ఆ యువజంటపై ఏ దుష్టశక్తి కళ్లు పడ్డాయో ఏమో.. అత్యంత పవిత్ర స్థలమైన మక్కాకు బయలు దేరిన వారు శాశ్వతంగా అల్లా వద్దకే చేరుకున్నారు. ప్రొద్దుటూరుకు చెందిన హసద్(25), షేక్ రిహానా (21)లకు ఏడు నెలల క్రితమే వివాహమైంది. సౌదీలో వ్యాపారం చేస్తున్న హసద్ భార్య, తల్లి, సోదరుడు నూర్‌తోపాటు మదీనా వెళ్లి అక్కడి నుంచి మక్కా యూత్రకు బయలుదేరారు. ఇంతలోనే విధి చిన్నచూపు చూసింది. చీకట్లో మృత్యురూపంలో ఆగి ఉన్న ఓ ట్యాంకర్ ఆ యువజంటను కాటేసింది. ఈ ప్రమాదంలో హసద్ తల్లి జిలాన్ బేగం కూడా మృత్యువాతపడగా.. సోదరుడు నూర్ తీవ్ర గాయూలతో చికిత్స పొందుతున్నాడు.
ప్రొద్దుటూరు క్రైం: సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదం ఓ కుటుంబాన్ని కబళించింది. నిలిచి ఉన్న ట్యాంకర్‌ను కారు ఢీ కొన్న సంఘటనలో ఒకే కుటుం బానికి చెందిన ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. శుక్రవారం ఉదయం 4 గంటల సమయంలో మక్కాకు 150 కిలోమీటర్ల దూరంలో ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో ప్రొద్దుటూరుకు చెం దిన దంపతులు షేక్ రిహానా (21), హసద్ (25)తోపాటు హసద్ తల్లి జిలాన్‌బేగం (51)లు మృతి చెందగా నూర్ అనే యువకుడు గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు స్థానిక ఆర్ట్స్‌కాలేజి రోడ్డుకు చెందిన మాజీ కౌన్సిలర్ అమీర్ కుమార్తె రిహానాకు ఏడు నెలల క్రితం శ్రీనివాసనగర్‌లో ఉన్న హసద్‌తో వివాహం జరిగింది. రెండు నెలల తర్వాత దంపతులిద్దరూ సౌదీకి వెళ్లిపోయారు.
10 ఏళ్ల నుంచి సౌదీ అరేబియాలోనే..
హసద్ సౌదీ అరేబియాలోని రియాద్‌లో సూపర్‌మార్కెట్ నిర్వహిస్తున్నాడు. అతనితోపాటు తల్లిదండ్రులు జిలాన్‌బేగం, ఖాసిం, సోదరులు ఇబ్రహిం, నూర్‌లు కూడా అక్కడే ఉన్నారు. ఇటీవలే తల్లి జిలాన్‌బేగం నూర్‌తో కలిసి ఇండియాకు వచ్చింది. కొన్ని రోజులపాటు ఇక్కడ ఉన్న జిలాన్‌బేగం చిన్న కుమారుడు నూర్‌తో కలసి 12 రోజుల క్రితం సౌదీకి వెళ్లింది. రెండు రోజుల క్రితం హసద్ దంపతులతోపాటు జిలాన్‌బేగం, నూర్‌లు కలిసి కారులో మదీనాకు బయలుదేరారు. తర్వాత అక్కడి నుంచి గురువారం రాత్రి మక్కాకు బయలుదేరారు. అయితే వారి వాహనం మదీనాకు 150 కిలోమీటర్ల దూరంలో ఉండగా శుక్రవారం ఉదయం 4.15 (భారత కాలమానం ప్రకారం) సమయంలో నిలిచి ఉన్న ట్యాంకర్‌ను ఢీ కొంది.
ఈ సంఘటనలో రిహానా, హసద్, జిలాన్‌బేగంలు మృతి చెందగా నూర్‌కు గాయాలయ్యాయి. రోడ్డు ప్రమాదంలో స్పృహ కోల్పోయిన నూర్ సుమారు రెండు గంటల తర్వాత స్పృహలోకి వచ్చాడు. వెంటనే అతను సౌదీలో ఉంటున్న బంధువులతోపాటు ప్రొద్దుటూరులో ఉన్న వారికి సమాచారం అందించాడు. కాగా రిహానా 7 నెలల గర్భవతి అని కుటుంబ సభ్యులు తెలిపారు. మక్కా యాత్ర అనంతరం కొద్ది రోజుల్లోనే కూతురు, అల్లుడు ఇండియాకు వచ్చేవారని చెప్పుకుంటూ అమీర్ రోదించసాగాడు.
పరామర్శించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ
విషయం తెలియడంతో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, మునిసిపల్ ఛైర్మన్ గురివిరెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు వీఎస్ ముక్తియార్, ఈవీ సుధాకర్‌రెడ్డి తదితరులు ఆర్ట్స్ కాలేజి రోడ్డులోని అమీర్ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. రోడ్డు ప్రమా దం ఎలా జరిగిందో వారు కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని ఎమ్మెల్యే రాచమల్లు అమీర్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. గోపవరం సర్పంచ్ దేవీ ప్రసాద్‌రెడ్డి, మాజీ ఎంపీపీ రాఘవరెడ్డి, కౌన్సిలర్‌లు చక్రకోళ్ల రాందాసు, జయశంకర్, కోనేటి సునంద, వైఎస్సార్‌సీపీ నాయకులు పోసా భాస్కర్, కుతుబుద్దీన్, రాయల్‌గౌస్ తదితరులు అమీర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.
యూ అల్లా..!
Published Sat, Dec 27 2014 3:35 AM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM
Advertisement
Advertisement