
డిజిల్ ట్యాంకర్ వద్ద గుమికూడిన జనం
సాక్షి, జనగామా/రఘునాథపల్లి: డీజిల్ లోడ్‌తో వెళుతున్న ఓ ట్యాంకర్ జనగామ జిల్లా నిడిగొండ బస్టాండ్ వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. హైదరాబాద్‌లోని చర్లపల్లి నుంచి జిల్లాలోని యశ్వంతాపూర్‌లో ఓ పెట్రోల్ బంక్‌కు ట్యాంకర్ ద్వారా రూ.9.5 లక్షల విలువైన 12 వేల లీటర్ల డీజిల్‌ను తరలిస్తుండగా శుక్రవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండి యశ్వంతాపూర్‌ను దాటి మూడు కిలోమీటర్లు ముందుకు వెళ్లిపోయాడు. ఈ సమయంలో నిడిగొండ బస్టాండ్ వద్ద అదుపు తప్పి డివైడర్ మీదుగా ఇనుప కంచెను ధ్వంసం చేసుకుంటూ విద్యుత్ స్తంభాన్ని ఢీకొని సర్వీస్ రోడ్డుపై బోల్తాపడింది. దీంతో పెద్ద ఎత్తున డీజిల్ ఒక్కసారిగా బయటకు చిమ్మడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. తీవ్ర గాయాలతో క్యాబిన్‌లో చిక్కుకుపోయిన డ్రైవర్ చంద్రమౌళిని స్థానికులు బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. (చదవండి: 40 మంది చిన్నారులు.. మృత్యు లారీ)
కాగా, ట్యాంకర్ నుంచి డీజిల్ వరదలా బయటకు వస్తుండడంతో దానిని పట్టుకునేందుకు క్యాన్లు, బకెట్లతో జనం ఎగబడ్డారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని అగ్నిమాపక సిబ్బం దితో కలసి రక్షణ చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో దాదాపు 9 వేల లీటర్ల డీజిల్ నేలపాలైందని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment