రూ.కోట్ల విలువైన కళాశాల స్థలం ఇది. మూడేళ్ల క్రితమే బెంగుళూరుకు చెందిన ఇద్దరికి విక్రయించారు. స్థలం కొన్న వారు చదును కూడా చేయించారు. అంత వరకు బాగానే ఉంది. ఆ సొమ్ము ఇంత వరకు కళాశాల అకౌంట్లకు చేరలేదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కళాశాల అభివృద్ధికి నోచుకోవడంలేదు.
ప్రొద్దుటూరు టౌన్: అది కోట్లు విలువ చేసే స్థలం. ఈ స్థలాన్ని అతి తక్కువ ధరకు చేజిక్కించుకున్నారే కానీ ఒక్క రూపాయి కూడా స్థలానికి సంబంధించిన కళాశాల అకౌంట్లలో జమ కాకపోవడం చూస్తుంటే ఈ రిజిస్ట్రేషన్లు బోగస్ అన్న అనుమానం వ్యక్తమవుతోంది. ఈ వ్యవహారంలో అధికార పార్టీకి చెందిన నాయకులు కీలక పాత్ర పోషిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రొద్దుటూరు పట్టణం కొర్రపాడు రోడ్డులో ఉన్న డీఏడబ్ల్యూ కళాశాలకు చెందిన 11 ఎకరాల స్థలాన్ని ప్రస్తుత కళాశాల కరస్పాండెంట్ మోహన్‌రావు 2011లో ఇద్దరికి విక్రయించారు. ఈ స్థలాలను కొనుగోలు చేసిన బెంగళూరు సిటీకి చెందిన ఎం.ఆంజనేయరెడ్డి రూ.4కోట్ల 41 లక్షల 90వేలకు బెంగళూరు విజయనగరం బ్రాంచి కరూర్ వైశ్యాబ్యాంక్ పేరున చెక్కులు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇందుకుగాను ఇతనికి 8.30 ఎకరాల స్థలాన్ని సర్వే నెంబర్లు 636, 666, 667 ఏలో రిజిస్ట్రేషన్ చేయించారు. అలాగే హైదరాబాద్ సిటీకి చెందిన శివగణేష్ సర్వే నెంబర్ 667 ఏ లో ఉన్న 20 సెంట్ల స్థలానికి సంబంధించి రూ.67 లక్షల 76వేలు సికింద్రాబాద్ బ్రాంచి చార్టెడ్ బ్యాంక్ పేరున చెక్కులు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. అలాగే సర్వే నెంబర్లు 636, 666, 667 ఏలో 1.30 ఎకరాల స్థలానికి రూ. కోటి 22 లక్షల 46వేలకు అదే బ్యాంక్ పేరున చెక్కులను ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మొత్తం 11 ఎకరాలకు గాను రూ.6కోట్ల 99 లక్షల 88 వేలకు కొనుగోలు చేసినట్లయింది.
ఆంజనేయరెడ్డి స్థలం మరికొందరికి విక్రయం
బెంగళూరు సిటీకి చెందిన ఆంజనేయరెడ్డి తాను కొనుగోలు చేసిన స్థ లాన్ని ద్వారకచర్ల రాఘవరెడ్డి, ద్వారకచర్ల ఈశ్వరరెడ్డిలకు చెరో 25సెంట్లు రూ. 26లక్షల 62వేలకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు.
మార్కెట్ విలువ రూ.50కోట్ల పైమాటే
అయితే ప్రస్తుతం కొర్రపాడు రోడ్డులో రిజిస్ట్రేషన్ విలువే సెంటు రూ.5లక్షలుపైగా పలుకుతోంది. హౌసింగ్ బోర్డు ఏరియాలోకి వచ్చే స్థలం కూడా సెంటు రూ.3-4లక్షలకు పైగా ఉంది. ఇక మార్కెట్ విలువ చూసుకుంటే రిజిస్ట్రేషన్ విలువకు రెండింతలు ఉంటుందన్నది అందరికి తెలిసిన విషయమే. ఈ విధంగా చూస్తే 11 ఎకరాల స్థలం రూ.50 నుంచి రూ. 60 కోట్లకుపైగా ధర పలుకుతోంది.
విక్రయించి మూడేళ్లవుతున్నా కళాశాల అభివృద్ధి ఏదీ...
స్థలాన్ని విక్రయించి డీఏడబ్ల్యూ కళాశాలను అభివృద్ధి చేస్తామని యాజమాన్యం ఇప్పటి వరకు ఒక్క భవన నిర్మాణం చేపట్టలేదు. స్థలం విక్రయించగా వచ్చిన కోట్ల రూపాయల డబ్బు ఏమైందన్న విషయంపై ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎక్కడేకానీ రిజిస్ట్రేషన్‌లో డబ్బు చెల్లించినట్లు లేదు. అన్ని బ్యాంక్ చెక్కులపైనే కోట్ల రూపాయల విలువ చేసే స్థలం రిజిస్ట్రేషన్ ఎలా చేయిస్తారన్న ప్రశ్నలకు సమాధానాలు లేవు. విశ్వసనీయ సమాచారం మేరకు ఇప్పటి వరకు బ్యాంక్ ఖాతాలో స్థలాన్ని కొనుగోలు చేసిన వారి నుంచి ఒక్క రూపాయి కూడా జమ కానట్లు తెలుస్తోంది.
మూడేళ్లుగా కళాశాల అభివృద్ధికి ఒక్కరూపాయి అయినా ఖర్చు పెట్టారా
డీఏడబ్ల్యూ కళాశాలకు చెందిన 11 ఎకరాల స్థలాన్ని విక్రయించామని చెబుతున్న కళాశాల యాజమాన్యం ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా కళాశాలకు ఖర్చు చేయలేదు.విక్రయాలన్నీ చెక్కులపైనే జరిగాయి. రూ.60 కోట్లకుపైగా విలువ చేసే స్థలం రూ.6కోట్ల 99 లక్షలకు విక్రయించడం చూస్తుంటే ఇదంతా బోగస్ అనిపిస్తోంది. భూమి అమ్మి కళాశాలను అభివృద్ధి చేస్తామని చెప్పిన యాజమాన్యం ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు ఇప్పటి వరకు దరఖాస్తు పెట్టారా? అంటే అదీలేదు. ఈ వ్యవహారంలో రాజకీయ నాయకుల హస్తం ఉందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
భూమాయ
Published Wed, Feb 25 2015 1:47 AM | Last Updated on Thu, Mar 21 2019 9:05 PM
Advertisement
Advertisement