ఫ్లోరైడ్‌ భూతం వీడట్లే! | Fluoride Effect Expands In Telangana State | Sakshi
Sakshi News home page

ఫ్లోరైడ్‌ భూతం వీడట్లే!

Published Wed, Feb 24 2021 3:54 AM | Last Updated on Wed, Feb 24 2021 3:54 AM

Fluoride Effect Expands In Telangana State - Sakshi

ఫ్లోరైడ్‌ అనగానే మనకు గుర్తుకు వచ్చేది ఉమ్మడి నల్లగొండ జిల్లా. కాళ్లు, చేతులు వంకర్లు తిరిగిపోయిన అభాగ్యులు కళ్ల ముందు మెదులుతారు. వారికది తరతరాల పీడ. ఈ ఫ్లోరైడ్‌ భూతం ఇతర జిల్లాల్లోనూ విస్తరిస్తున్నట్లు భూగర్భ జల విభాగం 2019లో జరిపిన అధ్యయనంలో తేలింది. సంగారెడ్డి, రంగారెడ్డి, జగిత్యాల, ఆసిఫాబాద్, వరంగల్‌ అర్బన్‌ జిల్లాల్లోనూ కొన్నిచోట్ల భూగర్భ జలాల్లో అనుమతించదగ్గ పరిమితికి మించి ఫ్లోరైడ్‌ ఉన్నట్లు గుర్తించారు. అయితే 2018లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో... 2019 వేసవిలో జనం తాగునీటి కోసం చేతిబోర్ల వైపు మళ్లడంతో... తాము పరిశీలించిన శాంపిల్స్‌లో ఫ్లోరైడ్‌ శాతం అధికంగా కనబడినట్లు తేల్చారు. 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రాన్ని ఫ్లోరైడ్‌ భూతం ఇంకా వీడట్లేదు. భూ ఉపరితల నీటి వినియోగం పెరిగి, భూగర్భ జలాలపై ఒత్తిడి తగ్గించినా... ఫ్లోరైడ్‌ మాత్రం ఎప్పట్లాగే తిష్టవేసుకొని కూర్చుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు మనకు తెలిసిన ఒక్క ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే ఫ్లోరైడ్‌ విస్తరించి ఉందనుకుంటే అది ఇతర జిల్లాల్లోనూ కొన్నిచోట్ల వేగంగా విస్తరిస్తున్నట్లు భూగర్భ జల విభాగం జరిపిన అధ్యయనంలో తేలింది.

తగ్గింది చాలా తక్కువే
భూగర్భ జల విభాగం ప్రతి ఏటా వర్షాలకు ముందు ఒకమారు, వర్షాల అనంతరం మరో మారు రాష్ట్రంలోని భూగర్భ జల పరిస్థితులపై అధ్యయనం చేస్తుంది. అందులో భాగంగా 2019లో వర్షాలకు ముందున్న పరిస్థితి, తర్వాతి పరిస్థి తులపై అధ్యయనం చేసింది. ఈ నివేదిక పరిశీ లనలను తాజాగా విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 7,318 నీటి నమూనాలను సేకరించి వాటిపై పరిశోధన జరిపింది. ఈ మొత్తం శాంపిల్స్‌లో ఫ్లోరైడ్‌ అధికంగా ఉన్న శాంపిల్స్‌ 1,118 వరకు ఉన్నట్లు తేల్చింది.

వాస్తవానికి నీటిలో 1 నుంచి 1.5 మిల్లీగ్రామ్‌/లీటర్‌ వరకు ఫ్లోరైడ్‌ ఉంటే దాన్ని అనుమతించదగ్గ పరిమితిగా పరిగణిస్తారు. అంతుకు మించితే మాత్రం ప్రమాదమే. ప్రస్తుతం పరిశీలించిన శాంపిల్స్‌లో నల్లగొండే కాకుండా సంగారెడ్డి, రంగారెడ్డి, జగి త్యాల, యాదాద్రి, ఆసిఫాబాద్, వరంగల్‌ అర్బన్‌ జిల్లాల్లో ఫ్లోరైడ్‌ ఉన్నట్లుగా తేలింది. 2018లో వర్షాభావ పరిస్థితి నెలకొనడంతో 2019 వేసవిలో భూగర్భ జలాలు అడుగంటిపోవడం, జలాశయా ల్లోనూ తగినంత నీరు లేక సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడటం, నీరు అందుబాటులో లేక ప్రజలు చేతిబోర్ల వైపు మళ్లడంతో ఫ్లోరైడ్‌ శాతం అధికంగా కనిపించినట్లు అధ్యయనం వెల్లడిం చింది.

