భూగర్భజలం పుష్కలం | Groundwater levels have increased this year | Sakshi
Sakshi News home page

భూగర్భజలం పుష్కలం

Published Thu, Dec 26 2024 5:56 AM | Last Updated on Thu, Dec 26 2024 5:56 AM

Groundwater levels have increased this year

గత ఐదేళ్ల తరహాలోనే ఈ ఏడాదీ పెరిగిన భూగర్భ జలమట్టం

నీటి సంవత్సరం ప్రారంభానికి ముందు సగటున 11.79 మీటర్లలో జలాలు

ప్రస్తుతం రాష్ట్రంలో సగటున 7.6 మీటర్లలో లభ్యత

భూగర్భ జలాలు పెరిగిన జిల్లాల్లో ప్రథమ స్థానంలో శ్రీసత్యసాయి జిల్లా

చివరి స్థానంలో అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత ఐదేళ్ల తరహాలోనే ఈ ఏడాదీ భూగర్భ జలాల లభ్యత పెరిగింది. ప్రస్తుత నీటి సంవత్సరంలో భూగర్భ జలమట్టం 4.19 మీటర్లు పెరిగింది. భూగర్భ జలమట్టం పెరిగిన జిల్లాల్లో శ్రీసత్యసాయి జిల్లా (12.69 మీటర్లు) మొదటి స్థానంలో ఉండగా, రెండో స్థానంలో ప్రకాశం జిల్లా (8.52 మీటర్లు), మూడో స్థానంలో పల్నాడు జిల్లా (7.97 మీటర్లు) ఉన్నాయి.

 అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా(1.16 మీటర్లు), శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా (1.31 మీటర్లు), పార్వతీపురం మన్యం జిల్లా(1.52 మీటర్లు)లో అత్యల్పంగా పెరిగాయి. 26 జిల్లాల్లో భూగర్భ జలాలు పుష్కలంగా పెరగడంతో బోరు బావుల కింద రబీలో పంట సాగుకు, వేసవిలో తాగు నీటికి ఇబ్బందులు ఉండవని అధికారవర్గాలు చెబుతున్నాయి.  

సగటున 7.6 మీటర్లలో భూగర్భ జలాల లభ్యత 
నీటి సంవత్సరం జూన్‌ 1తో ప్రారంభమై.. మే 31తో ముగుస్తుంది. గత నీటి సంవత్సరం ముగిసేటప్పటికి అంటే 2024 మే 31కి రాష్ట్రంలో భూగర్భ జలాలు 11.79 మీటర్లలో లభ్యమయ్యేవి. గత ఐదేళ్ల తరహాలోనే ఈ ఏడాదీ నైరుతి, ఈశాన్య రుతుపవనాల ప్రభావం వల్ల సమృద్ధిగా వర్షాలు కురిశాయి. 

రాష్ట్రంలో ఈ ఏడాది ఇప్పటికి 858 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా ఇప్పటిదాకా 950.57 మిల్లీమీటర్లు కురిసింది. అంటే సాధారణ వర్షపాతం కంటే 10.79 శాతం ఎక్కువ. దాంతో భూగర్భ జలాలు పెరిగాయి. ప్రస్తుతం భూగర్భ జలమట్టం సగటున 7.6 మీటర్లకు చేరుకుంది. అంటే.. ప్రస్తుత నీటి సంవత్సరంలో ఇప్పటికే 4.19 మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయి.

బాపట్ల జిల్లా గరిష్టం.. తూర్పు గోదావరిలో కనిష్టం 
భూగర్భ జలాల లభ్యతలో బాపట్ల జిల్లా (2.63 మీటర్లతో) ప్రథమ స్థానంలో ఉంది. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా (2.64 మీటర్లు) రెండో స్థానంలో, గుంటూరు జిల్లా (3.39 మీటర్లు) మూడో స్థానంలో నిలిచాయి. భూగర్భ జలాల లభ్యత కనిష్టంగా ఉన్న జిల్లాల్లో తూర్పుగోదావరి జిల్లా (21.66 మీటర్లతో) ప్రథమ స్థానంలో నిలవగా.. ఏలూరు జిల్లా(17.59 మీటర్లు) రెండో స్థానంలో, అన్నమయ్య జిల్లా(13.67 మీటర్లు) మూడో స్థానంలో నిలిచింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement