ప్రొద్దుటూరు, న్యూస్‌లైన్: ఒప్పందం గడువు పూర్తి కావడంతో జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివే వేలాది మంది విద్యార్థులు కంప్యూటర్ విద్యకు దూరం కానున్నారు. డిసెంబర్ నెల నుంచి పాఠశాలల్లో కంప్యూటర్ విద్యను బోధించే వారు ఉండని పరిస్థితి నెలకొనడమే ఇందుకు కారణం. మారుతున్న కాలానికి అనుగుణంగా పాఠశాలల్లో కంప్యూటర్ విద్యను ప్రవేశపెట్టారు. 2003లో రాష్ట్రంలోని 1000 పాఠశాలల్లో ఈ పథకాన్ని అమలు చేశారు. 2008లో అదనంగా మరో 300 పాఠశాలలను చేర్చి గడువు పొడిగించారు. మొత్తం 1300 పాఠశాలలకు గాను 2015 వరకు గడువు ఉంది.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కంప్యూటర్ విద్యకు మరింత పెద్దపీట వేశారు. ఆయన హయాంలో కంప్యూటర్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు (ఐసీటీ) సంస్థ ఒక ఒప్పందం కుదుర్చుకుంది. 5000 పథకం కింద రాష్ట్రంలోని 5000 ఉన్నత పాఠశాలలో కంప్యూటర్ విద్యను అందిస్తారు. ఇందులో భాగంగా ప్రతి పాఠశాలకు 11 చొప్పున రూ.2లక్షలకుపైగా విలువగల కంప్యూటర్లను ఏర్పాటు చేయడంతోపాటు ఇద్దరు ఇన్‌స్ట్రక్టర్లను సంస్థ నియమించింది. వీరికి రూ.2,600 చొప్పున వేతనం చెల్లిస్తోంది. ఈ పథకం కింద జిల్లాలో 168 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ప్రతి పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఈ విద్యను అందిస్తున్నారు. ఇందు కోసం ప్రత్యేకంగా పీరియడ్లను కేటాయించారు.
మొత్తం 5 స్థాయిల్లో ఈ కోర్సును అందిస్తున్నారు. నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం ప్రతి నెల పాఠశాలలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తోంది. సంస్థ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 2008 నుంచి ఈ ఏడాది నవంబర్ 19వ తేదీకి ఐదేళ్ల గడువు పూర్తికానుంది. ఇప్పటికే సంస్థ నిర్వాహకులు ఈ విషయాన్ని విద్యాశాఖాధికారులకు తెలియజేశారు. 19వ తేదీ తర్వాత కంప్యూటర్లను ఆయా పాఠశాలలకు అప్పగించి సంస్థ నియమించిన ఇన్‌స్ట్రక్టర్లను తొలగించనున్నారు. దీంతో విద్యార్థులు కంప్యూటర్ విద్యకు దూరమయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆయా పాఠశాల్లోని ఉపాధ్యాయులు శిక్షణ పొంది గడువు ముగిసిన అనంతరం విద్యార్థులకు నేర్పాల్సి ఉంది. అయితే ఉపాధ్యాయులు ఎవరూ శిక్షణ పొందలేదు. తరగతుల నిర్వహణే తమకు భారమైందని, అదనంగా కంప్యూటర్ విద్యను బోధించడం తమ వల్ల కాదని ఉపాధ్యాయ వర్గాలు అంటున్నాయి. మరికొందరు ఈ వయసులో కంప్యూటర్ విద్యను నేర్చుకోలేమని అంటున్నారు. ఈ విషయమై కొంత మంది ఎంఈఓలు జిల్లా విద్యాశాఖాధికారి అంజయ్యను శుక్రవారం ఇక్కడికి వచ్చిన సందర్భంగా కలిశారు. ఇన్‌స్ట్రక్టర్లను తొలగించిన అనంతరం పాఠశాలలో ఎవరో ఒకరికి ఈ బాధ్యతను అప్పగిస్తున్నట్లు వారి నుంచి లేఖలు తీసుకోవాలని డీఈఓ సూచించినట్లు తెలిసింది.
19వ తేదీకి గడువు పూర్తవుతుంది
సంస్థ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఈనెల 19వ తేదీకి గడువు పూర్తికానుంది. ఎలాగూ వేతనాలు చెల్లిస్తున్నాం కదా అని నెలాఖరు వరకు ఇన్‌స్ట్రక్టర్లను ఉండమని చెప్పాం. కంప్యూటర్లను ఆయా పాఠశాలలకు అప్పగిస్తాం.
- ఉమామహేశ్వరరావు,
ఐసీటీ సంస్థ జిల్లా కోఆర్డినేటర్
ఉపాధి కల్పించాలి
చాలా రోజులుగా ఇదే వృత్తిని నమ్ముకుని జీవిస్తున్నాం. సంస్థ ఒప్పందం ముగిస్తే మాలాంటి వారి పరిస్థితి ఏమిటి. ప్రభుత్వం ఉపాధి కల్పించాలి.
- సుదర్శన్, ఇన్‌స్ట్రక్టర్
మంగళం..!
Published Sat, Nov 9 2013 3:13 AM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM
Advertisement
Advertisement