ఔను.. అమ్మహస్తం అస్తవ్యస్తంగా మారింది. కిరణ్‌కుమార్‌రెడ్డి తన హయాంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన ఈ పథకం అమలు ప్రశ్నార్థకంగా మారింది. పథకం పెట్టిన ఏడాదికే దాని ముచ్చట తీరింది. బడుగు, బలహీన వర్గాల వారికి అతి తక్కువ ధరకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలన్న ఉద్దేశంతో దీన్ని ప్రవేశపెట్టారు. తొలినాళ్లలో తొమ్మిది రకాల వస్తువులు పంపిణీ చేసిన యంత్రాంగం.. ఆ తరువాత కేవలం మూడు రకాల వస్తువులు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకోవడం చర్చనీయాంశంగా మారింది.
ప్రొద్దుటూరు, న్యూస్‌లైన్: అమ్మహస్తం పథకం కింద ఏప్రిల్ నెల కోటాకు సంబంధించి చౌక దుకాణాలకు పౌర సరఫరాల శాఖ అధికారులు కేవలం బియ్యం, చక్కెర, పామాయిల్ మాత్రమే సరఫరా చేస్తున్నారు. ఉన్న స్టాక్‌ను బట్టి అక్కడక్కడ కందిబేడలూ ఇస్తున్నారు. ఆర్థిక సంవత్సరం ముగిసిన తొలి నెలలోనే పథకం పరిస్థితి ఇలా తయారైంది. చౌక దుకాణాల వినియోగదారులకు మార్కెట్ ధరకంటే తక్కువ ధరకు నిత్యావసర వస్తువులు అందజేయాలన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టారు. ప్రారంభంలో ఈ పథకం తమదేనని చెప్పుకునేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, ప్రధాని మన్మోహన్‌సింగ్, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ ఫొటోలను ముద్రించారు. మొత్తమ్మీద పథకానికి సంబంధించి ప్రచారం భారీ ఎత్తున సాగింది. బియ్యంతో పాటు అమ్మహస్తం పథకం కింద తొమ్మిది రకాలైన చింతపండు, గోధుమపిండి, పసుపు, కందిపప్పు, కారం, గోధుమలు, ఉప్పు, పామాయిల్, పంచదారను అందజేయాల్సి ఉంది.
ఆది నుంచి అంతే..
పథకం ప్రారంభానికి ముందు అన్ని సరుకులను ప్యాకింగ్ చేసి సరఫరా చేసేందుకు టెండర్లను నిర్వహించారు. అయితే ప్రారంభ సమయం నుంచే పథకం తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. పలు సందర్భాల్లో సరుకుల కొరత ఏర్పడటంతో మొత్తం చౌకదుకాణాల పని తీరే అస్తవ్యస్తంగా మారింది. మిగతా సరుకుల పరిస్థితి అటుంచితే చింతపండు, కారంపొడి, పసుపు పొడుల నాణ్యతపై వినియోగదారుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. చాలా ప్రాంతాల్లో వినియోగదారులు వీటిని తీసుకోకుండా వ్యతిరేకించిన సందర్భాలూ లేకపోలేదు. అయితే కొందరు డీలర్లు బలవంతంగా వినియోగదారులకు వాటిని అంటగట్టారు. ఇవి తీసుకుంటేనే మిగతా సరుకులు ఇస్తామని ముడిపెట్టడంతో బలవంతంగా కొనుగోలు చేశారు.
అమ్ముడుపోని సరుకుల వేలం
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అమ్మహస్తం పథకంలో భాగంగా మిగతా సరుకులతోపాటు చింతపండు, పసుపు, కారంపొడిలను జిల్లా పౌరసరఫరాల శాఖాధికారులు కొనుగోలు చేశారు. వాటిని వినియోగదారులు తీసుకెళ్లకపోవడంతో అవి గోడౌన్లలో నిల్వ ఉన్నాయి. జిల్లాలో దాదాపుగా 48 టన్నుల చింతపండు, 10 టన్నుల పసుపు, 25 టన్నుల కారంపొడి నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.
నెలల తరబడి నిల్వలు అలాగే ఉండటంతో చేసేదేమిలేక చివరికి వీటిని వ్యాపారులకు అమ్మేందుకు పౌరసరఫరాల శాఖాధికారులు గత నెలలో టెండర్లు నిర్వహించారు. ఎలాగోలా వ్యాపారులతో మాట్లాడి వీటిని అమ్మే ప్రయత్నం చేయాలని గోడౌన్ల అధికారులకు జిల్లా అధికారులు సూచించారు. ఇందుకు సంబంధించి పత్రికా ప్రకటన కూడా ఇచ్చారు. పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ బుల్లయ్య ఏమంటున్నారంటే..
మిగిలిపోయిన సరుకును అమ్మడానికి పేపర్ ప్రకటన ఇచ్చాం. పలు కారణాలతో ప్రస్తుతం సరుకుల కొరత ఏర్పడింది.
అస్తవ్యస్తం
Published Wed, Apr 9 2014 2:08 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement