భూగర్భ జలమట్టం.. అందినంత దూరం | Huge increase of the groundwater with abundant rainfall | Sakshi
Sakshi News home page

భూగర్భ జలమట్టం.. అందినంత దూరం

Published Sun, Feb 23 2020 4:07 AM | Last Updated on Sun, Feb 23 2020 4:07 AM

Huge increase of the groundwater with abundant rainfall - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నెలకు సగటున 0.45 మీటర్ల మేర భూగర్భ జలాలను తోడేస్తున్నారు. రోజుకు సగటున 0.015 మీటర్ల చొప్పున భూగర్భ జలాలను ఉపయోగిస్తున్నట్లు స్పష్టమవుతోంది. సమృద్ధిగా వర్షాలు కురవడం, నదులు ఉప్పొంగడంతో గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈసారి రాష్ట్రంలో భూగర్భ జలమట్టం 5.58 మీటర్ల మేర పెరిగింది. పుష్కలంగా భూగర్భ జలాలు లభ్యమవుతుండటంతో రైతులు బోర్లు.. బావుల కింద ఖరీఫ్‌లో రికార్డు స్థాయిలో 23.68 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేశారు. నీటి లభ్యత లేని ప్రాంతాల్లో భూగర్భ జలాల వినియోగం అధికంగా ఉంది.  

11.79 మీటర్లకు..  
ప్రస్తుత సీజన్‌లో వర్షాకాలం ప్రారంభం కాకముందు అంటే 2019 మేలో రాష్ట్రంలో భూగర్భ జలమట్టం సగటు 16.19 మీటర్లుగా ఉండేది. వర్షాకాలం దాదాపు ముగిశాక.. అంటే 2019 డిసెంబర్‌ 15 నాటికి భూగర్భ జలమట్టం సగటు 10.61 మీటర్లకు పెరిగింది. సగటున 5.58 మీటర్ల మేర పెరిగినట్లు స్పష్టమవుతోంది. వర్షాకాలం ముగియడం, తాగు, సాగునీటి అవసరాలకు తోడేస్తుండటంతో ప్రస్తుతం భూగర్భ జలమట్టం సగటున 11.79 మీటర్లకు చేరుకుంది.  

20 శాతం ప్రాంతాల్లో 3 మీటర్ల లోపే..  
భూగర్భ జల వనరుల విభాగం రాష్ట్రంలో 661 గ్రామీణ మండలాలు, 9 అర్బన్‌ మండలాల్లోని 1,261 ప్రాంతాల్లో ఫిజియో మీటర్లను ఏర్పాటు చేసింది. భూగర్భ జలమట్టాలను ఎప్పటికప్పుడు లెక్కిస్తోంది.  
- భూగర్భ జల వనరుల శాఖ అధ్యయనం ప్రకారం కోస్తాలో భూగర్భ జలాలు భారీగా పెరిగాయి. 9 తీర ప్రాంత జిల్లాల్లో సగటున 9.72 మీటర్లలో భూగర్భ జలాలు లభ్యమవుతున్నాయి. రాయలసీమ జిల్లాల్లో సగటున 16.44 మీటర్లలో భూగర్భ జలాలు దొరుకుతున్నాయి.  
- కనిష్టంగా శ్రీకాకుళం జిల్లాలో సగటు భూగర్భ జలమట్టం 4.91 మీటర్లు ఉండగా.. గరిష్టంగా చిత్తూరు జిల్లాలో 20.64 మీటర్లుగా నమోదైంది.  
రాష్ట్రంలో 20.20 శాతం ప్రాంతాల్లో భూగర్భ జలాలు సగటున 3 మీటర్లలోపే లభ్యమవుతున్నాయి. 33.80 శాతం ప్రాంతాల్లో 3 నుంచి 8 మీటర్లలోపు లోతులో లభిస్తున్నాయి. 46 శాతం ప్రాంతాల్లో 8 మీటర్ల కంటే ఎక్కువ లోతులో దొరుకుతున్నాయి.  

17.59 లక్షల బోరు బావుల కింద పంటల సాగు  
భూగర్భ జలమట్టం పెరగడంతో ఎండిపోయిన బోరు బావులు రీఛార్జి అయ్యాయి. బోరు బావుల్లో పుష్కలంగా నీళ్లు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలో 17,59,584 బోరు బావుల కింద ఖరీఫ్‌లో రైతులు 23,68,439 ఎకరాల్లో పంటలు సాగు చేశారు. రాష్ట్రంలో అక్టోబర్‌లో భూగర్భ జలమట్టం సగటున 10.98 మీటర్లు ఉండేది. బోరు బావుల కింద భారీగా పంటలు సాగు చేసి భూగర్భ జలాలను తోడేస్తున్నా.. నవంబర్, డిసెంబర్‌లలో కురిసిన వర్షాలకు భూగర్భ జలమట్టం 10.61 మీటర్లకు పెరిగింది. రబీలో ఇప్పటిదాకా 53,57,854.47 ఎకరాల్లో పంటలు సాగుచేయగా.. ఇందులో 19 లక్షల ఎకరాలు బోర్లు, బావుల కింద సాగుచేసిన పంటలే. బోరు బావుల కింద సాగవుతున్న పండ్ల తోటల విస్తీర్ణం అదనం. పంటల సాగుకు, తాగునీటి అవసరాలకు తోడేస్తుండటంతో ప్రస్తుతం భూగర్భ జలమట్టం 11.79 మీటర్లకు చేరుకుంది. జనవరి 18 నాటికి భూగర్భ జలమట్టం 11.34 మీటర్లు ఉండేది. అంటే నెల రోజుల్లో 0.45 మీటర్ల మేర భూగర్భ జలాలను వినియోగించుకున్నట్లు తేటతెల్లమవుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement