కరీంనగర్ హెల్త్ : ప్రభుత్వ శాఖలను కదిలిస్తే... తమ దగ్గర డబ్బులే లేవు.. ఏం చేయాలో అర్థం కావడం లేదనే సమాధానం సాధారణమే. కానీ, పుష్కలంగా డబ్బులుండీ.... యంత్రాలు సమకూర్చుకున్న తరువాత కూడా వాటిని వాడకుండా పడేయడం ఎక్కడైనా చూశామా? వైద్య ఆరోగ్యశాఖలో ఇది మామూలే. గ్రామీణ ప్రాంత మహిళలు, విద్యార్థినులు రుతుస్రావం సమయంలో సరైన అవగాహన లేకపోవడం వల్ల రోగాల బారిన పడుతున్నారని... వారికి న్యాప్‌కిన్స్ అందిస్తే ఆయా రోగాలు రాకుండా అరికట్టవచ్చనే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన చర్యలు జిల్లాలో వృథా అయ్యాయి.
ప్రతినెలా మహిళలు, యుక్తవయసు బాలికలకు ఉచితంగా న్యాప్‌కిన్స్ పంపిణీ చేయాలనే లక్ష్యంతో రెండేళ్ల క్రితం(2013 మే 6న) జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌ఎం) నిధుల ద్వారా జిల్లాకు రూ.3,99,920 విడుదల చేసింది. ఈ నిధులతో న్యాప్‌కిన్ యంత్రాలు, ముడిసరుకు తెప్పించింది. జిల్లాలోని కరీంనగర్, గంగాధర, సిరిసిల్ల, కోరుట్ల ప్రాంతాల్లో ఆయా యంత్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఇంతవరకు బాగానే ఉన్నా... ఉన్నతాధికారుల నిర్లక్ష్యం... సిబ్బంది అవగాహన లోపంతో ఆ యంత్రాలు ఎందుకూ పనికిరాకుండా పోయాయి. ప్రభుత్వ నిధులు బూడిదలో పోసిన పన్నీరయ్యూరుు. ఫలితంగా ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు.
ప్రజలకు అందని మిషన్ లక్ష్యం
గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన, భద్రతపై అవగాహన పెంపొందించేందుకు 2005లో కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్‌ను ప్రారంభించింది. శిశు, యుక్త వయసు బాలికలు, మహిళల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత కల్పించింది. రుతుస్రావ సమయంలో అవగాహన లేక సరైన జాగ్రత్తలు పాటించక వ్యాధుల బారిన పడుతున్నారని గుర్తించిన వైద్యశాఖ పరిష్కారానికి చర్యలు చేపట్టింది. గ్రామీణ ప్రాంత మహిళలకు స్థానిక అంగన్‌వాడీ, బాలికల వసతిగృహాలు, ఆస్పత్రుల ద్వారా శానిటరీ న్యాప్‌కిన్ పంపిణీ చేయాలని సంకల్పించింది. వీటి తయారీకి అవసరమైన నిధులు మంజూరు చేసింది.
తయారీకి కావాల్సిన యంత్రాలు, ఉపయోగించే ముడిసరుకు వంటివి తెప్పించారు. వాటిని తయారు చేయడానికి స్వయం సహాయక సంఘాలకు బాధ్యతలు అప్పగించి వారికి శిక్షణ ఇప్పించేందుకు చర్యలు చేపట్టారు. మిషన్ పనితీరు, తయూరీపై యంత్రాల కంపెనీ ప్రతినిధితో శిక్షణ ఇప్పించారు. ఇదే సమయంలో ఈ యంత్రాలతో తయారు చేసిన న్యాప్‌కిన్‌లు నాణ్యత ఉండవని, వీటి తయారీకి కొనుగోలు కంటే ఖర్చు ఎక్కువే అవుతుందని తెలుసుకున్న అధికారులు వాటిని ఏర్పాటు చేయకుండానే మూలన పడేశారు. ప్రస్తుతం ఆ యంత్రాలు గంగాధరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో భద్రపర్చినట్లు అధికారులు తెలుపుతున్నారు.
ఆధునిక యంత్రాలపై దృష్టి
లక్షల రూపాయలు ఖర్చు చేసి కొనుగోలు చేసిన న్యాప్‌కిన్ తయారీ యంత్రాలు మూలనపడి ఉండటంపై ప్రజాప్రతినిధులు పాలకమండలి సమావేశాల్లో ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేయకపోవడంతో మహిళలకు ఆరోగ్య సమస్యలు ఎక్కువయ్యే అవకాశాలున్నాయని... సమస్య పరిష్కారంపై వైద్య ఆరోగ్యశాఖ దృష్టిసారించాలని కోరుతున్నారు. కొత్త యంత్రాల ఏర్పాటుకు కావాల్సిన నిధులు మంజూరు చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలపడటంతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు అధికారుల ద్వారా తెలిసింది.
కాలపరిమితి దాటిపోయింది
న్యాప్‌కిన్స్ తయారు చేసే మిషన్ పూర్తిగా కాలపరిమితి దాటిపోవడంతో వాడటం లేదు. ఈ మిషన్‌తో ఎక్కువ ఖర్చుతోపాటు తయారు చేయడానికి చాలా సమయం పడుతుంది. అధునాతన ఆటోమెటిక్ మిషన్‌ను తెప్పించేందుకు ప్రతిపాదనలు తయారుచేశారు. దీనికి రూ.2.5 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ ప్రాజెక్టు గురించి ఎంపీ వినోద్‌కుమార్ వివరాలు అడిగారు. త్వరలోనే ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు చర్యలు చేపడతాం
- ఎండీ అలీమ్,డీఎంహెచ్‌వో
సర్కారీ సొమ్ము నీళ్లపాలు !
Published Sat, Jun 20 2015 4:42 AM | Last Updated on Tue, Oct 9 2018 7:11 PM
Advertisement
Advertisement