భ్రమా..? బ్రహ్మా..? | funday cover story:Planets special | Sakshi
Sakshi News home page

భ్రమా..? బ్రహ్మా..?

Published Sun, Jul 15 2018 12:15 AM | Last Updated on Mon, Oct 22 2018 8:25 PM

funday cover story:Planets special - Sakshi

సమస్త చరాచర జగత్తంతా బ్రహ్మ సృష్టేనని అంటారు.మనం నివసిస్తున్న భూగోళమే మనకు తెలిసిన బ్రహ్మాండం.సృష్టిలో ఇదొక్కటే బ్రహ్మాండమా? మరో నాలుగువేల కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయా? విశాల విశ్వంలో ఎన్నో సౌర కుటుంబాలు ఉంటే అక్కడ మనలాంటి కుటుంబాలు ఉండవా? భూమిని మింగిన మానవుడు ఆ నింగినిమింగక మానేస్తాడా? మనకు తెలిసిన  సృష్టి మాత్రమేనా? మిగిలినదంతా మనిషి సృష్టేనా? ఎన్నో నిజాలను ఛేదించిన మానవుడు అన్నే అబద్ధాలనూఅల్లాడుగా! మన నింగి అవతల జీవం ఉందా? బ్రహ్మ సృష్టిలో అది కూడా ఒక మాయా? లేక అంతా మన భ్రమా?

మనం నివసించే భూమికి వెలుపల మరింకెక్కడైనా జీవం ఉందా..? ఉంటే, ఎక్కడ ఉంది? ఎలా ఉంది? జీవం ఉన్నత ఇతరేతర గ్రహాలకు వెళ్లి భూమ్మీది మనుషులు మనుగడ సాగించగలరా..? చాలాకాలంగా ఇవన్నీ అంతు చిక్కని ప్రశ్నలుగానే ఉన్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలను కనుగొనడానికి శతాబ్దాలుగా పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి. భూమికి వెలుపల గ్రహాలపై జీవానికి సంబంధించి ఇప్పటివరకు లభించినవల్లా చిన్నచిన్న ఆధారాలు మాత్రమే! సౌర కుటుంబానికి వెలుపల ఎక్కడో ఒకచోట గ్రహాంతరవాసులు ఉండవచ్చని, వారు మనకంటే తెలివైన వారై ఉంటారని సుప్రసిద్ధ శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌ అభిప్రాయపడ్డాడు. విశాల విశ్వంలో భూమిని పోలిన గ్రహాలు ఒకటి కాదు, రెండు కాదు కోటాను కోట్లుగా ఉన్నాయి. ‘కెప్లర్‌ స్పేస్‌ మిషన్‌’ 2013లో వెల్లడించిన నివేదిక ప్రకారం భూమిని పోలిన గ్రహాలు ఈ విశాల విశ్వంలో ఏకంగా 4 వేల కోట్ల వరకు ఉండవచ్చని అంచనా. ఇవన్నీ సూర్యుని వంటి నక్షత్రాల చుట్టూ తిరుగుతున్నాయి. భూమిని పోలిన ఈ గ్రహాలపై ఎక్కడో ఒక చోట జీవజాలం మనుగడ సాగిస్తూ ఉండవచ్చని శాస్త్రవేత్తల ఊహ. గ్రహాంతర జీవుల ఉనికిని ఆధునిక శాస్త్రవేత్తలెవరూ కొట్టిపారేయడం లేదు. భూమికి వెలుపల– ఇంకా చెప్పాలంటే మన సౌరకుటుంబానికి వెలుపల ఉన్న కొన్ని గ్రహాలపై జీవులు ఉండవచ్చని, ఆ జీవుల్లో మనుషులను పోలిన తెలివితేటలు గల జీవులు కూడా ఉండవచ్చని కూడా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అంత రిక్షంలో అక్కడక్కడా గుర్తుతెలియని ఎగిరే వస్తువులు (యూఎఫ్‌ఓ) కనిపించినా, గ్రహాంతర వాసులు భూమిపైకి లేదా కనీసం భూమి పరిసరాల్లోకి వచ్చారనేందుకు మాత్రం ఎలాంటి ఆధారాలూ లేవు.

అలుపెరుగని అన్వేషణ
భూమికి ఆవల జీవం కోసం శాస్త్రవేత్తలు అలుపెరుగని అన్వేషణ కొనసాగిస్తూనే ఉన్నారు. ఇటీవలి కాలంలో అంగారకునిపై జరిపిన అన్వేషణల్లో కొన్ని ఆశాజనకమైన ఫలితాలు లభించాయి. అంగారకుని ఉపరితలం నుంచి సేకరించిన మట్టిలోని మూలకాలు, అక్కడ వ్యాపించి ఉన్న వాయువుల నమూనాలు సూక్ష్మజీవుల మనుగడకు సానుకూలంగా ఉన్నట్లు ‘నాసా’ శాస్త్రవేత్తలు నిర్ధారించారు. భూమిపై రాలిపడ్డ గ్రహశకలాలను కూడా ‘నాసా’ శాస్త్రవేత్తలు నిశితంగా పరీక్షించారు. వీటి కణాల్లో జీవానికి కీలకమైన డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏ నిర్మాణాలను గుర్తించారు. దీని ఆధారంగా భూమ్మీద పడిన అంతరిక్ష ధూళి నుంచి ఇక్కడ జీవం ఆవిర్భవించి ఉండవచ్చని కూడా కొందరు శాస్త్రవేత్తలు ఒక అంచనాకు వచ్చారు. ‘నాసా’ శాస్త్రవేత్తలు 2011 నవంబర్‌లో ప్రయోగించిన ‘క్యూరియాసిటీ రోవర్‌’ 2012 ఆగస్టులో అంగారకుని ఉపరితలంపై ‘గేల్‌ కార్టర్‌’ ప్రాంతంలో దిగింది. అయితే, ఇది అంగారకునిపై జీవుల ఉనికిని మాత్రం కనుగొనలేకపోయింది. ఒకవైపు ‘నాసా’ తనవంతు ప్రయోగాలు, ప్రయత్నాలు కొనసాగిస్తుంటే, సౌరకుటుంబం వెలుపల ఉన్న గ్రహాలపై జీవం ఉనికి కనుగొనే లక్ష్యంతో 2014లో న్యూయార్క్‌లోని కార్నెల్‌ వర్సిటీలో కార్ల్‌ సాగన్‌ ఇన్‌స్టిట్యూట్‌ను స్థాపించారు. ఈ సంస్థ రెండు భారీ టెలిస్కోప్‌ల సాయంతో సౌర కుటుంబం వెలుపల ఉన్న గ్రహాలపై నెలకొన్న పరిస్థితులను తిలకించి, వాటిపై జీవం మనుగడకు ఉండే అవకాశాలపై పలు అంచనాలు వేసింది. ఇదిలా ఉంటే, భూమికి 400 కాంతి సంవత్సరాల దూరంలో సౌరమండలాన్ని తలపించే నక్షత్ర వ్యవస్థలో ‘గ్లైకోలాల్డిహైడ్‌’ అనే చక్కెర అణువుల ఉనికిని కోపెన్‌హాగెన్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. జీవకణాల నిర్మాణంలో కీలకమైన డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏల్లో కీలకమైనవి ఈ చక్కెర అణువులే కావడంతో అక్కడ జీవుల ఉనికి ఉండవచ్చనే అంచనాకు వచ్చారు.

