ప్రమాదంలో మృతిచెందిన వీఆర్‌ఏ కృష్ణ....ఇన్‌సెట్లో గాయపడిన ఆయన కుమార్తె సోనీ
జనగామ అర్బన్: మేనకోడలు వివాహ వేడుకకు వచ్చిన ఓ వీఆర్‌ఏ రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలపాలై మృతిచెందిన సంఘటన జనగామ జిల్లా కేంద్రంలో గురువారం సాయంత్రం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం... యాదాద్రి జిల్లా ఆలేరు మండలం షారాజీపేట శివారు తూర్పుగుడెం వీఆర్‌ఏగా విధులు నిర్వర్తిస్తున్న ఝెండ్రు కృçష్ణ(40) జనగామలోని తన మేనకోడలు వివాహానికి కూతురు సోనితో కలిసి హాజరయ్యాడు.
పెళ్లి ముగిశాక పెళ్లింటికి టీవీఎస్ ఎక్సెల్ ద్విచక్ర వాహనంపై బయల్దేరాడు. జనగామ రైల్వే బిడ్జిపై సిద్ధిపేట వైపునకు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న హైదరాబాద్‌కు చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, ఎక్స్‌ఎల్ వాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో కృష్ణ తలకు తీవ్రగాయాలు కాగా కూతురు సోనికి సైతం గాయాలయ్యాయి. గుర్తించిన స్థానికులు జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించగా ప్రథమ చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా కృష్ణ మార్గమధ్యలో మృతిచెందాడు.
సోని ప్రస్తుతం ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు హాజరవుతోంది. కాగా వీఆర్‌ఏ కృష్ణ భార్య యాదలక్ష్మి, కుమారుడు గతంలోనే అనారోగ్యంతో మృతిచెందారని బంధువులు తెలిపారు. రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ప్రమాదం జరగడంతో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. సంఘటన స్థలానికి చేరుకున్న జనగామ ఎస్సై శ్రీనివాస్ వివరాలు తెలుసుకొని కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పెండ్లివారు ఆస్పత్రికి చేరుకొని చేసిన రోదనలు మిన్నంటాయి.
ప్రమాదానికి కారణమైన బస్సు
ఫ్లైఓవర్ బిడ్జిపై మరో ప్రమాదం..
జనగామ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిపై గురువారం మధ్యాహ్నం మరో ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం నుంచి ఇద్దరు యువకులు తృటిలో బయటపడ్డారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. యాదాద్రి జిల్లా యాదగిరిపల్లికి చెందిన బైరిగి రాము, అదే జిల్లా బస్వాపురానికి చెందిన గుండెగళ్ల నర్సింహులు బైక్‌పై జనగామ నుంచి సిద్ధిపేట వైపు వెళ్తుండగా వెనుకవైపు నుంచి వచ్చిన బొలెరో వాహనం వారి బైక్‌ను ఢీకొట్టి అదుపుతప్పి బ్రిడ్జి రైలింగ్‌ను తాకి ఆగిపోయింది.
ఈ ఘటనలో రాము, నర్సింహులకు గాయాలుకాగా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం అందించారు. ఈ సంఘటనలో బైక్ ధ్వంసం కాగా, కొద్దితేడాతో బొలెరో వాహనం ఫ్లైఓవర్ బ్రిడ్జిపై నుంచి పడిపోయేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment