టీడీపీ నేతల దూషణ పర్వాలపై అధికారుల సీరియస్
► అటవీశాఖ ఉన్నాతాధికారుల ఆగ్రహం
► తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయం
ఏలూరు: రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ఒక్క పశ్చిమగోదావరి జిల్లాలోనే అటవీశాఖ అధికారులు, ఉద్యోగులపై దాడులు, దూషణ పర్వాలు చోటుచేసుకోవడాన్ని ఆ శాఖ ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నట్టు తెలుస్తోంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాలో లెక్కలేనన్నిసార్లు అటవీశాఖ ఉద్యోగులు ఆ పార్టీ నేతల ఆగ్రహానికి గురయ్యారు. ఆ శాఖ అధికారులైతే నాలుగైదుసార్లు దారుణ పరాభవం చవిచూశారు.
గతేడాది ఫిబ్రవరిలో టి.నరసాపురం మండలం కొత్తగూడెం అటవీ భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా బోరు వేయడాన్ని అడ్డుకున్నందుకు అటవీ శాఖలో ఆగ్రహంఆ ప్రాంత అటవీ అధికారికి టీడీపీ నేతలు చుక్కలు చూపించారు. ఫారెస్ట్ అధికారితోపాటు ఆయన సహాయకుడిని చితకబాదేశారు. ఆనక తెల్లకాగితంపై సంతకం పెట్టించుకుని ‘నీ సంగతి ఇక్కడ కాదు. ఊళ్లోనే తేలుస్తా..’ అంటూ గ్రామంలోకి తీసుకువెళ్లి అందరి ముందు పంచాయతీ పెట్టారు. దీంతో బెంబేలెత్తిపోయిన సదరు అధికారి ‘బాబోయ్ నేనిక్కడ ఉద్యోగం చేయను. ఇక్కడి నుంచి బదిలీ చేయించండి’ అని కన్నీటి పర్యంతమై ఆ నేతలనే ప్రాధేయపడిన వైనం ఏడాది కిందట జిల్లాలో అటవీశాఖ అధికారుల దుస్థితిని తెలియజేసింది. ఉన్నతాధికారులకు విషయం తెలిసినా ఏమీ చేయలేక మిన్నకుండిపోయారు.
అభద్రతా భావంతో కొల్లేరు అధికారులు కొల్లేరు అభయారణ్యం పరిధిలో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులైతే ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళనతోనే రెండేళ్లుగా బిక్కుబిక్కుమంటూ పనిచేస్తున్నారు. అభయారణ్యం పరిధిలో ఎటువంటి రోడ్డు నిర్మాణాలు చేపట్టకూడదని నిబంధనలు ఉండగా.. ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో గతేడాది నవంబర్‌లో ఆటపాక పక్షుల దొడ్డిగట్టుపై రోడ్డు నిర్మాణాన్ని స్థానికులు రాత్రికి రాత్రే పూర్తి చేశారు. అడ్డుకోవాల్సిన అధికారులు చింతమనేనికి భయపడి ఏమీచేయలేక తమపై దాడి జరగడం వల్లే రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకోలేకపోయామని చెప్పుకొచ్చారు.
‘కావాలంటే నేను కొట్టినట్టు కేసు పెట్టుకోండి. రోడ్డు నిర్మాణానికి అడ్డురాకండి’ అని చింతమనేని స్పష్టం చేయడంతో ఉన్నతాధికారుల వద్ద తమ ‘స్కిన్’ కాపాడుకునేందుకు అటవీ అధికారులు అప్పట్లో దాడి ‘డ్రామా’ను రక్తికట్టించారన్న వాదనలు ఉన్నాయి. ఆ మేరకు పోలీస్ కేసు పెట్టినా ఇప్పటికీ అతీగతీ లేదంటేనే ఆ ఘటన వెనుక వాస్తవం ఏంజరిగిందనేది అర్థం చేసుకోవచ్చు. ఇలా అటవీశాఖ అధికారులు భయపడుతూ పనిచేస్తున్న పరిస్థితుల్లోనే ఏలూరు ఇన్‌చార్జ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (డీఎఫ్‌వో) పి.శివశంకర్‌రెడ్డి రెండురోజుల క్రితం అదే చింతమనేనితో తెగించి మాట్లాడటం అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది. జిరాయితీ భూముల్లో చేపల పట్టుబడి కుదరదంటూ శివశంకర్‌రెడ్డి స్పష్టం చేయగా, చింతమనేని ఆగ్రహం వ్యక్తం చేసి సెలవులో వెళ్లిపోవాల్సిందిగా సూచించడం తెలిసిందే. శివశంకర్‌రెడ్డి కూడా సెలవులోకి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నా ఉన్నతాధికారులు మాత్రం ఇందుకు అనుమతి ఇవ్వలేదని తెలిసింది. ఇలా సెలవులోకి పంపేస్తే .. మరో అధికారి వచ్చి పనిచేసే పరిస్థితి ఉండదని ఉన్నతాధికారులు భావిస్తున్నట్టు సమాచారం.
ఏడాదిన్నరగా ఇన్‌చార్జిల పాలనే
ఇప్పటికే ఏలూరు డివిజన్‌లో పనిచేసేందుకు అటవీశాఖ అధికారులెవరూ ముందుకురాని పరిస్థితి నెలకొంది. టీడీపీ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత రెండేళ్లకాలంలో ఇప్పటివరకు ఆరుగురు అధికారులు మారారు. ఇందులో ఐదుగురు ఇన్‌చార్జిలుగా వ్యవహరించిన వారే. శివశంకర్‌రెడ్డి కూడా రెండు నెలల కిందటే ఇన్‌చార్జి బాధ్యతలు స్వీకరించారు. తాజా వివాదం నేపథ్యంలో ఆయన శనివారం సాయంత్రం నుంచే సెలవులోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే టీడీపీ నేతల ఒత్తిళ్లతో సెలువులు మంజూరు చేస్తే పరిస్థితి మరీ చేయిదాటిపోతుందని భావించిన ఉన్నతాధికారులు ఆయన సెలవుకు మంజూరు చేయలేదని అంటున్నారు. అటవీశాఖ మంత్రితోపాటు ప్రభుత్వ పెద్దల దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లి శాశ్వత పరిష్కారం దిశగా ఉన్నతాధికారులు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది.