ప్రొద్దుటూరు టౌన్, న్యూస్‌లైన్: మున్సిపల్, ప్రభుత్వ పాఠశాలల్లో వంట గదుల నిర్మాణం కోసం మూడేళ్ల కిందట అంచనాలు వేసి ప్రస్తుతం నిర్మిస్తుండటంతో నిధుల కొరత ఏర్పడి వంట గదులు జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో 16 పాఠశాలల్లో, మండల పరిధిలో 29 వంట గదులు, రాజుపాళెం మండల పరిధిలో 19 వంట గదుల నిర్మాణానికి జీఓ ఎంఎస్ నెంబర్ 821 ప్రకారం 2011 నవంబర్ 15న అంచనాలను రూపొందించారు. దీని ప్రకారం ఒక్కో వంట గది నిర్మాణానికి రూ.75వేలు కేటాయించారు.
అయితే వంట గదుల నిర్మాణాన్ని అప్పట్లో ఎవ్వరు చేపట్టకపోవడంతో చాలా కాలంగా నిలిచిపోయాయి. కొంత కాలానికి సర్వశిక్షా అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) అధికారులు కూడా నిర్మాణాన్ని తక్కువ ధరకు చేయలేమని చేతులెత్తేశారు. దీంతో ఈ పనులను 2012 డిసెంబర్ 12న అప్పటి జిల్లా కలెక్టర్ అనిల్‌కుమార్ ఆదేశాలతో పంచాయతీ రాజ్ శాఖకు కేటాయించారు. అయితే పంచాయతీ రాజ్ అధికారులు కూడా పెరిగిన ధరలకు అనుగుణంగా అంచనాలను రూపొందించాలంటూ నివేదికలు పంపినా అవి ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
వంట గదులు లేక అవస్థలు
మున్సిపాలిటీ, ప్రభుత్వ పాఠశాలల్లో వంట గదులు లేకపోవడంతో వంట ఏజెన్సీ నిర్వాహకులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నేటికీ పాఠశాలల్లోని చెట్ల కింద కట్టెల పొయ్యితో వంట చేస్తున్నారు. ఈ విధంగా ఆరుబయట వర్షాకాలంలో వంట చేయడానికి పడుతున్న ఇబ్బందులపై పత్రికల్లో కథనాలు రావడంతో అధికారులపై ఒత్తిడి పెరిగింది.
ఎట్టకేలకు తక్కువ డబ్బుతోనే పనులు ప్రారంభం
దీంతో పంచాయతీ అధికారులు ఉన్న డబ్బుతోనే వంటగది నిర్మాణ పనులు మొదలుపెట్టారు. స్టీల్, సిమెంట్ ఇతర వాటి ధర పెరిగిపోవడంతో పనులు పూర్తికాకుండా నిలిచిపోయాయి. ప్రస్తుతం వంట గదికి వరండా, పూతలు, నీటి సరఫరా, ఫ్లోరింగ్ పనులు నిలిచిపోయాయి. ఈ పనులు పూర్తి చేయాలంటే ఒక్కో వంట గదికి అదనంగా రూ.30 నుంచి రూ.35వేలు నగదు అవసరం. దీనిపై జిల్లా కలెక్టర్‌కు పంచాయతీ అధికారులు నివేదికలు పంపినా నిధులు మంజూరుపై ఎలాంటి ప్రక్రియ జరగలేదు. దీంతో పంచాయతీ అధికారులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
పాఠశాలల్లోని ఉపాధ్యాయులు వంట గదులు పూర్తి చేయాలంటూ పంచాయతీ అధికారులపై ఒత్తిడి తెస్తుండటంతో ఏమి చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. పాఠశాలలో అత్యవసరమైన వంట గది నిర్మాణంపై జిల్లా కలెక్టర్‌కానీ, ఎస్‌ఎస్‌ఏ అధికారులు కానీ దృష్టి సారించకపోవడం విచారకరం. పాఠశాలల్లో గదులు ఉన్నా అదనపు గదుల కోసం లక్షల రూపాయల నిధులను ఎస్‌ఎస్‌ఏ మంజూరు చేస్తున్నా వంట గది నిర్మాణానికి కావలసిన నిధులపై ఎందుకు దృష్టి సారించడం లేదన్నది ప్రశ్నగా నిలుస్తోంది.
నిధులు లేకనే పనులు ఆపేశాం
వంట గదుల నిర్మాణానికి నిధులు తక్కువ కావడంతో పనులు ఆగిపోయాయని పంచాయతీ రాజ్ శాఖ డీఈ లక్ష్మిరెడ్డి తెలిపారు. ఒక్కో వంట గదికి అదనంగా రూ.30వేలు కావాలి, 2011 అంచనా ప్రకారం గదులకు నిధులు మంజూరు కావడంతోనే పెరిగిన వస్తువుల ధరలతో నిర్మాణ వ్యయం ఎక్కువైందన్నారు. పంచాయతీ పరిధిలో ఉన్న వంట గదులకు పంచాయతీ అధికారులను, మున్సిపాలిటీ పరిధిలోని వంట గదులను పూర్తి చేసేందుకు మున్సిపల్ అధికారులకు లేఖలు రాస్తున్నామని తెలిపారు. వారు నిధులు ఇస్తే వెంటనే పనులు ప్రారంభించి పూర్తి చేస్తామన్నారు.
వండేదెట్టా..!
Published Wed, Feb 5 2014 2:24 AM | Last Updated on Fri, Jul 26 2019 6:25 PM
Advertisement
Advertisement