ఊరూరూ తిరిగి చీరలమ్మి పైసా..పైసా.. కూడబెట్టిన రూ.లక్ష.. వాటితో పాటు బంగారు నగలు, విలువైన చీరలు.. ఇంటి సామగ్రి.. కళ్లెదుటే అగ్నికి ఆహుతయ్యాయి.
ప్రొద్దుటూరు క్రైం, న్యూస్‌లైన్: ఊరూరూ తిరిగి చీరలమ్మి పైసా..పైసా.. కూడబెట్టిన రూ.లక్ష.. వాటితో పాటు బంగారు నగలు, విలువైన చీరలు.. ఇంటి సామగ్రి.. కళ్లెదుటే అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాదవశాత్తు సంభవించిన అగ్ని ప్రమాదంలో ఇలా వారి కష్టార్జితమంతా బూడిదకాగా, వాటిని చూసి బాధితులు గుండెలుబాదుకున్నారు. ఈ సంఘటన ప్రొద్దుటూరు రామేశ్వరంలో శుక్రవారం జరిగింది.
రామేశ్వరానికి చెందిన తిరుమలమ్మ కుమార్తె అమ్ములు, అల్లుడు సుబ్రమణ్యంతో కలసి నివసిస్తోంది. తిరుమలమ్మ చీరలమ్మితే, అల్లుడు వంట మాస్టరుగా వెళ్లేవాడు. అలా వారు జీవనం సాగిస్తున్నారు. దురదృష్టవశాత్తు సంభవించిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో వారి గుడిసె మంటల్లో చిక్కుకుంది. దీంతో బాధితులు గట్టిగా కేకలు వేయగా ఇరుగుపొరుగు వారు వచ్చి మంటలను ఆర్పేందుకు విశ్వప్రయత్నం చేశారు. అయితే మంటలు అదుపుకాకపోవడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
వారొచ్చి మంటలను అదుపు చేశారు. మంటలను అదుపు చేయగానే స్థానికులు ఇంట్లోకి వెళ్లి బీరువా తెరిచారు. అందులో కాలిపోతున్న నోట్ల కట్టలను బయటికి తీసుకువచ్చారు. అప్పటికే బూడిదగా మారిన నోట్లను చూసి తిరుమలమ్మ, ఆమె కుమార్తె గుండెలవిసేలా రోదించారు. చీరలతో పాటు రెండు తులాల బంగారు, వెండి వస్తువులు మంటల ధాటికి కరిగిపోయాయి. బాధితులు కట్టుబట్టలతో నిరాశ్రయులయ్యారు. సంఘటనలో రూ.3 లక్షల మేర ఆస్తినష్టం సంభవించినట్లు అంచనా. విషయం తెలిసిన వెంటనే వైఎస్‌ఆర్ సీపీ నాయకుడు బంగారురెడ్డి బాధితులను పరామర్శించి ఓదార్చారు. తనవంతుగా రూ.10 వేల ఆర్థికసాయం చేశారు.