ప్రొద్దుటూరు టౌన్, న్యూస్‌లైన్: మెగా దగాతో ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రూ.28కోట్లతో చేపట్టిన పైపులైన్ పనులు నాసిరకంగా ఉండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. 2009లో యూఐడీఎస్‌ఎస్‌ఎంటీ పథకం కింద పట్టణంలో 99 కిలోమీటర్ల పైపులైన్‌తోపాటు ఆరు నీటి ఉపరితల ట్యాంక్‌ల నిర్మాణానికి మెగా సంస్థ పనులను దక్కించుకుంది. పైపులైన్ పనులను లెవెల్స్ లేకుండా చేయడంతోపాటు జాయింట్ వర్కులు నాసిరకంగా చేయడంతో ఒత్తిడికి తట్టుకోలేక ఎక్కడికక్కడ పైపులు తెగిపోతున్నాయి. దీంతో మంచినీరు వృధాగా పోతోంది. 2011కు పనులు పూర్తి చేసి మున్సిపాలిటీకి పూర్తి స్థాయిలో అప్పగించాల్సి ఉండగా ఇప్పటి వరకు అటువంటి దాఖలాలు కానరావడం లేదు. బిల్లులేమో 80శాతానికిపైగా తీసుకున్న మెగా సంస్థ పనుల్లో నాణ్యత చూపించకపోవడంతో తాగునీటి సరఫరాలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఎప్పుడు పగిలిపోతాయో తెలియని పరిస్థితుల్లో ప్రతి రోజు ఏదో ఒక ప్రాంతంలో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతునే ఉంది. పనులను పర్యవేక్షించాల్సిన పబ్లిక్ హెల్త్ శాఖ నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తోంది. ఒక్కో జాయింట్ వర్క్ చేయడానికి మున్సిపల్ ఫిట్టర్లు, వర్కర్లు ఒకటి నుంచి రెండు రోజుల వరకు శ్రమించాల్సి వస్తోంది. పలు ప్రాంతాల్లో ఉన్న సమస్యలన్నింటినీ పక్కనపెట్టి కేవలం జాయింట్ పనులకే సబ్బంది సమయమంతా సరిపోతోంది.
ఒక్క ట్యాంక్‌కు కూడా అందని నీరు
రూ. కోట్ల ప్రజా ధనాన్ని వెచ్చించి తాగునీటి అవసరాలను తీర్చేందుకు నిర్మించిన మోడంపల్లె, బొల్లవరం, అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్, సంజీవయ్యనగర్‌లోని ఎస్సీ హాస్టల్ సముదాయంలో నిర్మించిన వాటర్ ట్యాంక్‌లతోపాటు ఆర్ట్స్ కాలేజిలో నిర్మించిన ఏ ఒక్క ట్యాంక్‌కు ఇప్పటి వరకు మెగా పైపులైన్ ద్వారా నీటిని అందించలేదు. దీంతో ప్రజలు తీవ్రంగా నీటి ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు.
మున్సిపల్ కమిషనర్‌తో పాటు వాటర్‌వర్క్స్ అధికారులు మెగా పైపులైన్ పనుల్లో జరిగిన నాణ్యత లోపాలపై పనులను పర్యవేక్షిస్తున్న ఎస్‌ఈ మోహన్ దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినప్పటికీ పట్టించుకున్న దాఖలాలు లేవు. పట్టణంలోని మోడంపల్లె, టీబీ రోడ్డు, రాజీవ్ సర్కిల్, త్రీటౌన్ సర్కిల్, ప్రకాష్‌నగర్, బొల్లవరం తదితర ప్రాంతాల్లో ప్రతి రోజు మెగా పైపులైన్ పగిలిపోతూనే ఉంది. నాలుగు రోజుల క్రితం రాజీవ్ సర్కిల్, ఎద్దుల వెంకటసుబ్బమ్మ పాఠశాల ముందు పైపులైన్ పగిలిపోవడంతో దాదాపు రూ.20వేలు ఖర్చు చేసి పనులు చేపట్టిన అధికారులకు శ్రమ వృధా అయింది. తిరిగి గురువారం పైపులైన్ జాయింట్లు ఒత్తిడికి తట్టుకోలేక పగిలిపోయాయి.
నేడు ఈఎన్‌సీ రాక
ప్రజల దాహార్తిని శాశ్వత ప్రాతిపదికన తీర్చేందుకు శుక్రవారం హైదరాబాద్ నుంచి ఈఎన్‌సీ చంద్రశేఖర్ ప్రొద్దుటూరుకు రానున్నారు. గత నెలలో కేంద్ర ప్రభుత్వం నుంచి మున్సిపాలిటీకి రూ.158 కోట్లు విడుదలయ్యాయి. చెన్నమరాజుపల్లె గ్రామం వద్ద ఉన్న కుందూ నది నుంచి ప్రొద్దుటూరు రామేశ్వరంలోని వాటర్ సంపు వద్దకు పైపులైన్ ద్వారా నీటిని తీసుకురానున్నారు. అలాగే చెన్నమరాజుపల్లె వద్ద 250 ఎకరాల భూమిని సమ్మర్ స్టోరేజి ట్యాంక్ నిర్మాణానికి సేకరించనున్నారు. ఈఎన్‌సీ ప్రొద్దుటూరుకు వచ్చి వీటన్నింటినీ పరిశీలించనున్నారు.
మెగా..దగా
Published Fri, Oct 18 2013 3:01 AM | Last Updated on Fri, Sep 1 2017 11:44 PM
Advertisement
Advertisement