కార్మికుల ఆందోళనతో అట్టుడికిన ప్రొద్దుటూరు
మున్సిపల్ కార్మికుల ఆందోళనతో శుక్రవారం ప్రొద్దుటూరు పట్టణం అట్టుడికింది. అధికారులు సులభ్ సిబ్బందితో పనులు చేయిస్తుండగా కార్మికులు అడ్డుకున్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి కార్మికులను బలవంతంగా ఈడ్చిపడేశారు. సీఐటీయూ జిల్లా నేత అన్వేష్‌ను బలవంతంగా ఎత్తుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఓ మహిళా కార్మికురాలి జాకెట్ చిరిగిపోయింది. పోలీసుల తీరును నిరసిస్తూ కార్మికులు పోలీసుస్టేషన్ ఎదుట బైఠాయించి పరకలను రోడ్డుపై వేసి తగులబెట్టారు.
ప్రొద్దుటూరు టౌన్ : మున్సిపల్ కార్మికుల ఆందోళన, పోలీసుల రంగ ప్రవేశంతో ప్రొద్దుటూరు పట్టణం శుక్రవారం అట్టుడికింది. మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మె శుక్రవారానికి 8వ రోజుకు చేరుకుంది. పాలక వర్గం సులభ్ సిబ్బందితో పనులు చేయిస్తుంటే కార్మికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారి పరకలను తీసుకొని నిప్పు పెట్టారు. పోలీసుల రంగ ప్రవేశంతో గాంధీరోడ్డులో అరగంట పాటు తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
వన్‌టౌన్ సీఐ మహేశ్వరరెడ్డి సిబ్బందితో కలిసిన కార్మికులను అడ్డుకున్నారు. పోలీస్ వాహనాల్లో ఎక్కించే క్రమంలో కార్మికులు తిరగబడ్డారు. సీఐటీయూ జిల్లా నాయకుడు అన్వేష్‌తోపాటు కార్మిక సంఘం, విద్యార్థి సంఘం నాయకులను పోలీసులు బలవంతంగా లాక్కెళ్లే ప్రయత్న చేయగా, మహిళా కార్మికులు అడ్డుకున్నారు. ఆ సమయంలో అక్కడ ఒక్క మహిళా కానిస్టేబుల్ కూడా లేరు. మహిళలని కూడా చూడకుండా ఈడ్చి పడేశారు. ఇంతలో అక్కడికి వచ్చిన అర్బన్ సీఐ టీవీ సత్యనారాయణ, ఎస్‌ఐలు మహేష్, వెంకటేశ్వర్లు, సిబ్బంది.. కార్మిక సంఘాల నాయకులను జీపులో ఎక్కించారు. మహిళా కార్మికులు వాహనానికి అడ్డుపడ్డారు. మగ పోలీసులు వారిని పక్కకు లాగేశారు. ఈ సమయంలో ఓ కార్మికురాలి రవిక చినిగి పోయింది.
పోలీస్‌స్టేషన్ ఎదుట బైఠాయింపు..
దీంతో కార్మికులు పోలీస్‌స్టేషన్ ఎదుట బైఠాయించారు. మా నాయకులను విడిచి పెట్టాలని, సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. మహిళా కార్మికులు పోలీస్ స్టేషన్‌లోకి వెళ్లారు. అక్కడ మహిళా కానిస్టేబుల్స్ కార్మికులను లోనికి తోసేశారు.
ఎమ్మెల్యే చర్చించడంతో పరిస్థితి అదుపులోకి..
శాంతియుతంగా ఆందోళన చేస్తున్న కార్మికులపై ప్రభుత్వం అణచి వేసే ధోరణి వ్యవహరిస్తుంటే.. స్థానిక పాలకవర్గం కూడా అదే విధానాన్ని పాటిస్తోందని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు. వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని డీఎస్పీ పూజితా నీలం, సీఐలతో చర్చించారు. అరెస్టు అయిన కార్మిక సంఘం నాయకులు అన్వేష్, అక్కడికి వచ్చిన ఏఐటీయూసీ నాయకులు రామయ్యతో చర్చించారు.
ముస్లింల మనోభావాలు దెబ్బతినకుండా మసీదు, ఈద్గాల వద్ద శుభ్రం చేసి కార్మికులు ఆదర్శంగా నిలవాలని పోలీస్ అధికారులు కోరారు. అందుకు రాష్ట్ర కమిటీ ఒప్పుకోదని, ప్రైవేటు వారితో చేయించుకుంటే అభ్యంతరం లేదని కార్మిక సంఘం నేతలు తెలిపారు. పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చిన వారిని విడిచి పెట్టడంతో ఎమ్మెల్యే, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ముక్తియార్‌తోపాటు వైఎసార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈవీ సుధాకర్‌రెడ్డి, కార్మిక సంఘం నాయకులు, కార్మికులు ర్యాలీగా మున్సిపల్ కార్యాలయం వరకు వచ్చారు.