రాష్ట్రవ్యాప్తంగా భూవిస్తీర్ణంలో వర్షాలకు ముందు 15% విస్తీర్ణంలో 1.5 మిల్లీగ్రామ్‌/లీటర్‌ కన్నా అధికంగా ఫ్లోరైడ్‌ కనిపించగా, వర్షాల అనంతరం అది 11 శాతం విస్తీర్ణానికి తగ్గినట్లు నివేదిక పేర్కొంది. 2014–2019 వరకు గమనిస్తే ఫ్లోరైడ్‌ శాతం కేవలం 0.046 మిల్లీగ్రామ్‌/లీటర్‌ తగ్గినట్లు వెల్లడించింది. ఈ ఆరేళ్లలో భూగర్భ జలాలు సగటున 0.42 మీటర్‌/ ఇయర్, వర్షపాతం 58 మిల్లీమీటర్‌/ ఇయర్‌ పెరగడంతో కొద్దిమేరైనా ఫ్లోరైడ్‌ శాతం తగ్గినట్లు తెలిపింది. 

ముప్పు ఎక్కడెలా ఉందంటే...
నల్లగొండ జిల్లా అనుములలో వర్షాలకు ముందు 5.39 మి.గ్రా/లీ, వర్షాల తర్వాత 3.40 మి.గ్రా/లీ నమోదవగా, పెద్దవూర మండలం వెలమగూడ, డిండి మండలం వావిల్‌కోల్,, నల్లగొండ మండలం నార్సింగ్‌ భట్ల, ఎం.దోమపల్లి, పి.దోమలపల్లి, మును గోడు, చండూరు మండలం నర్మెట్ల, అంగడి పేట, కట్టంగూర్‌ మండలం పామన గుండ్ల, మర్రి గూడ మండలం శివన్నగూడెం, కుదాభక్షు పల్లి, అంతంపేట, నామాపూర్, నిడమనూర్‌ మండలం వెంకన్నగూడెం, దామరచర్ల మండలం అడవిదేవులపల్లి, మునుగోడు మండలం కాల్వలపల్లి, నార్కట్‌పల్లి మండలం ఔరవాణిలలో ఎక్కువగా ఫ్లోరైడ్‌ ఉంది. 

వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో వర్షాలకు ముందు పరిశీలించిన 150 శాంపిల్స్‌లో ఫ్లోరైడ్‌ సగటు 2.10మిల్లీగ్రామ్‌/లీటర్‌ ఉండగా, అది వర్షాల అనంతరం సగటున 1.3 వరకు ఉంది. అత్యధి కంగా ఎల్కతుర్తి మండల పరిధిలో వర్షాలకు ముందు 8.51, వర్షాల అనంతరం 8.02 మి.గ్రా/లీ ఫ్లోరైడ్‌ నమోదు కావడం గమనార్హం. ఖిల్లా వరంగల్‌ మండలం తిమ్మాపూర్‌లో వర్షాల అనంతరం సైతం 6.83 మి.గ్రా/లీటర్‌ ఫ్లోరైడ్‌ కనబడింది. ఐనవోలు మండలం పాటిని, సింగారం, కమలాపూర్‌ మండలం శనిగరం, హసన్‌పర్తి మండలం దేవన్నపేట, కోమటిపల్లి, ధర్మసాగర్‌ మండలం ఉనికి చర్లలలో ఫ్లోరైడ్‌ అధికంగా ఉన్నట్లు తేల్చారు. 

రంగారెడ్డి జిల్లాలో వర్షాలకు ముందు సగటు 1.53 మి.గ్రా/లీ ఉండగా, వర్షాల అనంతరం 1.10మి.గ్రా/లీ ఉంది. అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం బాటసింగారంలో వర్షాలకు ముందు ఏకంగా 5.09మి.గ్రా/లీ ఫ్లోరైడ్‌ ఉండగా, మహేశ్వరం మండలం పొందియాల, మంచాల మండలం బోడకొండ, కందుకూరు మండలం గుమ్మడివెల్లిలో అధికంగా ఫ్లోరైడ్‌ ఉంది.

సంగారెడ్డి జిల్లాలో రాయ్‌కోడ్‌ మండల పరిధిలోని చిన్నాపూర్‌లో అధికంగా 4.41 మి.గ్రా/లీ వర్షాలకు ముందు ఉండగా, వర్షాల అనంతరం సైతం 3 మి.గ్రా/లీ ఫ్లోరైడ్‌ కనబడింది. ఇదే జిల్లాలో పుల్కల్‌ మండలం సింగూరు, బండ్లగూడ, కోహీర్‌లలో ఫ్లోరైడ్‌ అధికంగానే నమోదైంది.

జగిత్యాల జిల్లాలో కొడిమ్యాల మండలంలోని చెప్యాలలో 3.54 మి.గ్రా/లీ వరకు ఉండగా, మేడిపల్లి మండలం రంగాపూర్, మల్లాపూర్‌ మండలంలోని సాతారం, ఓబ్లాపూర్, ఇంద్రా నగర్, గుండంపల్లె, ధర్మపురి మండలంలోని బుద్ధేశ్‌పల్లి, గొల్లపల్లి మండలాల పరిధిలో అధికంగా ఫోరైడ్‌ ఉన్నట్లు గుర్తించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement