ప్రొద్దుటూరు, న్యూస్‌లైన్: ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అమృత హస్తం పథకం అమలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నాసిరకమైన బియ్యంతో వండిన అన్నాన్ని తాము తినలేమని గర్భిణులు, బాలింతలు స్వయంగా ఫిర్యాదు చేస్తున్నారు. ఈ భోజనం కోసం కూలి పనులను పోగొట్టుకోలేమని యధావిధిగా టేక్ హోమ్ రేషన్ ఇవ్వాలని కోరుతున్నారు. దీంతో పథకం అమలు కార్యకర్తలకు సవాల్‌గా మారింది.
ఓ వైపు అధికారులు ఏది ఏమైనా పథకాన్ని అమలు చేయాల్సిందేనని కార్యకర్తలను ఆదేశిస్తుండగా మరో వైపు ఆచరణలో పలు రకాల సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ముద్దనూరు, బద్వేలు, పోరుమామిళ్ల, రాయచోటి, లక్కిరెడ్డిపల్లె ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఈ పథకం అమలవుతుండగా ఈనెల 1వ తేదీ నుంచి ప్రొద్దుటూరు రూరల్‌ప్రాజెక్టుతోపాటు పులివెందుల పరిధిలో అమృత హస్తం పథకాన్ని అమలు చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే అధికారులు చెప్పినట్లు ఈ పథకం నిర్వహణలో ఇందిరాక్రాంతిపథం మహిళలు ఎక్కడా ఇప్పటి వరకు పాలుపంచుకోవడం లేదు. తమకు అటువంటి ఆదేశాలు అందలేదని సంబంధిత అధికారులు అంటున్నారు. అధికారుల ఒత్తిడి మేరకు స్వయంగా తామే కూరగాయలు, పాలు కొనుగోలు చేసి పథకాన్ని నడుపుతున్నామని, ఎలాగోలా ఈనెలాఖరు వరకు మాత్రమే ఈ విధంగా చేయగలమని అంతకుమించి చేసే ఆర్థిక స్తోమత తమకు లేదని కార్యకర్తలు తేల్చిచెబుతున్నారు. ప్రస్తుతం అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్న బియ్యం నాసిరకంగా ఉండటంతో గర్భవతులు, బాలింతలు భోజనం చేయడానికి ఇష్టపడటం లేదు.
చాపాడు మండలం ఖాదర్‌పల్లె గ్రామంలోని గర్భిణులు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. రోజూ కూలికి వెళితే గానీ తమ జీవనం కష్టమని, ఈ నాసిరకం భోజనం కోసం పనులు పోగొట్టుకోలేమని మరికొందరు తెలుపుతున్నారు. అధికారులు చెప్పినాఆర్థిక పరిస్థితుల కారణంగా చాలా చోట్ల కార్యకర్తలు పాలు పంపిణీ చేయడం లేదు. కేవలం భోజనం వడ్డిస్తున్నారు. మరో వైపు పౌష్టికాహారానికి సంబంధించి ప్రధానమైన గుడ్ల సరఫరాలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అమృత హస్తం పథకంలో భాగంగా ప్రతి రోజు గుడ్డు ఉడికించి వడ్డించాల్సి ఉంది.
అయితే ప్రొద్దుటూరు ప్రాజెక్టు పరిధిలో ఎక్కడా ప్రస్తుతం గుడ్లు లేవు. సుమారు రెండు వారాలుగా తమకు గుడ్లు అందలేదని మైదుకూరు సెక్టార్ పరిధిలోని కార్యకర్తలు తెలుపుతున్నారు. ప్రొద్దుటూరులో అర్బన్ ప్రాజెక్టు కింద 196, రూరల్ ప్రాజెక్టు పరిధిలో 56 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. రూరల్ ప్రాజెక్టులో అమృత హస్తం పథకం అమలు చేయడానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అర్బన్ ప్రాజెక్టు పరిధిలో టేక్ హోం రేషన్ ఇస్తున్నారు కదా మీరు ఎందుకు ఇక్కడే తినమంటున్నారని కార్యకర్తలను లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. దీంతో ఈ పథకం అమలు చేయలేమని ఇప్పటికే కార్యకర్తలు అధికారులకు లేఖలు సమర్పించారు.
ఈ భోజనం మాకొద్దు
Published Fri, Dec 27 2013 3:19 AM | Last Updated on Sat, Sep 2 2017 1:59 AM
Advertisement