బిడ్డల భవిష్యత్తుపై కోటి ఆశలు పెట్టుకున్న కన్నవారికి చివరకు గర్భశోకం మిగిలింది. త్వరలో ఉన్నత విద్యను ముగించుకుని జీవితంలో స్థిరపడాల్సిన యువకుల్ని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వెంట తీసుకెళ్లింది.
మరి కొద్ది నిమిషాల్లో ఇంటికి చేరుకోవాల్సిన పిల్లలు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడ ంతో రెండు కుటుంబాల్లో విషాదం అలుముకుంది. ఇంకో సంఘటనలో ఖాతాదారుల నుంచి బాకీలు వసూలు చేసుకునేందుకు వెళ్తున్న బంగారు వ్యాపారి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఇంకో ప్రమాదంలో టమోటా వ్యాపారం కోసం వచ్చిన ఇద్దరిని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మృతి చెందారు.
ప్రొద్దుటూరు క్రైం, న్యూస్‌లైన్: ఎర్రగుంట్ల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మరణించగా, మరో విద్యార్థి తీవ్రంగా గాయపడిన సంఘటనతో ప్రొద్దుటూరులో విషాదం నెలకొంది. ప్రొద్దుటూరులోని మోడంపల్లెకు చెందిన పల్లేటి వెంకటకృష్ణారెడ్డికి గౌతంకుమార్‌రెడ్డితో పాటు ఇద్దరు కుమార్తెలున్నారు. కుమారుడు చాపాడు మండలం పల్లవోలు సమీపంలోని సీబీఐటీ కళాశాలలో సీఎస్‌ఈ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఒకే కుమారుడు కావడంతో అతన్ని తల్లిదండ్రులు ఎంతో గారాబంగా పెంచారు. చిన్నప్పటి నుంచి ప్రతి సబ్జెక్టులోనూ అతను మంచి మార్కులు తెచ్చుకునేవాడు. అదే కళాశాలలో చదువుతున్న మైదుకూరుకు చెందిన పవన్‌కుమార్ గౌతం కుమార్‌రెడ్డికి మంచి స్నేహితుడు.(పవన్‌కుమార్‌రెడ్డి స్వస్థలం అనంతపురం జిల్లా హిందూపురం కాగా, వారి కుటుంబం కొన్నేళ్లుగా మైదుకూరులో నివసిస్తోంది) తమ సమీప బంధువైన ఆర్‌కే చరణ్‌తేజ అనంతపురం జిల్లా రాయదుర్గంలో డిగ్రీ చదువుతున్నాడు. చరణ్‌తేజ మంగళవారం రాత్రి రైలులో ఎర్రగుంట్లకు వస్తున్నట్లు సమాచారం అందించాడు.
దీంతో వపన్‌కుమార్ తన మిత్రుడైన గౌతంకుమార్‌రెడ్డిని వెంట తీసుకొని బైక్‌లో ఎర్రగుంట్లకు వెళ్లాడు. చరణ్‌తేజ వచ్చేటప్పటికి అర్ధరాత్రి దాటగా ముగ్గురూ కలసి బైక్‌లో ప్రొద్దుటూరుకు బయలుదేరారు. మరో ఐదు నిమిషాల్లో ప్రొద్దుటూరుకు చేరుకుంటామనగా మార్గమధ్యంలోని పెన్నానది వంతెనపై ఎదురుగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో వారు ప్రయాణిస్తున్న బైక్ దిమ్మెను ఢీకొంది. ఘటనలో గౌతంకుమార్‌రెడ్డి, చరణ్ తేజ్ అక్కడిక క్కడే మరణించగా, పవన్‌కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. స్నేహితుడి కోసం వెళ్లి తమ కుమారుడు ఇలా అకాల మృత్యువాత పడ్డాడని గౌతంకుమార్‌రెడ్డి కుటుంబీకులు రోదించడం అందరి హృదయాలను బరువెక్కించింది.
కిటకిటలాడిన ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రి
గౌతంకుమార్‌రెడ్డి, చరణ్‌తేజ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం, ప్రమాదంలో గాయపడ్డ పవన్‌కుమార్‌ను వైద్య చికిత్స కోసం ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకువచ్చారని తెలియగానే వారి వారి కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున ఆస్పత్రికి చేరుకున్నారు. వీరికి తోడు సీబీఐటీ, వీబీఐటీ కళాశాలల విద్యార్థులు కూడా అర్ధరాత్రే ఆస్పత్రికి చేరుకోవడంతో ఆ ప్రాంతమంతా కిటకిటలాడింది. పవన్‌కుమార్‌కు మెరుగైన వైద్యం కోసం రాత్రికి రాత్రే ప్రొద్దుటూరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
స్కానింగ్, ఎక్స్‌రే తదితర పరీక్షలను విద్యార్థులు, బంధువులు దగ్గరుండి చేయించారు. గౌతంకుమార్‌రెడ్డి మృతదేహాన్ని చూసి విద్యార్థులందరూ కన్నీటి పర్యంతమయ్యారు. సీబీఐటి, వీబీఐటీ కళాశాలల కరస్పాండెంట్ జయచంద్రారెడ్డి, వైఎస్‌ఆర్ ఇంజినీరింగ్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ జయరామిరెడ్డి ఆస్పత్రికి చేరుకొన్నారు. విద్యార్థుల మృతదేహాలను సందర్శించి, వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. కాగా పోస్టుమార్టం అనంతరం మధ్యాహ్నం చరణ్‌తేజ మృతదేహాన్ని రాయదుర్గానికి తరలించగా, గౌతంకుమార్‌రెడ్డి మృతదేహాన్ని మోడంపల్లెకు తరలించారు.
విషాదం
Published Thu, Dec 26 2013 2:19 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement