బాస్ తమ్ముళ్ల బరితెగింపు!
అధికారంలో ఉన్నాం.. ‘బాస్’ అండగా ఉండగా మనకు అడ్డేముందని భావించారు టీడీపీ నేతలైన అన్నాదమ్ములు. అలా అనుకున్నదే తడవుగా లేని చెట్లను ఉన్నట్లు చూపించి పరిహారం పొందాలనుకున్నారు. టేకు కర్రలను తీసుకొచ్చి గుంతలు తీసి పాతారు. ఎక్కడో ఉన్న కొన్ని టేకు మొక్కలను పీక్కొచ్చి వీటి మధ్య కనిపించేలా ఉంచారు. ఇంకేముంది.. అధికారులు సైతం అవును అక్కడ చెట్లు ఉన్నాయంటూ ధ్రువీకరించారు. త్వరలో నష్టపరిహారం అందుకోనున్నారు.
అట్లూరు : మండలంలోని చౌటపల్లి గ్రామానికి చెందిన అన్నదమ్ములైన ఇద్దరు టీడీపీ నేతలు ప్రభుత్వ సొమ్ము రూ.కోటి కాజేసేందుకు వ్యూహం పన్నారు. వీరికి ముత్తుకూరు రెవెన్యూ పొలంలో సర్వే నెంబరు 43-1, 43-1బి, 43-1ఎఫ్‌లో రెండు ఎకరాలు పొలం ఉంది. ఈ పొలం సోమశిల ప్రాజెక్టు కింద ముంపునకు గురికానుంది. ఆ పొలంలో చీనీ చెట్లతో పాటు సుమారు 800కు పైగా టేకు చెట్లు ఉన్నట్లు రెండేళ్ల క్రితం భూసేకరణ అధికారులతో రాయించుకున్నారు. దానిని ఫారెస్టు అధికారులు ధ్రువీకరిస్తేనే పరిహారం వస్తుందని తెలుసుకుని అప్పటి సిద్దవటం ఫారెస్టు సెక్షన్ అధికారిణిని ఆశ్రయించారు.
అదే సమయంలో ఆ పొలంలో టేకు చెట్లు లేవని కొంత మంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. టేకు చెట్లు లేవని బట్టబయలు కావడంతో అప్పట్లో పొలంతో పాటు చీనీ చెట్లకు నష్టపరిహారం తీసుకున్నారు. ఈ క్రమంలో ఏడాది క్రితం టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఇదే అవకాశంగా భావించి తమ పొలంలో టేకు చెట్లు ఉన్నాయని, వాటికి అప్పట్లో రేట్లు వేయలేదని తిరిగి ఫైల్ కదిలించారు. అధికార బలంతో అధికారులను దారికి తెచ్చుకుని పరిహారం కొట్టేయడానికి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఇతర రైతుల పొలాల్లో కొట్టేసిన టేకు చెట్లు, కొమ్మలను ట్రాక్టర్లలో తెచ్చి పొలంలో గుంతలు తీసి పాతారు. వీటికి ఫారెస్టు అధికారులతో రేట్లు కూడా వేయిస్తున్నారు.
ఇక త్వరలో పరిహారం పొందడమే తరువాయి. ఈ తరుణంలో ఇలా నాటిన చెట్లలో కొన్ని కర్రలు కూడా ఉండటంతో బండారం మరోసారి బయటపడింది. విషయం తెలియగానే ‘సాక్షి’ మంగళవారం అక్కడకు వెళ్లింది. ఆ కర్రలను ఫొటో తీస్తుండగా ‘తమ్ముడు’ అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ‘గతంలో టేకు చెట్లు ఉండేవి. నీళ్లొచ్చి పోయినాయి. ఇపుడు కొమ్మలు తెచ్చి నాటుకున్నాం. ఇందులో తప్పేం ఉంది అంటూ సమర్థించునే యత్నం చేశారు. అధికారం ఉంది కదా అని ఇంతగా బరితెగించి ప్రభుత్వ సొమ్మును కాజేయడానికి పన్నాగం పన్నడంపై జనం విస్తుపోతున్నారు.