కదిలిస్తే..కన్నీరే.. | eight people died in road accident | Sakshi
Sakshi News home page

కదిలిస్తే..కన్నీరే..

Published Fri, Feb 28 2014 2:31 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

eight people died in road accident

వారంతా రెక్కాడితేగానీ డొక్కాడనివారే.. చిన్నచిన్న పనులకోసం ఆటోలో ప్రయాణిస్తుంటారు. అటువంటివారిపై విధి పగబట్టింది.. ఒకరుకాదు.. ఇద్దరు కాదు ఏకంగా 8 మందిని బలిగొంది. చిన్న సింగనపల్లెకు చెందిన మైసూరారెడ్డి, పాపయ్య ప్రాణస్నేహితులు. ఎక్కడికి వెళ్లినా ఇద్దరూ కలిసే వెళుతుంటారు. బుధవారం కూడా కలిసే ప్రయాణించారు. కలిసే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

మరణంలోనూ వారి స్నేహబంధం వీడలేదు. గుడిపాడుకు చెందిన నాగ చంద్ర, నాగేంద్ర తండ్రీ కొడుకులు. క్షౌరవృత్తే జీవనాధారం. ప్రతి రోజూ దువ్వూరుకు వెళ్లివచ్చేవారు. బుధవారం వారికి ఆఖరి ప్రయాణమే అయింది. మనేరాంపల్లెకు చెందిన రామేశ్వరి చదువులతల్లి. ఇటీవలే డిప్లమో పూర్తి చేసింది. ప్రొద్దుటూరులో కంప్యూటర్ శిక్షణ పొందుతోంది. ఇంటికి వస్తుండగా రామేశ్వరికి నూరేళ్లు నిండాయి. గుడిపాడుకు చెందిన ఓబుళరెడ్డిది మరోవిషాదం. 25 ఏళ్ల క్రితం భార్య చనిపోగా పిల్లలకోసం సుశీలమ్మను వివాహం చేసుకున్నాడు. అనారోగ్యంతో ఉన్న ఓబుళరెడ్డి బాగోగులను సుశీలమ్మే చూసుకునేది. రోడ్డు ప్రమాదంలో సుశీలమ్మ మృతి చెందింది. ‘ భగవంతుడా ఇంత అన్యాయం చేస్తావా’ అంటూ ఓబుళరెడ్డి విలపిస్తున్న తీరు కంటతడి పెట్టిస్తోంది.
 
  ఉద్యోగం పొందాలనే కోరిక తీరకుండానే...
 ప్రొద్దుటూరు క్రైం/దువ్వూరు, న్యూస్‌లైన్ : వివిధ రకాల పనులు చేసుకునే పలువురు తమ తమ గ్రామాలకు వెళ్లడానికి ఆటో ఎక్కారు.. కొందరు మరో పది నిమిషాలల్లో తమ గ్రామం వస్తుందనుకున్నారు..మరి కొందరు 15 నిమిషాలుంటే ఇంటికి చేరుకోవచ్చులే అనుకున్నారు.. ఇలా ఆటోలో ఐదారు గ్రామాల ప్రజలు ప్రయాణిస్తున్నారు.
 
  ఆటోలో ఉన్న ఏ ఒక్కరి గ్రామం రాకముందే రోడ్డు ప్రమాదం జరిగింది. కొద్దిసేపట్లో ఇంటికి వెళ్తారనుకున్న ప్రయాణికులు తిరిగిరాని లోకాలకు పయనమయ్యారు. 8 మందిని పొట్టన పెట్టుకున్న రోడ్డు ప్రమాదం అందరిలోనూ అంతులేని విషాదాన్ని నింపింది. పండుగ పూట ఆనందంగా ఉండాల్సిన ఆ కుటుంబాల్లో మృత్యు రోదనలు వినిపిస్తున్నాయి.

 వాళ్లిద్దరూ ప్రాణ స్నేహితులు.. ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్లేవారు..పొలానికి వెళ్లినా, బజారుకు వెళ్లినా తోడు లేనిదే వెళ్లేవారు కాదు..అలాంటి స్నేహితులు మరణంలోనూ తోడుగా వెళ్లారు. చిన్నసింగనపల్లె గ్రామానికి చెందిన గువ్వల మైసూరారెడ్డి(48)కి ముగ్గురు కూతుర్లు, ఇద్దరు కుమారులున్నారు.
 
 వారిలో ఇద్దరికి పెళ్లిళ్లు చేశారు. అదే గ్రామంలోని మత్స్యకారుడైన దారుబోయిన పాపయ్య(47)కు భార్య గుర్రమ్మ, వెంకటేశ్ అనే కుమారుడు ఉన్నారు. కుమారుడికి కర్నూలు జిల్లా జమ్ములదిన్నెలో పెళ్లి సంబంధం ఖాయం అయింది. వ్యవసాయ పనులు ముగిసిన తర్వాత ఏప్రిల్ నెలలో పెళ్లి పెట్టుకోవాలని ఇరువురు మాట్లాడుకున్నారు. ఇదిలా ఉండగా పాపయ్య, మైసూరారెడ్డి చిన్నప్పటి నుంచి వాళ్లిద్దరి మధ్య స్నేహబంధం కొనసాగుతోంది.

ఈ క్రమంలో మైసూరారెడ్డి కుమార్తెకు పెళ్లి సంబంధం మాట్లాడటానికి ఇద్దరూ కలిసి బుధవారం ఉదయాన్నే కర్నూలు జిల్లాలోని ఉయ్యాలవాడకు వెళ్లారు. తర్వాత ఇద్దరూ బస్సులో దువ్వూరుకు చేరుకున్నారు. గురువారం శివరాత్రి పండుగ ఉండటంతో ఇద్దరూ దువ్వూరులో సరుకులు తీసుకొని ఆటోలో గ్రామానికి బయలుదేరారు. ఇంటికి చేరకముందే రోడ్డు ప్రమాదంలో మృత్యుపాలయ్యారు.
 
 వారిది సాధారణ కుటుంబం.. కులవృత్తే వారికి జీవనాధారం.. కుటుంబ బాధ్యతలు మోసే క్రమంలో తండ్రీ కొడుకులిద్దరినీ మృత్యువు వెంటాడింది. గుడిపాడుకు చెందిన సన్నాయి నాగచంద్ర(45)కు నాగేంద్రప్రసాద్,(23), నాగేంద్రకుమార్ అనే కుమారులతో పాటు శివపార్వతి అనే కుమార్తె ఉంది. కొన్నేళ్ల క్రితమే శివపార్వతికి పెళ్లి చేశారు. కొన్ని కారణాల వల్ల కుమార్తె కుటుంబ పోషణా భారం కూడా తండ్రిపైనే పడింది. దీంతో తండ్రితో పాటు కుమారుడు నాగేంద్ర దువ్వూరులో క్షవరశాల పెట్టుకొని కులవృత్తిని చేసేవారు. పని చేస్తేగాని కుటుంబం గడువకపోవడంతో తండ్రీకొడుకులిద్దరూ కష్టపడేవారు. ఈ క్రమంలోనే దువ్వూరు నుంచి గుడిపాడు గ్రామానికి ఇద్దరూ పయనమయ్యారు. అయితే దారిలోనే వారు తిరిగిరాని లోకాలకు వెళ్లి పోయారు.
 

 మనేరాంపల్లి గ్రామానికి చెందిన ఇరగంరెడ్డి రామగోవిందరెడ్డికి కుమార్తె రామేశ్వరి(18)తో పాటు రాంప్రశాంత్‌రెడ్డి అనే కుమారుడు ఉన్నాడు. రామగోవిందరెడ్డి సన్నకారు రైతు. పిల్లలిద్దరినీ బాగా చదివించాడు. కుమారుడు ఇటీవలే డిగ్రీ పూర్తి చేసి నంద్యాలలో బ్యాంక్ కోచింగ్‌కు శిక్షణ పొందుతున్నాడు. కుమార్తె రామేశ్వరి గత జూన్‌లో డిప్లొమో పూర్తి చేసింది. మూడు నెలల నుంచి ఆమె ప్రొద్దుటూరులో కంప్యూటర్ కోర్సు చేస్తోంది. ఇందుకోసం ఆమె ప్రతి రోజూ గ్రామం నుంచి ప్రొద్దుటూరుకు వచ్చి పోతుంటుంది. పదో తరగతితోపాటు ఇంటర్‌లో కూడా రామేశ్వరి మెరిట్ మార్కులు సాధించింది. ఎలాగైనా ఉద్యోగం సంపాదిస్తానని ఆమె తల్లి ఆదిలక్షుమ్మతో చెబుతూ ఉండేది.
 

