అనంతపురం జిల్లాపరిషత్తు, న్యూస్‌లైన్ : వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి (బీఆర్‌జీఎఫ్) ప్రణాళిక అమలులో అంతులేని నిర్లక్ష్యం కన్పిస్తోంది. బీఆర్‌జీఎఫ్ ప్రారంభమైన 2007-08 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2013-14) వరకు చేపట్టాల్సిన అభివృద్ధి పనుల్లో ఏకంగా 4,136 పనులు ప్రారంభమే కాలేదు. వాటి కోసం కేటాయించిన రూ.63.02 కోట్ల నిధులు ఖజానాలో మూలుగుతున్నాయి.
కరువు పీడిత ప్రాంతంగా పేరొందిన ‘అనంత’కు కేంద్ర ప్రభుత్వం బీఆర్‌జీఎఫ్ ద్వారా ఏటా కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేస్తోంది. వీటిని జిల్లా, మండల పరిషత్‌లు, గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీలకు కోటా ప్రకారం కేటాయిస్తున్నారు. ఈ నిధులతో ప్రజలకు అత్యవసరమైన తాగునీరు, పారిశుద్ధ్య పనులు, రహదారులు, అంగన్‌వాడీ భవనాలు, దోబీఘాట్‌ల నిర్మాణం... తదితర పనులు చేపట్టడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే అసంపూర్తిగా ఉన్న కమ్యూనిటీ హాళ్లు పూర్తి చేయడానికి, రచ్చకట్టల నిర్మాణం, పైకా క్రీడల నిర్వహణ, నెడ్‌క్యాప్, వ్యవసాయ... అనుబంధ శాఖలు, సంక్షేమ, విద్య, వైద్య శాఖల పరిధిలోని చిన్న చిన్న పనులు పూర్తి చేయడానికి బీఆర్‌జీఎఫ్ నిధులు ఖర్చు చేస్తున్నారు. ప్రతియేటా వేలాది పనులను గ్రామసభల ద్వారా గుర్తించి జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీ, జిల్లా ప్రణాళిక సంఘం (డీపీసీ) ఆమోదంతో చేపడుతున్నారు. జిల్లాలో బీఆర్‌జీఎఫ్ తొలి పంచవర్ష ప్రణాళిక 2007-08 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభమై 2011-12లో ముగిసింది.
అప్పుడు జిల్లా, మండల పరిషత్‌లకు పాలకవర్గాలు ఉండటంతో మొదటి ఐదేళ్ల ప్రణాళిక సవ్యంగా అమలైనట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. తొలి ఐదేళ్లలో 17,044 పనులు చేపట్టడానికి వీలుగా రూ.156.41 కోట్లు కేటాయించారు. ఇందులో రూ.146.02 కోట్లు వ్యయం చేసి 15,830 పనులు చేపట్టారు. ఇలా మొదటి ఐదేళ్ల ప్రణాళిక ఆశించిన ఫలితాలు ఇవ్వడంతో 2012-13 ఆర్థిక సంవత్సరం నుంచి 2016-17 వరకు మరో ఐదేళ్ల పాటు ప్రణాళిక అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. అయితే.. జిల్లా, మండల పరిషత్‌లకు పాలకవర్గాలు లేకపోవడంతో బీఆర్‌జీఎఫ్ అమలుకు బ్రేక్ పడింది.
గుర్తించిన పనులు కాగితాలకే పరిమితమయ్యాయి. 2012-13లో 2,535 పనులు గుర్తించి... రూ.37.12 కోట్లు కేటాయించారు. అందులో 1,446 పనులను ప్రారంభించి, 279 మాత్రమే పూర్తి చేశారు. వాటి కోసం రూ.11.89 కోట్లు ఖర్చు చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పరిస్థితి మరీ దారుణం. రూ.27.39 కోట్లతో 1,833 పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో తాగునీటి పనులు 594, రహదారులు 390, పారిశుద్ధ్య పనులు 351, సంక్షేమ శాఖల పరిధిలో 138, గ్రామ పంచాయతీ భవనాలకు సంబంధించి 76, విద్యాశాఖ పరిధిలో 58 పనులు, 39 దోబీఘాట్లు, 32 కల్వర్టులు, 26 కమ్యూనిటీ భవనాల పనులున్నాయి.
ఇందులో ఇప్పటిదాకా ఒక్కటి కూడా ప్రారంభించిన దాఖలాలు లేవు. మొత్తమ్మీద తొలి ఐదేళ్లతో పాటు గత రెండేళ్ల ప్రణాళికను లెక్కలోకి తీసుకుంటే ఏడేళ్ల కాలంలో గ్రామసభల ద్వారా 21,412 అభివృద్ధి పనులను గుర్తించారు. వాటికి రూ.220.93 కోట్లు కేటాయించారు. 17,276 పనులను ప్రారంభించి.. 15,800 పూర్తి చేశారు. 1,476 పనులు వివిధ దశల్లో ఉన్నాయి. 4,136 ప్రారంభానికి కూడా నోచుకోలేదు. బడ్జెట్ విషయానికొస్తే మొత్తంగా రూ.220.93 కోట్లు కేటాయించారు. పూర్తయిన పనులకు సంబంధించి రూ.157.91 కోట్లు వ్యయం చేశారు. తక్కిన రూ.63.02 కోట్లు ఖజానాలో మూలుగుతున్నాయి.
అంతులేని నిర్లక్ష్యం!
Published Mon, Jan 20 2014 3:32 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement
Advertisement