aganvadi centres
-
గుడ్డూ లేదు.. ఫుడ్డూ లేదు
ఈమె పేరు ఎ.ప్రసన్నకుమారి. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని రామేశ్వరంలో ఉన్న 33వ ఎస్సీ అంగన్వాడీ కేంద్రంలో బాలింతగా పేరు నమోదు చేసుకుంది. నిబంధనల ప్రకారం ప్రతి రోజు ఆమెకు గుడ్డుతో కూడిన భోజనాన్ని అంగన్వాడీ కేంద్రంలో ఏర్పాటు చేయాలి. అయితే గత నెల 21వ తేదీ నుంచి అంగన్వాడీ కేంద్రంలో భోజనం పెట్టకుండా నిలిపేశారు. ఇదిలావుండగా 30వ తేదీ నుంచి గుడ్డు కూడా ఇవ్వడం లేదు. - ఎ.ప్రసన్న కుమారి ప్రొద్దుటూరు: అమృత హస్తం పథకం లక్ష్యం నీరుగారిపోతోంది. అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి బియ్యంతోపాటు గుడ్ల సరఫరా నిలిచిపోవడమే దీనికి కారణం. సరైన పోషణ అందనట్లయితే గర్భస్థ దశ నుండే శిశువులో పోషకాహార లోపం మొదలై బిడ్డ పుట్టిన తర్వాత ఆ ప్రభావం ఎదుగుదలపై ఉండకూడదన్న లక్ష్యంతో ప్రభుత్వం అమృత హస్తం పథకాన్ని ఏర్పాటు చేసింది. మొదటి విడతగా 2012 డిసెంబర్ 1, రెండో విడత 2013 డిసెంబర్ నెల నుంచి జిల్లాలో అమృత హస్తం పథకం అమలు చేశారు. నిబంధనల ప్రకారం గర్భవతి అయిన మూడో నెల నుంచి 6వ నెల బాలింత వరకు అంగన్వాడీ కేంద్రంలో భోజనం ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రస్తుతం ప్రొద్దుటూరు రూరల్, పులివెందుల, ముద్దనూరు, లక్కిరెడ్డిపల్లె, రాయచోటి, పోరుమామిళ్ల, బద్వేలు ఐసీడీఎస్ ప్రాజెక్టులలో పథకం అమలవుతోంది. ఆగిన బియ్యం సరఫరా... గత నెల రోజులుగా జిల్లా అంతటా బియ్యం సరఫరా నిలిచిపోయింది. అలాగే గుడ్ల సరఫరాలో కూడా జాప్యం జరుగుతోంది. కేవలం పాలు మాత్రమే సరఫరా చేస్తున్నారు. దీంతో అంగన్వాడీ కేంద్రంలోని లబ్ధిదారులు పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రభావంతో అంగన్వాడీ కేంద్రాలు మధ్యాహ్నానికే మూతపడుతున్నాయి. అమృత హస్తం మినహా జిల్లాలో మరో 7 ప్రాజెక్టులు ఉండగా అన్నింటిలో 3-6 ఏళ్లలోపు పిల్లలకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. అయితే బియ్యం కొరత కారణంగా ఈ అంగన్వాడీ కేంద్రాల్లో కూడా భోజనం పెట్టడం లేదు. రాష్ట్ర విభజన నేపథ్యంలో గత నవంబర్ నుంచి బాలామృతం సరఫరా ఆగిపోయింది. ప్రత్యామ్నాయంగా బియ్యం, గుడ్లు, ఇతర వస్తువులు అందించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా ఇంత వరకు జిల్లాకు బియ్యం కేటాయించలేదు. సరఫరా లేకపోవడంతోనే... అంగన్వాడీ కేంద్రాలకు బియ్యం పై నుంచి సరఫరా కాలేదు. అన్ని చోట్లా ఇదే పరిస్థితి ఉంది. దీంతో అమృత హస్తం అమలుకు సమస్యలు ఏర్పడుతున్నాయి. వచ్చిన వెంటనే సరఫరా చేస్తాం. గుడ్లు సరఫరా అవుతున్నాయి. - శ్రీదేవి, సీడీపీఓ, ప్రొద్దుటూరు రూరల్ ప్రాజెక్టు భోజనం పెట్టలేకపోతున్నాం .. బియ్యం సరఫరా లేకపోవడం వల్ల భోజనం పెట్టలేకపోతున్నాం. మా అంగన్వాడీ కేంద్రంలో 14 మంది గర్భవతులు, బాలింతలు ఉన్నారు. జనవరి 21 నుంచి వీరికి భోజనం లేదు. ప్రస్తుతం గుడ్లు కూడా లేవు. శోభారాణి, అంగన్వాడీ కార్యకర్త ఈమె పేరు గురులక్ష్మి. ప్రొద్దుటూరు మండలంలోని ఈశ్వరరెడ్డినగర్ 3వ అంగన్వాడీ కేంద్రంలో గర్భవతిగా పేరు నమోదు చేసుకుంది. అయితే ప్రస్తుతం ఈమెకు అంగన్వాడీ కేంద్రంలో మధ్యాహ్న భోజనం పెట్టకుండా ఆపేశారు. కారణం బియ్యం లేకపోవడమేనని అంగన్వాడీ కార్యకర్త చెప్పార ని వాపోతోంది. గురులక్ష్మి -
అంతులేని నిర్లక్ష్యం!