భూమిలాంటి మరికొన్ని గ్రహాలు
సౌరకుటుంబానికి వెలుపల భూమిలాంటి గ్రహాల కోసం శాస్త్రవేత్తలు చిరకాలంగా అన్వేషణ సాగిస్తూ వస్తున్నారు. శక్తిమంతమైన టెలిస్కోప్‌ల సాయంతో అంతరిక్షాన్ని తరచి తరచి చూస్తూ వస్తున్నారు. ఈ ప్రయత్నాల్లో భాగంగా 1992 నుంచి ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు భూమిని సరిపోలిన 3,797 గ్రహాలను గుర్తించారు. అలాగే, సౌరకుటుంబం తరహా 632 బహుళ గ్రహ వ్యవస్థలను గుర్తించారు. ఈ గ్రహాలపై తగినంత పరిమాణంలో ఆక్సిజన్‌ ఉన్నట్లయితే, వాటిపై జీవం మనుగడకు ఆస్కారం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇంతకీ వాటిపై ఆక్సిజన్‌ ఎంత ఉందనేది మాత్రం వారు అంచనా వేయలేకపోతున్నారు. భూమిలాంటి గ్రహాలు మరికొన్ని ఉంటాయని, వాటిపై సాధారణ జీవజాలంతో పాటు మనుషులను పోలిన తెలివైన జీవులు కూడా ఉంటారని శతాబ్దాల నాటి నుంచి కొందరు తత్వవేత్తలు నమ్ముతూ వస్తున్నారు. ఫ్రెంచి తత్వవేత్త బెర్నార్డ్‌ లె బొవియర్‌ డి ఫాంటినెల్, ఇంగ్లిష్‌ వైద్యుడు, తత్వవేత్త జాన్‌ లాకె, ఫ్రెంచి ఖగోళవేత్త నికోలస్‌ కామిల్‌ ఫ్లెమారియన్‌ వంటి వారు సౌరకుటుంబానికి వెలుపల ఇదే తరహా గ్రహ వ్యవస్థలు ఉంటాయని, వాటిలోనూ భూమిలాంటి గ్రహాలు ఉంటాయని, ఆ గ్రహాలపై జీవజాలం ఉంటుందనే విశ్వాసాన్ని తమ రచనల్లో ప్రకటించారు. పద్దెనిమిదో శతాబ్దిలో యురేనస్‌ను కనుగొన్న విలియమ్‌ హెర్షెల్‌ సహా ఆయన సమకాలికులైన ఖగోళవేత్తలు పలువురు సౌరకుటుంబంలో గ్రహాంతరవాసులు ఉంటారని నమ్మేవారు. 

అద్భుతాలకు ఆలవాలం
అంతు చిక్కని అంతరిక్షం అంతులేని అద్భుతాలకు ఆలవాలం. ఆది నుంచి ఆకాశాన్ని చూసినప్పుడల్లా మానవుడు అబ్బురపడుతూనే ఉండేవాడు. పగటి వేళ తూర్పున ఉదయించే సూర్యుడు మధ్యాహ్నం నడినెత్తికి చేరుకుని, పశ్చిమాన అస్తమించడం, సూర్యుడు అస్తమించిన తర్వాత చీకటి అలముకున్నాక ఆకాశంలో మిణుకు మిణుకుమంటూ లెక్కించలేనన్ని నక్షత్రాలు, నక్షత్రాల సరసనే కనిపించే నెలవంక దినదినాభివృద్ధి చెంది, పున్నమి నాటికి నిండుగా కనువిందు చేయడం, అలాగే క్రమ క్రమంగా క్షీణించి అమావాస్య నాటికి అసలే కనిపించకుండా పోవడం వంటి క్రమం తప్పని దృశ్యాలు, కాలంతో మారే రుతువులు, అప్పుడప్పుడు వచ్చే గ్రహణాలు మనుషుల్లో ఆసక్తిని రేకెత్తించాయి. కొందరు ఆలోచనాపరులు వీటి కారణాలను అన్వేషించడం ప్రారంభించారు. అంతరిక్ష అద్భుతాలపై అన్వేషణ క్రీస్తుపూర్వం నాలుగు వేల ఏళ్ల నాడే మొదలైంది. 

గ్రహణాలను లెక్కించడమే తొలి పురోగతి
అంతరిక్ష పరిశీలనతో గ్రహణాలను కచ్చితంగా లెక్కించడమే ఖగోళ శాస్త్రంలోని తొలి పురోగతి. క్రీస్తుపూర్వం నాలుగువేల ఏళ్ల కిందట చైనా జ్యోతిషులు ఈ ఘనతను సాధించారు. క్రీస్తుపూర్వం 2698–2598 మధ్య కాలంలో హ్వాంగ్‌ టే అనే చైనా చక్రవర్తి అబ్జర్వేటరీని నిర్మించాడు. అప్పటి వారికి సూర్య చంద్రులతో పాటు బుధ, శుక్ర, అంగారక, గురు, శని గ్రహాల గురించి తెలుసు. క్రీస్తుపూర్వం 2449లో సంభవించిన పంచగ్రహ కూటమిని వారు రికార్డు చేశారు. ప్రాచీన ఖగోళ శాస్త్రానికి ఆద్యులు బాబిలోనియా ప్రాంతానికి చెందిన కాల్డియన్లు, ఈజిప్షియన్లు అని గ్రీకు చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. కాల్డియన్లు పెద్ద పెద్ద సిద్ధాంతాలను ప్రతిపాదించకపోయినా, శతాబ్దాల తరబడి ఆకాశాన్ని నిశితంగా పరిశీలించి కొన్ని కీలకమైన విషయాలను కనుగొన్నారు. భూమి తనలో తాను తిరిగే వేగం ఆధారంగా ప్రతి 18 సంవత్సరాల 11 రోజుల వ్యవధిలో 235 చాంద్రమాసాలు వస్తాయి. ఈ వ్యవధిలో ఏర్పడిన గ్రహణాలను గుర్తు పెట్టుకుని, మళ్లీ వచ్చే 235 చాంద్రమాసాలలో అవే గ్రహణాలు పునరావృతం అవుతాయని కనిపెట్టారు. కాల్డియన్లు రికార్డు చేసిన గ్రహణ సమయాలలో తేడాను డాక్టర్‌ జె.కె.ఫాదరింగ్‌ హామ్‌ అనే ఆధునిక శాస్త్రవేత్త సవరించాడు. భూమి తన చుట్టూ తాను తిరిగే వేగంలోని సూక్ష్మమైన తగ్గుదల, ఫలితంగా రోజు కాల పరిమితిలో ఏర్పడ్డ పెరుగుదలను గుర్తించి, ఆయన గ్రహణ సమయాలను మరింత నిక్కచ్చిగా సూచించాడు. 

వేదాలలో ఖగోళ విజ్ఞానం
ప్రపంచంలో ప్రాచీన నాగరికతలు విలసిల్లిన కాలంలోనే భారతదేశంలో వేదాలు ఉనికిలో ఉన్నాయి. వేదాలు ఏ కాలానికి చెందినవనే విషయమై కచ్చితమైన ఆధారాలు లేవు. అయితే, మన వేదాలలో ఖగోళ విజ్ఞానానికి సంబంధించిన అనేక శ్లోకాలు ఉన్నాయి. ముఖ్యంగా రుగ్వేదంలో రాశిచక్ర వర్ణన ఉంది. ‘‘పన్నెండు ఆకులు గల కాలచక్రం గగనంలో తిరుగుతోంది. ఆ చక్రం మీద 720 మిథునాలు ఉన్నాయి.’’ అనే వర్ణన రుగ్వేద శ్లోకాల్లో ఉంది. భగవద్గీతలో విశ్వరూపాన్ని వర్ణించే శ్లోకాలు ఉన్నాయి. ఆది మధ్యాంతాలు లేని భూ గగన దిగంతరమంతా విశ్వరూపంలో సాక్షాత్కరిస్తుందని, సమస్త చరాచర ప్రపంచం దానిలో ఏకకాలంలో కనిపిస్తుందని వర్ణించాడు గీతకారుడు. మరే దేశపు ప్రాచీన సాహిత్యంలోనూ అనంత విశ్వం గురించి ఇలాంటి కవితాత్మక వర్ణన కనిపించదు. భారతీయ ఖగోళ విజ్ఞానానికి మూలగ్రంథం ‘సూర్య సిద్ధాంతం’. ఇది పూర్తిగా దొరకలేదు. శిథిలమైన లిఖిత ప్రతులు మాత్రమే దొరికాయి. దీని కర్త ఎవరో, రచనా కాలమేదో తెలియదు. సూర్యుడు మయుడికి ఉపదేశించిన సిద్ధాంతమే ఈ గ్రంథం అని సంప్రదాయవాదులు భావిస్తారు. ‘సూర్యసిద్ధాంతం’ గ్రంథంలో దొరికిన భాగాలలోని విషయాల ప్రకారం భూమి వ్యాసం 1600 యోజనాలు. యోజనం అంటే 4.9 మైళ్లు. ఈ లెక్కన ‘సూర్యసిద్ధాంతం’ ప్రకారం భూమి వ్యాసం 7,849 మైళ్లు. ఇది నేటి లెక్కకు దాదాపు దగ్గరగానే ఉంది. ఆధునిక పరిశోధనల ప్రకారం భూమధ్యరేఖ వద్ద భూమి వ్యాసం 7,917, 5 మైళ్లు. భూమి నుంచి చంద్రునికి గల దూరం 51,566 యోజనాలుగా (2.53 లక్షల మైళ్లు) లెక్కగట్టింది ‘సూర్యసిద్ధాంతం’. ఇది కూడా ఆధునిక లెక్కలకు దగ్గరగానే ఉంది. ఆధునిక పరిశోధనల ప్రకారం ఈ దూరం 2,38,900 మైళ్లు. ‘సూర్యసిద్ధాంతం’ రచించిన నాటికి టెలిస్కోప్‌ వంటి పరికరాలేవీ అందుబాటులో లేవు. ఏ పద్ధతిలో ఈ లెక్కలను గుణించారో కూడా తెలియదు. ‘సూర్యసిద్ధాంతం’ తర్వాత భారతదేశం నుంచి వెలుగులోకి వచ్చిన గొప్ప ఖగోళ శాస్త్ర గ్రంథం ‘ఆర్యభట్టీయం’. దీనిని క్రీస్తుశకం 476 ప్రాంతానికి చెందిన ఆర్యభట్టు రచించాడు. కాలాన్ని లెక్కించేందుకు జలగడియారం, ఛత్రయంత్రం వంటి పరికరాలను కనుగొన్నాడు. భూభ్రమణ వేగాన్ని, రోజు వ్యవధిని, గ్రహణ కాలాలను నిర్దుష్టంగా లెక్కగట్టాడు. గ్రహణాలు ఛాయల ప్రభావం వల్ల ఏర్పడతాయని తేల్చిచెప్పాడు. ఆర్యభట్టు తర్వాత మొదటి భాస్కరాచార్యుడు, వరాహ మిహిరుడు, రెండవ భాస్కరాచార్యుడు ఖగోళ, గణిత, జ్యోతిష శాస్త్రాల్లో గణనీయమైన కృషి చేశారు.

కోపర్నికస్‌ కంటే ముందే...
సూర్యుని చుట్టూ భూమి తిరుగుతున్నదని ప్రపంచానికి ముందుగా చెప్పిన శాస్త్రవేత్త కోపర్నికస్‌ అనే చాలామంది నమ్ముతారు. నిజానికి ఈ విషయాన్ని క్రీస్తుపూర్వం మూడో శతాబ్దికి చెందిన గ్రీకు శాస్త్రవేత్త అరిస్టార్కస్‌ లోకానికి వెల్లడించాడు. భూమి నుంచి సూర్య చంద్రుల దూరాలను లెక్కించడానికి అతడు చాలా ప్రయత్నాలు చేశాడు. అరిస్టార్కస్‌ సమకాలీనులు, అతడి తర్వాత ప్రాచుర్యంలోకి వచ్చిన శాస్త్రవేత్తలు అతడి సిద్ధాంతాన్ని కొట్టిపారేశారు. ప్రాచీన గ్రీకు ఖగోళ చరిత్రలో చిట్టచివరి ప్రసిద్ధుడైన టాలెమీ భూ కేంద్ర సిద్ధాంతాన్ని పునరుద్ధరించాడు. విశ్వానికి భూమి కేంద్రంగా ఉందనే వాదాన్ని బలంగా వినిపించాడు. దాంతో అరిస్టార్కస్‌ సిద్ధాంతం పూర్తిగా మరుగునపడింది.  నవీనయుగ ప్రారంభంలో క్రీస్తుశకం పదిహేనో శతాబ్దికి చెందిన పోలిష్‌ శాస్త్రవేత్త కోపర్నికస్‌ భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నదనే వాదాన్ని పునరుద్ధరించాడు. కోపర్నికస్‌ సిద్ధాంతంతో ఖగోళశాస్త్రంలో పురోగమనం మొదలైంది. కోపర్నికస్‌కు శతాబ్దం తర్వాతి వాడైన గెలీలియో టెలిస్కోప్‌ను కనుగొనడంతో ఖగోళ శాస్త్ర పురోగమనం మరింతగా ఊపందుకుంది. గెలీలియో కనుగొన్న టెలిస్కోప్‌ సాయంతో నాటి శాస్త్రవేత్తలు శుక్ర గ్రహం గమనాన్ని, గురుగ్రహం చుట్టూ తిరిగే ఉపగ్రహాలను భౌతికంగా చూడగలిగారు.

అంతరిక్షంలోనూ వ్యాపారం
గ్రహాంతర జీవుల ఉనికి గురించి కచ్చితమైన ఆధారాలు లేకపోయినా, కొందరు తెలివైన మనుషులు అంతరిక్షంలోనూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం సాగిస్తున్నారు. వ్యాపారం అంతరిక్షానికి సంబంధించినదే అయినా వారి లావాదేవీలు సాగేది మాత్రం ఈ భూమ్మీదనే.  చంద్రుడి మీద మనిషి కాలు మోపిన తర్వాత అతితెలివి వ్యాపారులకు కొంచెం ఆత్మవిశ్వాసం పెరిగి, ఏకంగా చంద్రుడిపై స్థలాలను ఎడాపెడా అమ్మడం మొదలుపెట్టారు. భూమికి వెలుపల ఉండే గ్రహాలపై ఉన్న స్థలాలను ప్రైవేటు వ్యక్తులు సొంతం చేసుకోజాలరంటూ 1979లో ఐక్యరాజ్య సమితి చొరవతో ‘ఇంటర్నేషనల్‌ మూన్‌ ట్రీటీ’ అమలులోకి వచ్చినా, చాలా దేశాలు దానికి ఆమోదం తెలపలేదు. ఇదే అదనుగా కొందరు చంద్రునిపై స్థలాల అమ్మకాలను ప్రారంభించారు. ఇప్పుడైతే వ్యవహారమంతా ఆన్‌లైన్‌లోనే సాగిస్తున్నారు. చంద్రుడిపై ఎకరా స్థలాన్ని 30 డాలర్లకే (రూ.2,067) విక్రయిస్తూ, భలే మంచి చౌకబేరము... అనే రీతిలో ఊరిస్తున్నారు. భూమ్మీద ఎడారి ప్రదేశాల్లో సైతం ఇంత చౌకగా స్థలాలు దొరికే వీలు లేకపోవడంతో కొందరు ఎందుకైనా పనికొస్తుందనే ఉద్దేశంతో చంద్రునిపై స్థలాలను సొంతం చేసుకుంటున్నారు.

అంతరిక్షంలోని గ్రహాంతర స్థలాలను సొంతం చేసుకోవాలన్న ఆలోచన ఈనాటిది కాదు. జగజ్జేతగా చరిత్రకెక్కిన గ్రీకు వీరుడు అలెగ్జాండర్‌ కూడా అంతరిక్షాన్ని సొంతం చేసుకోవాలని తలచాడు. పద్దెనిమిదో శతాబ్దికి చెందిన ప్రష్యా రాజు ఫ్రెడెరిక్‌ తన జబ్బును నయం చేసిన జుర్గెన్‌ అనే వైద్యుడికి చంద్రుడిని రాసిచ్చేశాడు. జుర్గెన్‌ వారసుల్లో ఒకరు చంద్రుడిపై వారసత్వ హక్కుల కోసం 1996లో కోర్టుకెక్కడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అక్కడక్కడా కొందరు విచిత్రమైన వ్యక్తులు చంద్రుడిపైనే కాదు, ఇతరేతర గ్రహాలపై హక్కులు తమవేనంటూ కోర్టులకెక్కిన ఉదంతాలు చాలానే ఉన్నాయి. ఇలాంటి తలతిక్క మనుషుల వల్ల సీరియస్‌గా అంతరిక్ష పరిశోధనలు సాగిస్తున్న శాస్త్రవేత్తలకు, పరిశోధన సంస్థలకు కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ‘నాసా’ అంగారకుడిపైకి ‘క్యూరియాసిటీ రోవర్‌’ పంపడంతో, యెమెన్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు ‘నాసా’పై కేసు వేశారు. అంగారక గ్రహం మూడువేల ఏళ్ల కిందటే పూర్వీకుల నుంచి తమ వంశానికి సంక్రమించిందని, తమ అనుమతి లేకుండా ‘నాసా’ అంగారక గ్రహంపై చొరబాటుకు తెగబడిందని, అందువల్ల ‘నాసా’ తమకు పరిహారం చెల్లించాల్సిందేనంటూ వాదించారు. ఈ కేసు వల్ల ‘నాసా’కు, కోర్టుకు కాలహరణం తప్ప ఒరిగిందేమీ లేదు. అంతరిక్షంపై హక్కుల కోసం మనుషులు నానా తంటాలు పడుతుండటం ఒక ఎత్తయితే, సమీప భవిష్యత్తులోనే మనుషులు గ్రహాంతర వాసులను కలుసుకోగలుగుతారని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత శతాబ్ది ముగిసేలోగానే మనుషులు గ్రహాంతర జీవులను భౌతికంగా కలుసుకోగలరని, వారితో సంభాషణలు నెరపగలరని అమెరికన్‌ భౌతిక శాస్త్రవేత్త మిచియో కకు చెబుతున్నారు. ఒకవేళ ఆయన అంచనా ఫలిస్తే, ఇప్పటి తరం వాళ్లు విదేశీయానాలు చేస్తున్నంత తేలికగా మన తర్వాతి తరాల వాళ్లు గ్రహాంతర యానాలు చేయగలరేమో!                       ·

అంతరిక్ష అన్వేషణలో కొన్ని మైలురాళ్లు
1610    గెలీలియో టెలిస్కోప్‌ కనుగొన్నాడు. టెలిస్కోప్‌ సాయంతో గురు గ్రహం చుట్టూ తిరిగే ఉపగ్రహాలను, శుక్ర గ్రహ గమనాన్ని గుర్తించాడు.
1840    టెలిస్కోప్‌ సాయంతో చంద్రుని ఫొటోను స్పష్టంగా తీయగలిగారు.
1865    జూల్స్‌ వెర్న్‌ రాసిన ‘ఫ్రమ్‌ ది ఎర్త్‌ టు ది మూన్‌’ నవల ప్రచురితమైంది. ఇది తర్వాతి కాలంలో అంతరిక్ష పరిశోధనలకు ఎంతగానో దోహదపడింది.
1924    రష్యాలో గ్రహాంతర యానాల సంఘం స్థాపన.
1946    అంతరిక్షం నుంచి భూగోళం ఫొటోలను తీయగలిగారు.
1947    తొలిసారిగా ప్రాణులను (ఈగలు) అంతరిక్షంలోకి పంపారు.
1951    తొలిసారిగా రెండు జాగిలాలను అంతరిక్షంలోకి పంపారు.
1961    తొలిసారిగా మానవుడు అంతరిక్షంలోకి వెళ్లాడు. ఈ ఘనత సాధించినది రష్యన్‌ వ్యోమగామి యూరీ గగారిన్‌.
1969    తొలిసారిగా మానవుడు చంద్రునిపై అడుగు మోపాడు. ఈ ఘనత అమెరికన్‌ వ్యోమగామి నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌కు దక్కింది.
1971    అంతరిక్షంలో తొలి పరిశోధన కేంద్రాన్ని (శాల్యూట్‌–1) రష్యా ఏర్పాటు చేసింది. 
1990    ‘నాసా’ తొలిసారిగా మొత్తం సౌర కుటుంబాన్ని ఫొటో తీయగలిగింది.
2011    ‘నాసా’ తొలిసారిగా అంగారకునిపైకి ‘క్యూరియాసిటీ రోవర్‌’ను విజయవంతంగా పంపింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement