అనంతపురం అర్బన్, న్యూస్‌లైన్ : పెరిగిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని వైఎస్సార్ కాంగ్రె స్ పార్టీ అనంతపురం, రాయదుర్గం ఎమ్మెల్యేలు గురునాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ గురువారం వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు పార్టీ కార్యాలయం నుంచి ఖాళీ సిలిండర్లను తలపై పెట్టుకుని సప్తగిరి సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ మానవహారం నిర్మించి.. పెరిగిన గ్యాస్ ధరలను తగ్గించాలని నినాదాలు చేశారు. ఎమ్మెల్యే గురునాథరెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ధ్వజమెత్తారు.
యూపీఏ సర్కారు ధరలను ఇష్టారాజ్యంగా పెంచుతోందన్నారు. కరెంటు, డీజిల్, పెట్రోలు ధరలతోపాటు గ్యాస్ ధరను పెంచి సామాన్యుడి నడ్డివిరుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజావ్యతిరేక విధానాలను అనుసరించిన ఏ ప్రభుత్వానికైనా ఓటమి తప్పదని.. అందుకు నిదర్శనమే టీడీపీ అని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలు కాంగ్రెస్‌కు తప్పకుండా బుద్ధి చెబుతారన్నారు. ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. వినాశకాలే విపరీత బుద్ధి అన్న నానుడి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సరిగ్గా సరిపోతుందన్నారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ధరలు పెరిగితే కేంద్రంతో పోరాడి తగ్గించే వారన్నారు. ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు వారి సీట్లు కాపాడుకోవడమే తప్ప ప్రజా సమస్యలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు.
పభుత్వ వ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాడుతామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నేత ఎర్రిస్వామిరెడ్డి, అధికార ప్రతినిధులు చింతకుంట మధు, యువజన విభాగం రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు గువ్వల శ్రీకాంత్‌రెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు బండి పరుశురాం, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కొర్రపాడు హుసేన్‌పీరా, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు లింగాల రమేష్, మహిళా విభాగ ం జిల్లా అధ్యక్షురాలు బోయ సుశీలమ్మ, నగరాధ్యక్షురాలు శ్రీదేవి, విజయశాంతి, రాజేశ్వరి, ప్రశాంతి, లక్ష్మి, విద్యార్థి విభాగం నగరాధ్యక్షుడు మారుతీ, యువత విభాగం నగరాధ్యక్షుడు మారుతీనాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఈ ప్రభుత్వాలపై బండపడా..
Published Fri, Jan 3 2014 2:46 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement