గుడ్డూ లేదు.. ఫుడ్డూ లేదు
ఈమె పేరు ఎ.ప్రసన్నకుమారి. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని రామేశ్వరంలో ఉన్న 33వ ఎస్సీ అంగన్‌వాడీ కేంద్రంలో బాలింతగా పేరు నమోదు చేసుకుంది. నిబంధనల ప్రకారం ప్రతి రోజు ఆమెకు గుడ్డుతో కూడిన భోజనాన్ని అంగన్‌వాడీ కేంద్రంలో ఏర్పాటు చేయాలి. అయితే గత నెల 21వ తేదీ నుంచి అంగన్‌వాడీ కేంద్రంలో భోజనం పెట్టకుండా నిలిపేశారు. ఇదిలావుండగా 30వ తేదీ నుంచి గుడ్డు కూడా ఇవ్వడం లేదు.
- ఎ.ప్రసన్న కుమారి
ప్రొద్దుటూరు: అమృత హస్తం పథకం లక్ష్యం నీరుగారిపోతోంది. అంగన్‌వాడీ కేంద్రాలకు సంబంధించి బియ్యంతోపాటు గుడ్ల సరఫరా నిలిచిపోవడమే దీనికి కారణం. సరైన పోషణ అందనట్లయితే గర్భస్థ దశ నుండే శిశువులో పోషకాహార లోపం మొదలై బిడ్డ పుట్టిన తర్వాత ఆ ప్రభావం ఎదుగుదలపై ఉండకూడదన్న లక్ష్యంతో ప్రభుత్వం అమృత హస్తం పథకాన్ని ఏర్పాటు చేసింది. మొదటి విడతగా 2012 డిసెంబర్ 1, రెండో విడత 2013 డిసెంబర్ నెల నుంచి జిల్లాలో అమృత హస్తం పథకం అమలు చేశారు. నిబంధనల ప్రకారం గర్భవతి అయిన మూడో నెల నుంచి 6వ నెల బాలింత వరకు అంగన్‌వాడీ కేంద్రంలో భోజనం ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రస్తుతం ప్రొద్దుటూరు రూరల్, పులివెందుల, ముద్దనూరు, లక్కిరెడ్డిపల్లె, రాయచోటి, పోరుమామిళ్ల, బద్వేలు ఐసీడీఎస్ ప్రాజెక్టులలో పథకం అమలవుతోంది.
ఆగిన బియ్యం సరఫరా...
గత నెల రోజులుగా జిల్లా అంతటా బియ్యం సరఫరా నిలిచిపోయింది. అలాగే గుడ్ల సరఫరాలో కూడా జాప్యం జరుగుతోంది. కేవలం పాలు మాత్రమే సరఫరా చేస్తున్నారు. దీంతో అంగన్‌వాడీ కేంద్రంలోని లబ్ధిదారులు పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రభావంతో అంగన్‌వాడీ కేంద్రాలు మధ్యాహ్నానికే మూతపడుతున్నాయి. అమృత హస్తం మినహా జిల్లాలో మరో 7 ప్రాజెక్టులు ఉండగా అన్నింటిలో 3-6 ఏళ్లలోపు పిల్లలకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. అయితే బియ్యం కొరత కారణంగా ఈ అంగన్‌వాడీ కేంద్రాల్లో కూడా భోజనం పెట్టడం లేదు. రాష్ట్ర విభజన నేపథ్యంలో గత నవంబర్ నుంచి బాలామృతం సరఫరా ఆగిపోయింది. ప్రత్యామ్నాయంగా బియ్యం, గుడ్లు, ఇతర వస్తువులు అందించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా ఇంత వరకు జిల్లాకు బియ్యం కేటాయించలేదు.
సరఫరా లేకపోవడంతోనే...
అంగన్‌వాడీ కేంద్రాలకు బియ్యం పై నుంచి సరఫరా కాలేదు. అన్ని చోట్లా ఇదే పరిస్థితి ఉంది. దీంతో అమృత హస్తం అమలుకు సమస్యలు ఏర్పడుతున్నాయి. వచ్చిన వెంటనే సరఫరా చేస్తాం. గుడ్లు సరఫరా అవుతున్నాయి.
- శ్రీదేవి, సీడీపీఓ,
ప్రొద్దుటూరు రూరల్ ప్రాజెక్టు
భోజనం పెట్టలేకపోతున్నాం ..
బియ్యం సరఫరా లేకపోవడం వల్ల భోజనం పెట్టలేకపోతున్నాం. మా అంగన్‌వాడీ కేంద్రంలో 14 మంది గర్భవతులు, బాలింతలు ఉన్నారు. జనవరి 21 నుంచి వీరికి భోజనం లేదు. ప్రస్తుతం గుడ్లు కూడా లేవు.
శోభారాణి, అంగన్‌వాడీ కార్యకర్త
ఈమె పేరు గురులక్ష్మి. ప్రొద్దుటూరు మండలంలోని ఈశ్వరరెడ్డినగర్ 3వ అంగన్‌వాడీ కేంద్రంలో గర్భవతిగా పేరు నమోదు చేసుకుంది. అయితే ప్రస్తుతం ఈమెకు అంగన్‌వాడీ కేంద్రంలో మధ్యాహ్న భోజనం పెట్టకుండా ఆపేశారు. కారణం బియ్యం లేకపోవడమేనని అంగన్‌వాడీ కార్యకర్త చెప్పార ని వాపోతోంది.
గురులక్ష్మి