ట్రాక్టర్లో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ రిపేరుకొచ్చింది. మరో ట్రాన్స్‌ఫార్మర్ కావాలంటే ఎర్రగుంట్లలోని మరమ్మతుల కేంద్రానికి వెళ్లాల్సిందే. ప్రొద్దుటూరు నుంచి ట్రాక్టర్లో ఎర్రగుంట్లకు ట్రాన్స్‌ఫార్మర్‌ను తీసుకెళ్లేందుకే రూ.1500 వరకు ఖర్చవుతోంది. ఎలాగోలా వెళ్లినా అక్కడి సిబ్బంది చేతులు తడపకపోతే మరమ్మతులు చేయరు. ట్రాన్స్‌ఫార్మర్ల స్టాక్ లేదంటూ కొన్ని సందర్భాలలో వారం, పది రోజుల పాటు తిప్పుకుంటుంటారు.
కడప అగ్రికల్చర్,న్యూస్‌లైన్: విద్యుత్ అధికారుల మాటలకు చేతలకు పొంతన ఉండటం లేదు. విద్యుత్ సమస్యలను వెనువెంటనే పరిష్కరిస్తాం..రైతన్నలకు ఎలాంటి ఇబ్బందులు కలుగనివ్వం...ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోతే అన్ని ఖర్చులు భరించి మేమే మరమ్మతులు చేయిస్తామని చెబుతున్న మాటలు ఆచరణలో కనిపించడం లేదు.
తామే వాహనాలను సమకూర్చుకుని ట్రాన్స్‌ఫార్మర్లు తీసుకువెళ్లి రిపేర్లు చేయించుకోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో హెచ్‌టీ 11కేవీ విద్యుత్ లైన్లు 19538.06 కిలోమీటర్లు, 33కేవీ 1747.20 కిలో మీటర్లు, 6.3 కేవీ విద్యుత్ లైన్లు 1277.30 కిలోమీటర్లు, ఎల్‌టీ లైన్లు 2111194.24 కిలోమీటర్ల చొప్పున లాగారు. అలాగే 5 కిలోవాట్స్ ఎంపీయర్ ట్రాన్స్ ఫార్మర్లు 284, 15 కేవీఏ 28851, 25 కేవీఏ 23239, 40 కేవీఏ 147, 50 కేవీఏ 35, 63 కేవీఏ 2674, 75 కేవీఏ 19, 100 కేవీఏ 4556, 150 కేవీఏ 6, 160 కేవీఏ 227, 200 కేవీఏ 5, 250 కేవీఏ 63, 281 కేవీఏ 1, 315 కేవీఏ 29, 400 కేవీఏ 2, 500 కేవీఏ 14 ట్రాన్స్‌ఫార్మర్లు ఉన్నట్లు అధికారిక రికార్డులు చెబుతున్నాయి. రోజుకు జిల్లా వ్యాప్తంగా 15 నుంచి 20 వరకు ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతుంటాయని అధికారులు తెలుపుతున్నారు.
చేయి తడిపితేనే గానీ కిందిస్థాయి సిబ్బంది రిపేర్లు చేయడం లేదని రైతులు బాహటంగానే ఆరోపిస్తున్నారు. లేనిపక్షంలో రేపురా...మాపురా అనడంతోపాటు మా...ఏడీఈ, ఏఈల వాహనాలు అందుబాటు లేవని తప్పించుకునే మాటలు చెబుతున్నారని రైతులు పేర్కొంటున్నారు. పెండ్లిమర్రి మండలంలోని చింతలవాండ్లపల్లె సమీపంలో 33/11 కేవీ విద్యుత్ స్తంభం కూలిపోయే స్థితిలో ఉందని చెప్పినా సిబ్బంది ఏ మాత్రం పట్టించుకోవడం లేదని రైతులు తెలిపారు. అదే మండలం పగడాలపల్లెలోని పొలాల్లో స్తంభాలు ఏర్పాటు చేయకపోవడంతో కర్రలపైనే వైర్లను లాగి మోటార్లు ఆడించుకుంటున్నారు. సింహాద్రిపురం మండలంలో ట్రాన్స్‌ఫార్మర్ల చుట్టూ పెన్సింగ్ ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని పలుగ్రామాల ప్రజలు చెబుతున్నారు.
సంస్థే బరాయిస్తుంది....
ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోతే పట్టణాల్లో 24 గంటలు, గ్రామాల్లో 48 గంటల్లో రిపేర్లు చేసి బిగిస్తున్నాం. ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతే తీసుకువెళ్లడానికి 23 మంది ఏడీఈలు సిద్ధంగా ఉంటారు. హెచ్‌వీడీఎస్ పద్ధతి వచ్చాక వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోవడం తగ్గింది. ఒక్కో సర్వీసుకు రూ. 50 వేలు సబ్సిడీ ఇస్తాం. అందులోనే 3 స్తంభాలు, వైరు, సామగ్రి ఇస్తాం. స్తంభం వద్ద కాకుండా దూరంగా బోర్లు వేసుకుని కర్రలపై తీగలను కొందరు రైతులు లాక్కుంటున్నారు. లాక్కున్నారు. బోరు వరకు స్తంభాలు, వైర్లు, సామగ్రి కోసం అదనంగా డబ్బులు చెల్లిస్తే మేమే ఏర్పాటు చేస్తాం.
- డాక్టర్ కేఎస్ పరబ్రహ్మం, ట్రాన్స్‌ఫార్మర్ల డీఈ, కడప
వారి మాటలకు అర్థాలే వేరులే...
Published Thu, Jan 23 2014 2:08 AM | Last Updated on Sat, Sep 2 2017 2:53 AM
Advertisement
Advertisement