సబ్‘ప్లాన్’ లేదు!
ప్రొద్దుటూరు: జిల్లాలో ఎస్సీ,ఎస్టీ విద్యుత్ సబ్‌ప్లాన్ పథకం వల్ల అర్హులైన వారికి ఏమాత్రం ప్రయోజనం కలగడం లేదు. ఈ పథకం అమలై ఏడాది దాటినా ఇంత వరకు ఒక్కరికి కూడా పథకం వర్తించలేదు. దీంతో జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన నిరుపేదలు తీవ్రంగా నష్టపోతున్నారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బాబుజగ్జీవన్‌రామ్ జయంతి రోజైన గత ఏడాది ఏప్రిల్ 5వ తేదీన ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌లో భాగంగా ఇందిరమ్మ కలలు పథకానికి శ్రీకారం చుట్టారు.
ఇందులో భాగంగా 50 యూనిట్లలోపు గృహ విద్యుత్ ఉచితం, రూ.268కోట్ల గృహ విద్యుత్ బకాయిల రద్దు, ఇందిరమ్మ గృహ నిర్మాణ సహాయం రూ.1.05లక్షలకు పెంపు, భూమి కొనుగోలు వ్యయం రూ.5లక్షలకు పెంపు, విదేశాల్లో ఉన్నత విద్యకు అయ్యే ఖర్చు రూ.10లక్షలు పెంచుతూ వరాలను ప్రకటించారు. అయితే ఈ పథకం నిధులుండి కూడా నీరుగారిపోయింది.
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణం
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ పథకం అమలుకు నోచుకోలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనల ప్రకారం 50 యూనిట్లలోపు విద్యుత్ వాడకందారులకు అధికారులు ఈ విషయాన్ని తెలియజేయాల్సి ఉంది. అయితే విద్యుత్ అధికారులు మాత్రం 50 యూనిట్లలోపు విద్యుత్ వాడకందారులు కుల ధ్రువీకరణ పత్రాలు తమకు సమర్పించాలని పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు. లబ్ధిదారుల్లో ఎక్కువ మంది చదువులేనివారు కావడంతో ఈ విషయం వారికి తెలియలేదు. లబ్ధిదారులు కులధ్రువీకరణ పత్రాలు ఇచ్చిన తర్వాత విచారణ చేసి విద్యుత్ అధికారులు ఉన్నతాధికారులకు నివేదిక పంపాల్సి ఉంది. అయితే ఇంత వరకు జిల్లాలో లబ్ధిదారుల వివరాల సేకరణే జరగలేదని తెలుస్తోంది. దీంతో ఇప్పుడిప్పుడే ఈపథకం అమలయ్యే పరిస్థితి కనిపించడం లేదు.
కుల ధ్రువీకరణ పత్రాలు
సమర్పించాల్సి ఉంది
ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులు ఆయా ప్రాంతాల్లోని తమ అధికారులకు కుల ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంది. దీంతో జాప్యం అవుతోంది. వారి నుంచి వచ్చిన నివేదికను అప్‌లోడ్ చేసి సాంఘిక సంక్షేమ శాఖ ఉన్నతాధికారులకు పంపితే నిధులు విడుదల అవుతాయి.
- గంగయ్య, ఎస్‌ఈ, జిల్లా ట్రాన్స్‌కో
మాకు వివరాలు సమర్పించలేదు
విద్యుత్ అధికారుల నుంచి మాకు లబ్ధిదారుల వివరాలు అందాల్సి ఉంది. ఆ నివేదికను మేము ఉన్నతాధికారులకు పంపితే నిధులు మంజూరవుతాయి. మొదట్లో నిధులు వచ్చి వెనక్కి వెళ్లాయి.
- పీఎస్‌ఏ ప్రసాద్, జాయింట్ డెరైక్టర్,
జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ
కులధ్రువీకరణ పత్రాలు
సమర్పించాలని తెలియదు
కరెంటు ఉచితంగా పొందాలంటే కులధ్రువీకరణ పత్రం పొందాలని మాకు ఎవ్వరూ చెప్పలేదు. రుణ మాఫీ పత్రాన్ని మాత్రం ఇచ్చారు. పథకం ఎప్పుడు అమలవుతుందో ఏమో. మా లాంటి పేదలు కూడా డబ్బు కట్టాలా.
- టి.జయమ్మ
ఈమె పేరు బయమ్మ. ఈమె కూడా సుందరయ్య కాలనీలో గుడిసె వేసుకుని నివాసం ఉంటోంది. ఎస్టీ కులానికి చెందిన ఈమెకు అధికారులు విద్యుత్ రుణమాఫీ పత్రాన్ని రచ్చబండ కార్యక్రమంలో అందించారు అయితే ఇంత వరకు ఈ పథకం మాత్రం వర్తించకపోవడంతో యథావిధిగా బిల్లు చెల్లిస్తోంది. ఈ పథకం వివరాలను చెప్పేవారు కూడా కరువయ్యారు.