 అయితే ఆ కోరిక తీరకుండానే  తనువు చాలించింది. అలాగే గుడిపాడుకు చెందిన కమతం వెంకటరెడ్డి(55)కి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఎరువుల కోసం అతను బుధవారం దువ్వూరుకు వెళ్లాడు. తిరిగి వచ్చేటప్పుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.  చిట్వేలుకు చెందిన షేక్ ఖాదర్‌బాషా(65) కొన్నేళ్ల నుంచి ఆధ్యాత్మిక  చింతనతో జీవిస్తున్నాడు. అతని భార్య రసూల్‌బీ చిట్వేల్‌లో ఉండగా అతను మాత్రం దువ్వూరు మండలంలోని చింతకుంట సమీపంలో ఉన్న అబ్దుల్‌ఖాదర్ స్వామి దర్గా వద్దనే ఉండేవాడు. దువ్వూరు వచ్చిన అతను  తిరిగి దర్గా వద్దకు వెళ్తూ ప్రమాదానికి గురయ్యాడు.
 
 ప్రొద్దుటూరుకు వెళ్లి వస్తూ...
 దువ్యూరు, న్యూస్‌లైన్: తాను చస్తూ నన్ను చంపిందని బుధవారం రాత్రి ఆటో ప్రమాదంలో మృతిచెందిన గోపిరెడ్డి సుశీలమ్మ భర్త చిన్న ఓబుళరెడ్డి ఆవేదనతో చెప్పాడు. గుడిపాడుకు చెందిన గోపిరెడ్డి చిన్నఓబుళరెడ్డి పోరుమామిళ్ల వద్దనున్న సిద్దాయపల్లెకు చెందిన గురమ్మను వివాహం చేసుకోగా అమె అనారోగ్య కారణంగా గత 25 ఏళ్ల క్రితం మృతి చెందింది. అమెకు ఐదుగురు సంతానం. పిల్లల ఆలనాపాలనా కోసం ప్రొద్దుటూరు మండలంలోని కాకిరేణిపల్లెకు చెందిన సుశీలమ్మను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం కాగా ఆడపిల్ల చిన్నప్పుడే మృతి చెందగా ఒక్కగానొక్క కూమారుడు రమణారెడ్డి ప్రొద్దుటూరులో బట్టల దుకాణం నిర్వహిస్తున్నాడు. కుమారున్ని చూసేందుకు ప్రొద్దుటూరుకు వెళ్లి తిరిగి వస్తుండగా సుశీలమ్మ మృత్యుపాలయ్యారు.  
 
 మిన్నంటిన రోదనలు
 ప్రొద్దుటూరు క్రైం, న్యూస్‌లైన్: ప్రొద్దుటూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి ప్రాంగణం మృతుల బంధువుల రోదనలతో హోరెత్తింది. దువ్వూరు మండలంలోని క్రీస్తురాజపురం గ్రామ సమీపంలో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు.

 
  వీరిలో ఐదుగురు సంఘటనా స్థలంలో మృతి చెందగా సుశీలమ్మ, పాపయ్యలు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. తీవ్రగాయాలైన ఇరగంరెడ్డి రామేశ్వరిని మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలిస్తుండగా గురువారం మృతి చెందింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. ఫ్రీజర్ బాక్స్‌లో నాలుగు మృతదేహాలను మాత్రమే పెట్టడానికి అవకాశం ఉన్నందున మిగతా వాటిని బయటనే ఉంచారు. మృతుల బంధువులు ఒకరినొకరు పట్టుకొని విలపించసాగారు. పోస్టుమార్టం అనంతరం గురువారం మధ్యాహ్నం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు.
 
 పరామర్శించిన వైఎస్సార్‌సీపీ నాయకులు
 మైదుకూరు నియోజక వర్గ వైఎస్సార్‌సీపీ నాయకుడు శెట్టిపల్లె నాగిరెడ్డి, యూత్‌కన్వీనర్ ఓబుళరెడ్డి, రైతువిభాగం అధ్యక్షుడు మల్లారెడ్డి, ఇరగంరెడ్డి శంకర్‌రెడ్డి, పద్మనాభరెడ్డిలతో పాటు పలువురు  గురువారం ఉదయం జిల్లా ఆస్పత్రి వద్దకు చేరుకొని మృతదేహాలను సందర్శించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement