయానికి నిరసనగా బాధిత రైతులు సోమవారం సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. తమ భూములను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు గ్రామానికి చెందిన వందలాది రైతులు ట్రాక్టర్లు, కాడెద్దులతో వెళ్లారు. ఆ భూములను దున్నేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న పోలీసులు బందోబస్తును ముమ్మరం చేసి రైతులను అడ్డుకున్నారు. కర్నూలు తాలుకా రూరల్ సీఐ నాగరాజు యాదవ్ నేతృత్వంలో ఓర్వకల్లు, ఉల్లిందకొండ, నాగలాపురం, కర్నూలు ఎస్‌ఐలు చంద్రబాబు నాయుడు, వెంకటేశ్వరరావు, మల్లికార్జున, శ్రీనివాసులుతోపాటు సిబ్బంది, మహిళా పోలీసులు, స్పెషల్‌పార్టీ బృందం రైతులను అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా రైతులు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. సీపీఎం డివిజన్ కార్యదర్శి రామకృష్ణ, మండల నాయకులు నాగన్న, సోమన్న, భూ నిర్వాసిత కమిటీ అధ్యక్షులు చంద్రబాబును ముందుగా పోలీసులు జీపులోకి ఎక్కించారు. అనంతరం 20 మంది మహిళలు, 40 మంది పురుషులను వాహనాల్లో ఎక్కించి ఓర్వకల్లు, ఉల్లిందకొండ పోలీసు స్టేషన్లకు తరలించారు. వీరిలో సీపీఎం నేతలతో సహా మరో 50 మందిపై కేసులు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి సీఐ నాగరాజు యాదవ్ విలేకర్లతో మాట్లాడుతూ రెవెన్యూ రికార్డుల ఆధారంగా ప్రభుత్వం ఇప్పటి వరకు దాదాపు 150 మందికి పరిహారం పంపిణీ చేసినట్లు తెలిపారు. ఏ విధమైన ఆధారాలు లేని వారు కలెక్టర్‌తో సంప్రదించి సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. శాంతి భద్రత చర్యల్లో భాగంగానే రైతులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
Advertisement