అనంతపురం జిల్లాపరిషత్తు, న్యూస్‌లైన్ : వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి (బీఆర్జీఎఫ్) ప్రణాళిక అమలులో అంతులేని నిర్లక్ష్యం కన్పిస్తోంది. బీఆర్జీఎఫ్ ప్రారంభమైన 2007-08 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2013-14) వరకు చేపట్టాల్సిన అభివృద్ధి పనుల్లో ఏకంగా 4,136 పనులు ప్రారంభమే కాలేదు. వాటి కోసం కేటాయించిన రూ.63.02 కోట్ల నిధులు ఖజానాలో మూలుగుతున్నాయి. కరువు పీడిత ప్రాంతంగా పేరొందిన ‘అనంత’కు కేంద్ర ప్రభుత్వం బీఆర్జీఎఫ్ ద్వారా ఏటా కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేస్తోంది. వీటిని జిల్లా, మండల పరిషత్‌లు, గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీలకు కోటా ప్రకారం కేటాయిస్తున్నారు. ఈ నిధులతో ప్రజలకు అత్యవసరమైన తాగునీరు, పారిశుద్ధ్య పనులు, రహదారులు, అంగన్వాడీ భవనాలు, దోబీఘాట్ల నిర్మాణం... తదితర పనులు చేపట్టడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే అసంపూర్తిగా ఉన్న కమ్యూనిటీ హాళ్లు పూర్తి చేయడానికి, రచ్చకట్టల నిర్మాణం, పైకా క్రీడల నిర్వహణ, నెడ్‌క్యాప్, వ్యవసాయ... అనుబంధ శాఖలు, సంక్షేమ, విద్య, వైద్య శాఖల పరిధిలోని చిన్న చిన్న పనులు పూర్తి చేయడానికి బీఆర్జీఎఫ్ నిధులు ఖర్చు చేస్తున్నారు. ప్రతియేటా వేలాది పనులను గ్రామసభల ద్వారా గుర్తించి జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీ, జిల్లా ప్రణాళిక సంఘం (డీపీసీ) ఆమోదంతో చేపడుతున్నారు. జిల్లాలో బీఆర్జీఎఫ్ తొలి పంచవర్ష ప్రణాళిక 2007-08 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభమై 2011-12లో ముగిసింది. అప్పుడు జిల్లా, మండల పరిషత్‌లకు పాలకవర్గాలు ఉండటంతో మొదటి ఐదేళ్ల ప్రణాళిక సవ్యంగా అమలైనట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. తొలి ఐదేళ్లలో 17,044 పనులు చేపట్టడానికి వీలుగా రూ.156.41 కోట్లు కేటాయించారు. ఇందులో రూ.146.02 కోట్లు వ్యయం చేసి 15,830 పనులు చేపట్టారు. ఇలా మొదటి ఐదేళ్ల ప్రణాళిక ఆశించిన ఫలితాలు ఇవ్వడంతో 2012-13 ఆర్థిక సంవత్సరం నుంచి 2016-17 వరకు మరో ఐదేళ్ల పాటు ప్రణాళిక అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. అయితే.. జిల్లా, మండల పరిషత్‌లకు పాలకవర్గాలు లేకపోవడంతో బీఆర్జీఎఫ్ అమలుకు బ్రేక్ పడింది. గుర్తించిన పనులు కాగితాలకే పరిమితమయ్యాయి. 2012-13లో 2,535 పనులు గుర్తించి... రూ.37.12 కోట్లు కేటాయించారు. అందులో 1,446 పనులను ప్రారంభించి, 279 మాత్రమే పూర్తి చేశారు. వాటి కోసం రూ.11.89 కోట్లు ఖర్చు చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పరిస్థితి మరీ దారుణం. రూ.27.39 కోట్లతో 1,833 పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో తాగునీటి పనులు 594, రహదారులు 390, పారిశుద్ధ్య పనులు 351, సంక్షేమ శాఖల పరిధిలో 138, గ్రామ పంచాయతీ భవనాలకు సంబంధించి 76, విద్యాశాఖ పరిధిలో 58 పనులు, 39 దోబీఘాట్లు, 32 కల్వర్టులు, 26 కమ్యూనిటీ భవనాల పనులున్నాయి. ఇందులో ఇప్పటిదాకా ఒక్కటి కూడా ప్రారంభించిన దాఖలాలు లేవు. మొత్తమ్మీద తొలి ఐదేళ్లతో పాటు గత రెండేళ్ల ప్రణాళికను లెక్కలోకి తీసుకుంటే ఏడేళ్ల కాలంలో గ్రామసభల ద్వారా 21,412 అభివృద్ధి పనులను గుర్తించారు. వాటికి రూ.220.93 కోట్లు కేటాయించారు. 17,276 పనులను ప్రారంభించి.. 15,800 పూర్తి చేశారు. 1,476 పనులు వివిధ దశల్లో ఉన్నాయి. 4,136 ప్రారంభానికి కూడా నోచుకోలేదు. బడ్జెట్ విషయానికొస్తే మొత్తంగా రూ.220.93 కోట్లు కేటాయించారు. పూర్తయిన పనులకు సంబంధించి రూ.157.91 కోట్లు వ్యయం చేశారు. తక్కిన రూ.63.02 కోట్లు ఖజానాలో మూలుగుతున్నాయి. -
ఆ సొమ్ములేం చేస్తరో..!
కొన్నింటికి నిధులు లేక ఇక్కట్లు. మరికొన్ని పనులకు సొమ్ములు ఉన్నా అధికారుల ధోరణి వింతగా ఉంటుంది. అవి ఏ పద్దుకింద వచ్చిందో..దాని ఉద్దేశమేమిటో అధ్యయనం చేయరు. ఫలితంగా నిధులు మూలుగుతుంటాయి. ప్రగతి పనులు ఆగుతుంటాయి. ఇదే పరిస్థితి ఇప్పుడు ‘బీఆర్జీఎఫ్’ కు ఎదురైంది. దీనికింద జిల్లాకు భారీగానే కేటాయింపులు జరుగుతున్న దాని ఖర్చుకు యంత్రాంగం వెనకడుగు వేస్తోంది. అభివృద్ధికి ఆటంకమవుతున్నా మీనమేషాలు లెక్కిస్తోంది. పాలమూరు, న్యూస్‌లైన్ : జిల్లాపరిషత్, గ్రామపంచాయతీ, మున్సిపాలిటీల పరిధిలోని వెనుకబడిన ప్రాంతాల్లోని ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం నిధుల వరద ప్రకటించిందని ఆనందం వ్యక్తమైనా ఆ సొమ్ములు ఖర్చుచేయక పోవడంతో అభివృద్ధి సాగడంలేదు. బీఆర్జీఎఫ్ కింద 2011-12లో సుమారు రూ.30 కోట్లు విడుదలయ్యాయి. రాష్ట్ర హైపవర్ కమిటీ చేసిన సిఫారసు మేరకు కేంద్రం 2017 వరకు ఈ పథకాన్ని కొనసాగిస్తారు. ఇలా బీఆర్జీఎఫ్ రెండో విడత 2012-13 నుంచి 2016-17 వరకు అమలవుతుంది. తొలి విడత 2007-12 వరకు సుమారు రూ.155 కోట్లకు పైగా నిధులు జిల్లాకు సమకూరాయి. పెరిగిన జనాభా ప్రకారం రెండో విడతలో ఏడాదికి రూ.35 కోట్లకు పైగా కేటాయించారు. ఇందుకుగాను 2012-13 ఆర్థిక సంవత్సరానికి రూ.35కోట్లు మంజూరయ్యాయి. ఇందుకు సంబంధించిన పనులు చేపట్టడంలో సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహిస్తుండటం ఇబ్బందిగా మారింది. బీఆర్జీఎఫ్ నిధులతో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి జిల్లా వ్యాప్తంగా 2,800 వరకు పనులు మంజూరుకాగా అందులో 40 శాతానికిపైగా పనులు ప్రారంభానికి నోచుకోలేదు. దీనిపై జిల్లా స్థాయి సమావేశాల్లో చర్చించడం తప్ప పనుల పురోగతిపై అధికారులు దృష్టి పెట్టడం లేదు. బీఆర్జీఎఫ్ నిధులతో అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాల ప్రహ రీలు, ఆస్పత్రి భవనాలు, సామూహిక భవనాలు, రోడ్లు, మురుగు కాలువలు ఇలా వివిధ అభివృద్ధి పనులను చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు సమృద్దిగా సమకూర్చినా.. మండల స్థాయిలోని అధికారులు పనులు ప్రారంభించ కుండా ఇప్పుడూ అప్పుడూ అంటూ కాలం గడిపేస్తున్నారు. దీంతో రూ.కోట్లు బ్యాంకు ఖాతాల్లో మూలుగుతున్నాయి. 2012-13 ఆర్థిక సంవత్సరానికి చెందిన బీఆర్జీఎఫ్ నిధులు రూ.35 కోట్లు ఏడాది మధ్యలో ఇవి జిల్లాకు వచ్చి 8 నెలలు గడుస్తున్నా.. గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లాపరిషత్, మున్సిపాలిటీల పరిధిలోని ఈ నిధుల ద్వారా పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అంచనాలు రూపొందించిన అధికారులు ఖాతాల్లో ఉన్న నిధులను వినియోగించడంపై దృష్టి పెట్టడం లేదు. ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో రెండు నెలలు మాత్రమే సమయం ఉంది. ఈ తక్కువ కాలంలో పనుల పురోగతిపై అధికారులు ఎటువంటి దృష్టిపెడతారో తెలియడం లేదు. ప్రజా ప్రతినిధుల్లేకుండానే..! బీఆర్జీఎఫ్ పనులు చేపట్టేందుకు జిల్లా ప్రణాళికా కమిటీ (డీపీసీ)లను ఏర్పాటు చేశారు. డీపీసీలో ప్రణాళికలు ఆమోదం పొందిన తర్వాత రాష్ట్ర స్థాయిలో హైపవర్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఆ తర్వాతే నిధులు విడుదలవుతాయి. ప్రస్తుతం స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల పదవీకాలం ముగియడంతో ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకుండా వాయిదా వేస్తూ రావడంతో డీపీసీ లేకుండా పోయింది. జెడ్పీకి స్పెషల్ ఆఫీసర్‌గా ఉన్న కలెక్టర్ ఆమోదంతోనే బీఆర్జీఎఫ్ పథకాన్ని కొనసాగించాల్సి వస్తోంది. అయితే జిల్లాకు కెటాయిస్తున్న నిధులను సకాలంలో వినియోగించి సద్వినియోగమయ్యేలా చూడాల్సిందిగా సంబంధిత అధికారులను కలెక్టర్ హెచ్చరించినప్పటికీ పనుల పురోగతి సాధ్యపడటం లేదు. జిల్లాలో ఇలా...! జిల్లాలోని 8 మున్సిపాలిటీల పరిధిలో బీఆర్జీఎఫ్ ద్వారా 85 పనులచేపట్టేందుకు నిధులు మంజూరు చేశారు. అందులో 49 పనులను ప్రారంభించనేలేదు. మిగిలిన పనులు ఇంకా పూర్తిచేయలేదు. కేవలం మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలో 25 పనులకుగాను 21 పనులు ప్రారంభించలేదు. కొల్లాపూర్ 7, నారాయణపేట 6, జడ్చర్ల, షాద్‌నగర్‌లలో అయిదు పనుల చొప్పున ప్రారంభానికి నోచుకోలేదు. గ్రామపంచాయతీల పరిధిలో 1650 పనులకు గాను 1100 వరకు పనులు చేపట్టగా.. మిగిలిన పనులపై సంబంధిత విభాగాలు దృష్టి పెట్టాల్సి ఉంది. మండల పరిషత్ పరిధిలోనూ అదే పరిస్థితి నెలకొంది. రూ.9.69 కోట్లతో 660 పనులను చేపట్టాలని నిర్ణయించగా.. అందులో సగమే పూర్తయ్యాయి. జిల్లా ప్రజాపరిషత్ పరిధిలో రూ.6.64 కోట్లతో మొత్తం 278 పనులను కేటాయించగా.. అందులో 107 పనులను మాత్రమే చేపట్టారు. -
పౌష్టికాహారాం..రాం
అనంతపురం టౌన్, న్యూస్‌లైన్ : అంగన్వాడీ పోస్టుల భర్తీలో రాజకీయ జోక్యం మితిమీరిపోతుండడంతో వ్యవస్థ గాడి తప్పుతోంది. లక్షలు వెచ్చించి దొడ్డిదారిన పోస్టులు చేజిక్కించుకున్న వారు తొలి నుంచే నాలుగురాళ్లు వెనుకేసుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. దీంతో గర్భవతులు, పిల్లలు, బాలింతలకు అందాల్సిన పౌష్టికాహారం పక్కదారి పడుతోంది. ఫలితంగా పౌష్టికాహార లోపంతో మాతాశిశు మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. 2013లో జిల్లా వ్యాప్తంగా 14 మంది శిశువులు మరణించారని అధికారులు చెబుతున్నారు. అయితే వాస్తవంగా ఈ సంఖ్య పదింతలు ఎక్కువ ఉంటుందని అంచనా. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని 17 ప్రాజెక్టుల పరిధిలో 4286 అంగన్వాడి(మెయిన్) సెంటర్లు ఉన్నాయి, మరో 840 మినీ అంగన్వాడీ సెంటర్లు పనిచేస్తున్నాయి. ఇందులో 39,526 మంది గర్భవతులు, 38,975 మంది బాలింతలు, 2,95,991 మంది పిల్లలు ఉన్నారు. వీరందరికీ అంగన్వాడీ సెంటర్ల ద్వారా రోజూ పౌష్టికాహారం అందజేయాలి. వారంలో రెండు రోజులు ఉడికించిన కోడిగుడ్లు అందజేయాలి. ఇందిరమ్మ అమృతహస్తం పథకం అమలవుతున్న ప్రాజెక్టులో మధ్యాహ్న (ఫుల్‌మీల్స్) భోజనం అమలు చేస్తున్నారు. అయి తే ఇవి పూర్తి స్థాయిలో లబ్ధిదారుల చెంతకు చేరడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందిరమ్మ అమృతహస్తం అమలవుతున్న కణేకల్లు, కళ్యాణదుర్గం, రాయదుర్గం, హిందూపురం, మడకశిర, కంబదూరు ప్రాజెక్టులో పథకం పక్కదారి పడుతోందనే ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. నిబంధనల మేరకు అంగన్వాడీ సెంటర్లలోనే మధ్యాహ్నం భోజనం వండిపెట్టాలి. రోజూ ఒక గ్లాసు పాలు అందజేయాలి. వారంలో రెండు రోజులు కోడిగుడ్లు అందజేయాలి. ఒక్కో లబ్ధిదారురాలికి రోజుకు 125 గ్రాముల బియ్యం, 30 గ్రాముల కందిబేడలు, 16 గ్రాముల వంటనూనె చొప్పున మూడు నెలలకు సరిపడా సరుకులు ఒకేసారి ఆయా ప్రాజెక్టులకు పంపిణీ చేస్తారు. కోడిగుడ్డు, పాలు, కూరగాయలు స్థానికంగానే కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించారు. ఇందుకు సరిపడా నిధులు కూడా ఆయా సీడీపీఓల ఖాతాలో జమ చేశారు. సీడీపీఓలు సంబంధిత గ్రామైక్య సంఘం సభ్యుల ఖాతాలోకి మళ్లించి స్థానికంగానే కొనుగోలు చేయాలి. వంట చేయడానికి కట్టెల కోసం నెలకు అర్బన్ పరిధిలో రూ.200, గ్రామాల్లో రూ. 150 చెల్లిస్తారు. అయితే నిబంధనలేవీ గ్రామాల్లో అమలు కావడం లేదు. ఏపీ డెయిరీ పాలు సరఫరా చేస్తున్న ప్రాంతాల్లో మినహా మరెక్కడా గర్భవతులు, బాలింతలకు పాలు పంపిణీ చేస్తున్న దాఖలాలు లేవు. లబ్ధిదారుల సంఖ్యను బట్టి వారికి కేటాయించిన మోతాదులో కందిబేడలు, బియ్యం, నూనె వినియోగించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. కోడిగుడ్డు అందేది దైవాధీనమే.. అంగన్వాడీ సెంటర్లలో కోడిగుడ్లు లబ్ధిదారులకు అందడం దైవాధీనంగా మారుతోంది. చిత్తూరు మార్కెట్లో కోడిగుడ్డు ధర పెరిగినా, సమైక్యాంధ్ర పేరుతోనో మరే ఇతర కారణాల వలన ఆందోళనలు జరుగుతున్నాయంటే పిల్లలు, గర్భవతులు, బాలింతలు కోడిగుడ్లు మరిచిపోవాల్సిందే. గతేడాది (2013)లో దాదాపు నాలుగు నెలలపాటు లబ్ధిదారులకు కోడిగుడ్లు సరఫరా చేసిన దాఖలాలు లేవు. సమైక్యాంధ్ర ఉద్యమం రూపంలో మూడు నెలలు నిరవధిక బంద్ చేస్తే.. చిత్తూరు మార్కెట్లో కోడిగుడ్డు ధర అమాంతం పెరిగిపోయిందని మరికొన్ని రోజులు సరఫరాను నిలిపివేశారు. దీన్ని బట్టి చూస్తే కోడిగుడ్డు సరఫరా అనేది టెండర్లు దక్కించుకున్న వారి ఇష్టాఇష్టాలపైనే ఆధారపడుతోంది. వారిపై ఐసీడీఎస్ అధికారుల అజమాయిషీ లేకుండా పోతోంది. దీంతో పాటు తక్కువ సైజు పరిమాణంలో ఉన్న కోడిగుడ్లను కాంట్రాక్టర్లు సరఫరా చేస్తూ లక్షలకు లక్షలు వెనకేసుకుంటున్నారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకుపోయినా చిత్తూరు నుంచి పెద్ద సైజు కోడిగుడ్లను సరఫరా చేయడానికి ఇబ్బంది ఉంటుందని, పగిలిపోతాయని అధికారులు సాకులు చెబుతున్నారు. తక్కువ సైజు గుడ్డు ఇచ్చినా పర్వాలేదని పేర్కొంటున్నారు. అధికారుల ఆలోచనలు కాంట్రాక్టర్లు సొమ్ము చేసుకోవడానికి సహకరిస్తుండడంతో వారు ఆడిందే ఆట పాడిందే పాటగా మారుతోంది. మితిమీరుతున్న రాజకీయ జోక్యం ఐసీడీఎస్‌పై రాజకీయ జోక్యం మితిమీరిపోయింది. అంగన్వాడీ పోస్టుల విషయంలో ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయడం ద్వారా పరిపాలనాపరంగా అధికారులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. పోస్టుల భర్తీ నోటిఫికేషన్ విడుదల చేసినప్పటి నుంచి భర్తీ వరకూ వారి మాటే చెల్లుబాటు కావాలి. కాదూ కూడదంటే నోటిఫికేషన్ విడుదల చేసిన స్థానం ఎన్నేళ్లయినా సస్పెన్స్‌లోనే ఉండాలి. గతేడాదిలో విడుదల చేసిన నోటిఫికేషన్లో ఇలా దాదాపు 60 పోస్టుల వరకూ ఆగిపోయాయి. ఇది కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న ప్రాంతాలు కావడం గమనార్హం. 2012లో కొత్తగా 911 కార్యకర్తలు, 555 మినీ అంగన్వాడీ కార్యకర్తలు, 987 ఆయా పోస్టులను భర్తీ చేశారు. అష్టకష్టాలు పడి జిల్లా వ్యాప్తంగా అన్ని స్థానాలలో అభ్యర్థులను నియమించినా కదిరి, పుట్టపర్తి డివిజన్లలో మాత్రం భర్తీ చేయలేక పోతున్నారు. తమ వారిని తప్ప వేరెవరినీ ఆ పోస్టుల్లో నియమించడానికి వీల్లేదని స్థానిక ఎమ్మెల్యేలు భీష్మించుకొని కూర్చోవడంతో దాదాపు 60 పోస్టులు వెనక్కుపోయే దశలో ఉన్నాయి. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు చెప్పిన వారే పోస్టుల్లో ఉండాలి. లేదంటే ఇదే పరిస్థితి ఉంటుంది. కార్యాలయంలో ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్లో పనిచేసే కొందరు అధికారులు, ఎమ్మెల్యేల అనుచరులు కుమ్మక్కై అభ్యర్థుల నుంచి లక్షల్లో వసూలు చేస్తున్నారనే ఆరోపణలు మొదటి నుంచి వినపడుతున్నాయి. వారు డబ్బులు తీసుకున్న అభ్యర్థులను సీట్లో కూర్చోబెట్టే వరకు వదలక పోవడంతో అభ్యర్థుల ఎంపిక ఉన్నతాధికారులకు తలనొప్పిగా మారుతోంది. ఈ వ్యవస్థ మారనంత వరకు అంగన్వాడీ వ్యవస్థ బలోపేతం కాదని... మాతాశిశు మరణాలను పూర్తి స్థాయిలో అరికట్టలేమని ఉన్నతాధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంగన్వాడీ వ్యవస్థ బలోపేతానికి కృషి అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చెయాల్సిన అవసరం ఉంది. ఇందిరమ్మ అమృతహస్తం పథకం అమలవుతున్న ప్రాజెక్టులలో కొన్ని ఇబ్బందులున్నాయి. ముఖ్యంగా పాలు సరఫరా కావడం లేదని ఎక్కువ శాతం ఫిర్యాదులు వస్తున్నాయి. జనవరి నుంచి ఏపీ డెయిరీ ద్వారానే అన్ని కేంద్రాలకూ పాలు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం నడుస్తున్న ఆరు ప్రాజెక్టులతో పాటు కదిరి ఈస్ట్, కదిరి వెస్ట్, పెనుకొండ, గుత్తి ప్రాజెక్టులలో జనవరి నుంచి అమలు చేస్తాం. - జుబేదాబేగం, పీడీ, ఐసీడీఎస్ -
ఈ భోజనం మాకొద్దు
ప్రొద్దుటూరు, న్యూస్‌లైన్: ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అమృత హస్తం పథకం అమలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నాసిరకమైన బియ్యంతో వండిన అన్నాన్ని తాము తినలేమని గర్భిణులు, బాలింతలు స్వయంగా ఫిర్యాదు చేస్తున్నారు. ఈ భోజనం కోసం కూలి పనులను పోగొట్టుకోలేమని యధావిధిగా టేక్ హోమ్ రేషన్ ఇవ్వాలని కోరుతున్నారు. దీంతో పథకం అమలు కార్యకర్తలకు సవాల్‌గా మారింది. ఓ వైపు అధికారులు ఏది ఏమైనా పథకాన్ని అమలు చేయాల్సిందేనని కార్యకర్తలను ఆదేశిస్తుండగా మరో వైపు ఆచరణలో పలు రకాల సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ముద్దనూరు, బద్వేలు, పోరుమామిళ్ల, రాయచోటి, లక్కిరెడ్డిపల్లె ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఈ పథకం అమలవుతుండగా ఈనెల 1వ తేదీ నుంచి ప్రొద్దుటూరు రూరల్ప్రాజెక్టుతోపాటు పులివెందుల పరిధిలో అమృత హస్తం పథకాన్ని అమలు చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే అధికారులు చెప్పినట్లు ఈ పథకం నిర్వహణలో ఇందిరాక్రాంతిపథం మహిళలు ఎక్కడా ఇప్పటి వరకు పాలుపంచుకోవడం లేదు. తమకు అటువంటి ఆదేశాలు అందలేదని సంబంధిత అధికారులు అంటున్నారు. అధికారుల ఒత్తిడి మేరకు స్వయంగా తామే కూరగాయలు, పాలు కొనుగోలు చేసి పథకాన్ని నడుపుతున్నామని, ఎలాగోలా ఈనెలాఖరు వరకు మాత్రమే ఈ విధంగా చేయగలమని అంతకుమించి చేసే ఆర్థిక స్తోమత తమకు లేదని కార్యకర్తలు తేల్చిచెబుతున్నారు. ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్న బియ్యం నాసిరకంగా ఉండటంతో గర్భవతులు, బాలింతలు భోజనం చేయడానికి ఇష్టపడటం లేదు. చాపాడు మండలం ఖాదర్‌పల్లె గ్రామంలోని గర్భిణులు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. రోజూ కూలికి వెళితే గానీ తమ జీవనం కష్టమని, ఈ నాసిరకం భోజనం కోసం పనులు పోగొట్టుకోలేమని మరికొందరు తెలుపుతున్నారు. అధికారులు చెప్పినాఆర్థిక పరిస్థితుల కారణంగా చాలా చోట్ల కార్యకర్తలు పాలు పంపిణీ చేయడం లేదు. కేవలం భోజనం వడ్డిస్తున్నారు. మరో వైపు పౌష్టికాహారానికి సంబంధించి ప్రధానమైన గుడ్ల సరఫరాలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అమృత హస్తం పథకంలో భాగంగా ప్రతి రోజు గుడ్డు ఉడికించి వడ్డించాల్సి ఉంది. అయితే ప్రొద్దుటూరు ప్రాజెక్టు పరిధిలో ఎక్కడా ప్రస్తుతం గుడ్లు లేవు. సుమారు రెండు వారాలుగా తమకు గుడ్లు అందలేదని మైదుకూరు సెక్టార్ పరిధిలోని కార్యకర్తలు తెలుపుతున్నారు. ప్రొద్దుటూరులో అర్బన్ ప్రాజెక్టు కింద 196, రూరల్ ప్రాజెక్టు పరిధిలో 56 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. రూరల్ ప్రాజెక్టులో అమృత హస్తం పథకం అమలు చేయడానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అర్బన్ ప్రాజెక్టు పరిధిలో టేక్ హోం రేషన్ ఇస్తున్నారు కదా మీరు ఎందుకు ఇక్కడే తినమంటున్నారని కార్యకర్తలను లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. దీంతో ఈ పథకం అమలు చేయలేమని ఇప్పటికే కార్యకర్తలు అధికారులకు లేఖలు సమర్పించారు. -
నిర్లక్ష్యం
నిధులలేమి, ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం...వెరసి లక్షలు ఖర్చుచేసి నిర్మించిన భవనాలు కొన్ని చోట్ల అసంపూర్తిగా ఉన్నాయి. మరి కొన్నిచోట్ల ప్రారంభానికి నోచుకోక నిరుపయోగంగా ఉన్నాయి. ప్రభుత్వం, అధికారులు వీటివైపు కన్నెత్తి చూడటం లేదు. అవసరమైన నిధులు మంజూరు చేయించేందుకు చర్యలు తీసుకుంటే వీటి వల్ల ప్రజలకు ఎంతో ఉపయోగం ఉంటుంది. లేదంటే ఇలా అలంకారప్రాయంగా మిగిలిపోకతప్పదు. సాక్షి, కడప: జిల్లాలో పలుచోట్ల అంగన్వాడీ భవనాలు అర్ధంతరంగా ఆగిపోయాయి. పంచాయతీ భవనాలదీ ఇదే దారి. స్త్రీ శక్తి భవనాల పనులు మూడేళ్లుగా మందకొడిగానే సాగుతున్నాయి. కొన్నిచోట్ల స్థల సమస్య, మరికొన్నిచోట్ల నిధుల లేమితో అసంపూర్తిగా నిలిచిపోయాయి. భవనాలు పూర్తయినా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో కొన్నిచోట్ల ప్రారంభానికి నోచుకోలేదు. మొత్తం మీద ప్రజాప్రతినిధులతోపాటు అధికారులు కొద్దిమేర దృష్టి సారించి నిధులు కేటాయించి ఉంటే భవనాలెప్పుడో పూర్తయ్యేవి. స్త్రీ శక్తి భవనాల నిర్మాణం తీరు ఇదే జిల్లాలో 2010లో 50 స్త్రీ శక్తి భవనాల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. ఒక్కొక్క దానికి జాతీయ ఉపాధి హామీ పథకం కింద 25 లక్షల రూపాయల నిధులను కేటాయించారు. కేటాయించిన నిధులు సరిపోకపోవడంతో కొన్నిచోట్ల పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. 17 చోట్ల మాత్రమే పనులు పూర్తయ్యాయి. కాంట్రాక్టర్లకు అదనపు బిల్లులు చెల్లించకపోవడంతో ప్రారంభానికి నోచుకోలేదు. కలసపాడు, బద్వేలు, రైల్వేకోడూరు ప్రాంతంలో పనులు ప్రారంభ దశలోనే ఆగిపోయాయి. పెద్దముడియం, పులివెందుల, సింహాద్రిపురం, తొండూరులలో పనులు చేసేందుకు కాంట్రాక్టు ఏజెన్సీలు ముందుకు రాలేదు. లింగాలలో స్థల సమస్యతో పనులు ప్రారంభం కాలేదు. ముఖ్యంగా వీటిపైన ప్రభుత్వం, అధికారులు దృష్టి సారించకపోవడం వల్లనే ఎనిమిదిచోట్ల పనులు ఆగిపోయే దుస్థితి నెలకొంది. అయితే 50 స్త్రీ శక్తి భవనాలకుగాను 42 చోట్ల మాత్రమే ప్రారంభం కాగా, మిగిలినవి బేస్మెంట్ లెవెల్లో 2, లింటల్ లెవెల్లో 2, రూఫ్ లెవెల్లో 4, శ్లాబ్ పూర్తయినవి 9, పూర్తి స్థాయిలో నిర్మాణానికి నోచుకోనవి 8 ఉండటం గమనార్హం. పంచాయతీ భవనాలకు సంబంధించి వీటిని 2010లో ప్రారంభించినప్పటికీ ఇందులో కేవలం 141 మాత్రమే ప్రారంభమయ్యాయి. ఇందులో 97 భవనాలు పూర్తి కాగా, మిగిలినవి వివిధ దశల్లో ఆగిపోయాయి. జమ్మలమడుగు నియోజకవర్గంలోని మైలవరంలో స్త్రీ శక్తి భవన నిర్మాణం పూర్తయినా ప్రారంభానికి నోచుకోలేదు. జమ్మలమడుగులో ఆర్‌డబ్ల్యుఎస్ భవన నిర్మాణాల పనులు నత్తనడకన సాగుతున్నాయి. పలుచోట్ల అంగన్వాడీ భవనాలు అసంపూర్తిగానే ఉన్నాయి. బద్వేలు నియోజకవర్గంలో దాదాపు ఏడు మండలాల్లో స్త్రీ శక్తి భవనాలు పూర్తి కాలేదు. నియోజకవర్గంలో దాదాపు 20 పాఠశాలల అదనపు తరగతి గదుల నిర్మాణాలు అసంపూర్తిగానే నిలిచిపోయాయి. వీటి గురించి ఎస్ఎస్ఏ పట్టించుకోలేదు. కాశినాయన మండలంలో 29 పాఠశాలలకు వంట గదులు మంజూరైనా నిర్మాణానికి మాత్రం నోచుకోలేదు. రైల్వేకోడూరులో పలుచోట్ల అంగన్వాడీ భవనాలు నిధుల లేమితో శ్లాబ్ వరకు పూర్తయినా అసంపూర్తిగానే ఉన్నాయి. శిలాఫలకం దశలోనే స్త్రీ శక్తి భవనం పని ఆగిపోయింది. రాయచోటిలో రూ. 3 కోట్లతో సెంట్రల్ హాస్టల్ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టినా స్థల సమస్యతో ఆగిపోయింది. సుండుపల్లెలో స్త్రీ శక్తి భవనం ప్రారంభానికి నోచుకోలేదు. రాయచోటిలో పాలిటెక్నిక్ కళాశాల భవనాలను కలెక్టర్ ప్రారంభించినా పనులు పూర్తిస్థాయిలో కాకపోవడంతో ఇంకా తలుపులు తెరుచుకోలేదు. మున్సిపల్ భవనాల పనులు నత్తనడకన సాగుతున్నాయి. కమలాపురంలో పలుచోట్ల అంగన్వాడీ భవనాలు నిర్మాణం మధ్యలోనే ఆగిపోయాయి. స్త్రీ శక్తి భవన్, షాదీఖానా పనులు పూర్తయినా ప్రారంభానికి నోచుకోలేదు. రాజంపేట నియోజకవర్గంలోని సిద్దవటం, రాజంపేటలలో స్త్రీ శక్తి భవనాలు అసంపూర్తిగానే ఉన్నాయి. రాజంపేటలో గ్రంథాలయం, కొత్త మాధవరం, ఒంటిమిట్టలో పాఠశాల అదనపు గదుల నిర్మాణాలు అసంపూర్తిగానే నిలిచిపోవడం గమనార్హం. పులివెందుల నియోజకవర్గంలో స్త్రీ శక్తి భవనాల పనులు పలుచోట్ల ప్రారంభానికి నోచుకోలేదు. ఇలా జిల్లా వ్యాప్తంగా వందలాది సంఖ్యలో భవనాల పనులు ప్రారంభమైనప్పటికీ పూర్తి కాకుండానే అసంపూర్తిగా నిలిచిపోయి కోట్లాది రూపాయల నిధులు నిరుపయోగంగా మారాయి. -
అన్నం మీది.. పప్పు మాది
పెద్దపల్లి, న్యూస్‌లైన్ : అంగన్వాడీవాడీ కేంద్రాల్లో పిల్లల కడుపులు మాడుతున్నాయి. రెండు నెలలుగా బియ్యం సరఫరా లేక చిన్నారలకు పౌష్టికారం అందడంలేదు. ఈ దుస్థితి పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో రెండు నెలలుగా కొనసాగుతోంది. ఈ మూడు ప్రాజెక్టుల పరిధిలో ఉన్న సుమారు ఆరువందల కేంద్రాలకు బియ్యం సరఫరా నిలిచిపోయింది. దీంతో పిల్లలు ఇళ్ల నుంచి అన్నం తీసుకొచ్చుకుంటే.. అంగన్వాడీ కేంద్రాల్లో పప్పు మాత్రమే వడ్డిస్తున్నారు. అసలే అంతంతమాత్రంగా నడుస్తున్న అంగన్వాడీల్లో అన్నం పెట్టకపోవడంతో పిల్లల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. జిల్లాలో మూడు వేలకు పైగా అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో ఒకపూట భోజనానికి బదులు బాలామృతం ప్యాకెట్లు ఇచ్చేందుకు శిశు సంక్షేమ శాఖ కొద్దికాలం క్రితం నిర్ణయించిన విషయం తెల్సిందే. అయితే అవి కూడా అరకొరగా సరఫరా చేస్తున్నారు. దీంతో ఇటు భోజనం.. అటు బాలామృతం( పౌష్టికాహార ప్యాకెట్లు) రెండింటికీ నోచుకోకుండా పోతున్నారు చిన్నారులు. కేంద్రాల్లో మిగులుగా ఉన్న పప్పును ఉడికించి పిల్లలు అన్నం తెచ్చుకుంటే తోడుగా వేస్తున్నారు. కేంద్రాల్లో పేరు నమోదు చేసుకున్న గర్భిణులకు నెలనెలా ఇవ్వాల్సిన బియ్యం, పప్పు, నూనెలు రెండు నెలలుగా అందడం లేదు. చిన్నపిల్లలకు బియ్యం, పప్పు, నూనె నిలిపివేసి బాలామృతం ఇస్తామని చెప్పిన అధికారులు.. దానిని సక్రమంగా సరఫరా చేయకపోవడంతో ఇంటినుంచే సద్దిపట్టుకునే వెళ్లాల్సి వస్తోంది. ఒక్కో అంగన్వాడీ కేంద్రంలో 100 నుంచి 120 మంది పిల్లలు బాలామృతం ప్యాకెట్ల కోసం పేరు నమోదు చేసుకోగా 40 మందికి కూడా సరిపడా సరఫరా చేయడం లేదు. వచ్చిన ప్యాకెట్లను ఎవరికి అందించాలో తెలియక కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. పెద్దపల్లి, సుల్తానాబాద్ ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఉన్న 385 అంగన్వాడీ కేంద్రాలకు పేరు నమోదు చేసుకున్న ఒక్కో గర్భిణికి కిలో చొప్పున పప్పు మాత్రమే చేరిందని కార్యకర్తలు అంటున్నారు. పప్పు పంపిణీ చేయడం ద్వారా తాము బియ్యం, నూనె స్వాహా చేశామని మహిళలు అనుమానం వ్యక్తం చేస్తున్నారని వాపోతున్నారు. ఈ విషయమై పెద్దపల్లి, సుల్తానాబాద్ ఐసీడీఎస్ సీడీపీవోలు శాంతకుమారి, సరస్వతిని ప్రశ్నించగా బియ్యం కోసం ఉన్నతాధికారులకు నివేదిక పంపించామన్నారు.