గొంతెండుతున్న పల్లెలు | water problems | Sakshi
Sakshi News home page

గొంతెండుతున్న పల్లెలు

Published Wed, Feb 18 2015 1:30 AM | Last Updated on Wed, Sep 5 2018 3:44 PM

గొంతెండుతున్న పల్లెలు - Sakshi

గొంతెండుతున్న పల్లెలు

అంగట్లో అన్నీఉన్నా అల్లుని నోట్లో శని అన్న చందంగా తయారైంది జిల్లాలోని గ్రామపంచాయతీల పరిస్థితి.రాష్ట్రప్రభుత్వ నిర్వాకం కారణంగా పంచాయతీలు సొంత నిధులను సైతం వాడుకోలేని దుస్థితి నెలకొంది. ఫలితంగా గ్రామాల్లో జనం తాగునీటి ఎద్దడితో అల్లాడుతున్నారు. వీధి దీపాలు వెలగక చీకటిలో ఇబ్బందులు పడుతున్నారు. చిన్నచిన్న మరమ్మతు పనులు కూడా చేసుకునే పరిస్థితిలేక సర్పంచులు చేతులెత్తేశారు.
 
 ప్రొద్దుటూరు: నగదు చెల్లింపులపై ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో ఏర్పడిన ఇబ్బంది పంచాయతీలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది వేసవి కంటే ముందుగానే గ్రామాల్లో తలెత్తిన తాగునీటి సమస్య భయపెడుతోంది. నిధుల లేమి ఫలితంగా సర్పంచ్‌లు చర్యలు తీసుకోలేకపోవడంతో సమస్య రోజురోజుకు తీవ్రమవుతోంది. జిల్లాలో మొత్తం 761 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.
 
 వీటికి సంబంధించి నవంబర్‌లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రధాన వనరుగా ఉన్న  13వ ఆర్థిక సంఘం నిధులు మంజూరయ్యాయి. వాటితో అభివద్ధి పనులు చేపట్టాలని సర్పంచ్‌లు భావించేలోపే విద్యుత్ బిల్లులకు సంబంధించి ట్రెజరీలో ఆంక్షలు విధించారు. విద్యుత్ బకాయిలు చెల్లించే వరకు నిధులు విడుదల చేయవద్దని డీపీఓ అపూర్వ సుందరి ఏకంగా ట్రెజరీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో సుమారు రెండు నెలలపాటు ఈ సమస్య వెంటాడగా చివరికి సర్పంచులు అంగీకరించడంతో పరిష్కారమైంది.
 
 ఇక ఏ ఇబ్బందులు ఉండవు త్వరత్వరగా పనులు చేయాలనుకునే సమయంలో రాష్ట్రప్రభుత్వం గత నెల 27 నుంచి ఎలాంటి బిల్లులు చెల్లించవద్దని జారీ చేసిన ఉత్తర్వులు గ్రామ పంచాయతీలకు గుదిబండగా మారాయి. కరువు పరిస్థితుల నేపథ్యంలో నదీపరివాహక గ్రామాల్లో సైతం అప్పుడే తాగునీటి సమస్య మొదలైంది. తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు చొరవ చూపాలన్నా సర్పంచుల చేతిలో చిల్లిగవ్వలేని పరిస్థితి నెలకొంది.
 
 ప్రొద్దుటూరు మండలం గోపవరం, కొత్తపల్లె, సోములవారిపల్లె గ్రామ పంచాయతీలు మేజర్ పంచాయతీల జాబితాలో ఉన్నాయి. ఇప్పటికే ఈ గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తింది. గోపవరం గ్రామ పంచాయతీకి సంబంధించి ఉన్న 8 బోర్లల్లో రెండు బోర్లు పూర్తిగా ఎండిపోగా మరో రెండింటిలో అంతంత మాత్రమే నీరు వస్తోంది. దీంతో 2 రోజులకోమారు నీరు సరఫరా చేస్తున్నారు. ఇప్పటికే చేసిన పనులకు సైతం లక్షల రూపాయల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో కాంట్రాక్టర్లు ముందుకు వచ్చే పరిస్థితి లేదు. అలాగే కొత్తపల్లె గ్రామ పంచాయతీకి సంబంధించి మరింత పెద్ద మొత్తంలో నిధులు విడుదల  రావాల్సి ఉంది. ఇటీవల తాగునీటి సమస్య పరిష్కారం కోసం కొత్తగా ఉపసర్పంచ్ గురుస్వామి బోర్లతోపాటు పైపులైన్ వేశారు. పనులు చేసి ప్రస్తుతం రోజూ నిధుల కోసం రోజు ట్రెజరీ చుట్టు తిరుగుతున్నారు. సోములవారిపల్లె గ్రామ పంచాయతీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. వీరికి  ప్రభుత్వ నిధులే ఆధారం.
 కేంద్ర ప్రభుత్వ నిధులపై పెత్తనం తగదు గ్రామ పంచాయతీలకు విడుదలైన టీఎఫ్‌సీ నిధులపై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడం విచారకరం. ఇలా అయితే ఆర్థిక వనరులు లేని గ్రామ పంచాయతీల పరిస్థితి ఏమిటి. కుళాయి బిగించాలన్నా డబ్బు లేకపోవడం సర్పంచ్‌లను ఆందోళనకు గురిచేసే అంశం.
 - మోపూరి ప్రశాంతి, సర్పంచ్, సోములవారిపల్లె గ్రామ పంచాయతీ
 
 ఎప్పుడు విడుదల చేస్తారో చెప్పడం లేదు
 గత నెల నుంచి ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా నిలిపేసింది. కనీసం ఎప్పుడు నిషేధం ఎత్తివేస్తారో కూడా ప్రభుత్వం ప్రకటించలేదు. దీంతో ఆర్థికంగా సర్పంచ్‌లు చాలా ఇబ్బందులు పడుతున్నారు.
  - కే.దేవీ ప్రసాదరెడ్డి, సర్పంచ్, గోపవరం గ్రామ పంచాయతీ
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement